సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఇటీవల హైదరాబాద్–భోపాల్‌లలో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేయడానికి ఈ మాడ్యూల్స్ సిద్ధమయ్యాయని, వీటికి విదేశాల నుంచి ఆదేశాలు అందుతున్నాయని ప్రాథమిక ఆధారాలు లభించాయి. మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్ సహా ముగ్గురి నుంచి రికవరీ చేసిన ఫోన్లను ఏటీఎస్ అధికారులు విశ్లేషించారు. అవసరమైతే ఆత్మాహుతి దాడులకు సిద్ధం కావాలంటూ ఓ వ్యక్తి నుంచి వీరికి ఆదేశాలు అందినట్టు గుర్తించారు.
ఫోన్ల నుంచి ఆడియోలు రికవరీ
ఏటీఎస్ అధికారులు అరెస్టు చేసిన 16 మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఉగ్రవాదులు సమాచార మారి్పడికి రాకెట్ చాట్, త్రీమా యాప్స్ వినియోగించారని.. ఎప్పటికప్పుడు డేటాను డిలీట్ చేయడం వల్ల కీలకమైన సమాచారమేదీ లభించలేదని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా 50 ఆడియో ఫైళ్లను రికవరీ చేసినట్టు సమాచారం.
ఈ ఆడియోల్లో ప్రసంగించిన వ్యక్తి.. ఒకేసారి అనేక మందిని చంపడం (మాస్ కిల్లింగ్), సాబోటేజ్ (విధ్వంసాలు సృష్టించడం), ఎంపిక చేసుకున్న వ్యక్తులను హతమార్చడం (టార్గెట్ కిల్లింగ్)తోపాటు ఆత్మాహుతి (ఫిదాయీన్) దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తేల్చారు. ఈ ఆడియోలతోపాటు వీరికి అందిన ఆదేశాలు, సూచనల సందేశాలూ రికవరీ అయ్యాయి. ఇక ఈ ఫోన్లకు పాకిస్తాన్ నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని, కాంటాక్ట్స్ లిస్టులోనూ ఆ దేశ నంబర్లు ఉన్నాయని గుర్తించారు. ఆ ఫోన్ నంబర్లు ఎవరివి, ఆడియోల్లోని వ్యక్తి ఎవరు అనేది గుర్తించేందుకు కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి.
కొన్ని ఆడియోల్లో కఫీల్ అహ్మద్ ప్రస్తావన
ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన ఆడియోల్లో లండన్‌లోని గ్లాస్గో విమానాశ్రయంపై 2007లో మానవ బాంబు దాడికి ప్రయత్నించిన బెంగళూరు వాసి, వృత్తిరీత్యా డాక్టర్ అయిన కఫీల్ అహ్మద్ ప్రస్తావన ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఇతను హిజ్బ్ ఉత్ తెహరీర్ (హెచ్‌యూటీ) సంస్థ తరఫునే మానవబాంబుగా మారాడు. హైదరాబాద్–¿ోపాల్ మాడ్యూల్ ఉగ్రవాదులూ తొలినాళ్లలో ఇదే ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేశారు. ఈ క్రమంలో ఫోన్లలోని ఆడియోలు హెచ్‌యూటీ హ్యాండ్లర్‌విగా భావిస్తున్నారు. ఇక ఏటీఎస్ విచారిస్తున్న 16 మంది పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. మరో ఐదు రోజులు కస్టడీ కోరాలని ఏటీఎస్ భావిస్తోంది. ఈ కేసులో మరో ముగ్గురు హైదరాబాద్ వాసులను సాక్షులుగా చేరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment