పేరుపాలెం బీచ్‌లో మృత్యు ఘంటికలు | Beach Deaths In Perupalem Beach West Godavari | Sakshi
Sakshi News home page

పేరుపాలెం బీచ్‌లో మృత్యు ఘంటికలు

Published Tue, Sep 11 2018 7:18 AM | Last Updated on Tue, Sep 11 2018 7:18 AM

Beach Deaths In Perupalem Beach West Godavari - Sakshi

ప్రాణాలు కోల్పోయిన స్నేహితుడి మృతదేహాన్ని ఒడ్డుకు తెస్తున్న యువకులు (ఫైల్‌)

పశ్చిమగోదావరి, నరసాపురం/మొగల్తూరు: గత 15 ఏళ్లలో పేరుపాలెం బీచ్‌లో 180 మంది వరకూ మృత్యువాత పడ్డారు. ఇందులో చాలా మృతదేహాలను నా అన్నవాళ్లు చూసుకోనే లేదు. ఇవి పేరుపాలెం బీచ్‌లోని హృదయ విదారక ఘట్టాలు. గత 15 సంవత్సరాలలో పేరుపాలెం బీచ్‌లో ఏటా సగటున 10 నుంచి 12  మంది ప్రాణాలు కోల్పోతున్నట్టుగా  రికార్డులు చెప్తున్నాయి. ఇది మామూలు విషయం కాదు. ఇంత ప్రమాదకర పరిస్థితి ఉన్నా.. కనీసం ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. పేరుపాలెం బీచ్‌ పరిస్థితిపై చర్చ చేపట్టిన సందర్భమూ లేదు. పర్యాటక కేంద్రంగా పేరుపాలెం బీచ్‌ను తీర్చి  దిద్దుతామని తరచూ చెప్పే మాటలు, ప్రకటనలు మాత్రమే  ప్రజాప్రతినిధుల నుంచిఅధికారుల నుంచి విన్పిస్తుంటాయి.

బీచ్‌లో గల్లంతైతే వారి కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతం. మృతదేహం దొరికే వరకూ విస్తృతంగా గాలించాలి. దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. వ్యక్తి దూరమైన బాధ ఒకవైపు, కనీసం చివరిచూపునకు కూడా నోచుకోలేకపోయామే అనే బాధ మరోవైపు. బీచ్‌లో గల్లంతైతే పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేస్తారు. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే చంద్రన్న బీమాలాంటి పథకాలు కూడా వీరి కుటుంబాలకు వర్తించవు. ఎల్‌ఐసీలు, ఇతర ఇన్సూరెన్స్‌లు ఉన్నా కూడా వాటిని క్లెయిమ్‌ చేసే సందర్భంలో నానా తిప్పలు. దీంతో బీచ్‌లో ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 

విచ్చల విడిగా మద్యం
15 సంవత్సరాల నుంచి పేరుపాలెం బీచ్‌కు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. పక్కజిల్లాల నుంచి కూడా జనం వస్తున్నారు. అంతకు ముందు బీచ్‌కు ఎవరూ వచ్చేవారు కాదు. కొన్నేళ్లు క్రితం వరకూ కేవలం కార్తీకమాసంలోనే సందర్శకుల తాకిడి ఉండేది. ఇప్పుడు వారాంతపు రోజుల్లోనూ, సెలవు దినాల్లోను రద్దీగా ఉంటుంది. మామూలు రోజుల్లో కూడా జనం రద్దీ పెరిగింది. ముఖ్యంగా యువకులు సరదా మోజులో, వచ్చే ప్రమాదాలను గుర్తించకుండా బీచ్‌లో లోతుకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. కుటుంబ సభ్యులకు అంతులేని విషాదం మిగుల్చుతున్నారు.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా
పేరుపాలెం బీచ్‌ ఇటీవల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. బీచ్‌లో మద్యం సేవించడం, పేకాట సర్వసాధారణమై పోయాయి. అదీ కాకుండా దూరప్రాంతాల నుంచి ప్రేమజంటలు రావడం, వారి వెకిలి చేష్టలు, మిగిలిన వారికి ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఇదిలా ఉంటే బీచ్‌కు వచ్చే ప్రేమజంటలను, అల్లరి చేస్తామంటూ బెదిరించి వారివద్ద నుంచి బంగారు వస్తువులను కాజేసే ముఠాలు తయారయ్యాయని  చెప్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో బీచ్‌ కేంద్రంగా నేర సంస్కృతి పెరిగే అవకాశం ఉంది.

ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందోనని భయం
నిజానికి పేరుపాలెం బీచ్‌ ప్రమాదకరమని, ఇక్కడ స్నానాలు చేయడానికి అనువుకాదని నిపుణులు చెప్తూ వస్తున్నారు. కానీ ఇక్కడకు వచ్చేవారు ఇవేమీ పట్టించుకోవడం లేదు. బీచ్‌లోకి వచ్చేవారు మద్యం తేకుండా, సేవించకుండా చూడటం, లోతుకు వెళ్ళకుండా చూడటం, అసాంఘిక కార్యక్రమాలు జరక్కుండా చూడటం వంటి అంశాలపై నిరంతరం నిఘా ఉంటేనే గానీ పరస్థితి చక్కబడదు.
ముఖ్యంగా మద్యం బీచ్‌లోకి రాకుండా చెక్‌పోస్టులు పెట్టాలి. బెల్ట్‌షాపులు నియంత్రించాలి. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమంటే ఈ నిర్ణయాలు అమలు చేయాలి. ఎలాగూ కార్తీకమాసం సమీపిస్తోంది. ఇప్పటికైనా బీచ్‌ పరిస్థితిపై దృష్టి పెట్టకపోతే.. ఈ పవిత్ర మాసంలో కూడా మరికొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది.

కాపలా ఉంటుంది
ఆదివారాల్లో కానిస్టేబుళ్లను కాపలా ఉంచుతున్నాం. రద్దీగా ఉన్నప్పుడు కానిస్టేబుల్‌ అక్కడ ఉంటున్నారు. ఎవరికి వారు, వ్యక్తిగత భద్రత తీసుకోవాలి. మద్యం సేవించి బీచ్‌లోకి దిగితే, ఎవరూ ఏమీచేయలేరు. సిబ్బంది కొరత కారణంగా పదుల సంఖ్యలో కాపలా పెట్టలేము.  తల్లితండ్రులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఎక్కడికి వెళుతున్నారు, పరిస్థితి ఏమిటి అనే దానిపై ఆరా ఉండాలి. రాబోయే కార్తీకమాసంలో బీచ్‌లో గట్టి చర్యలు చేపడతాము.     – ఎం.సుబ్బారావు, సీఐ నరసాపురం

విద్యార్థులనుఒంటరిగా పంపకూడదు
విద్యార్థులను ఒంటరిగా బీచ్‌కు పంపకూడదు. బీచ్‌కు వెళతామని ఇంట్లో చెప్తే, కచ్చితంగా వారిని వారించాలి. బీచ్‌లో ఎక్కువగా ఇంజనీరింగ్‌ విద్యార్థులు, యువకులే చనిపోతున్నారు. అసలు ఈ బీచ్‌లో ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయో అధ్యయనం చేయించాలి.    – ప్రొఫెసర్‌ సీహెచ్‌ శ్రీనివాస్, వైఎన్‌ కళాశాల అధ్యాపకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement