
మొగదీషు: సోమాలియాలో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు రాజధాని మొగదీషులోని లిడో బీచ్‌కు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. బీచ్ హోటల్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుడులో మొత్తం 32 మంది మృతిచెందగా మరో 63 మంది గాయపడ్డారు.
మొగదీషులోని బీచ్‌లోని ఓ హోటల్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపి అక్కడున్నవారిని భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం ఉగ్రవాదుల్లో ఒకరు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో చాలా మంది చనిపోయారు. పేలుడు తీవ్రతకు బీచ్‌లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉగ్రవాదుల దాడి సమాచారమందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందించారు. మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్‌ఖైదాతో సంబంధాలున్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment