సాక్షి, అమరావతి: ఆపదలో విలవిల్లాడే పేద కుటుంబాలకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాల క్లెయిమ్‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 4 రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ను 30 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. దీన్ని అమలుచేసే బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్లకు (గ్రామ, వార్డు సచివాలయాలు–అభివృద్ధి) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్ బీమా, రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం చెల్లింపు, వైఎస్సార్ మత్స్యకార భరోసా పరిహారం, వైఎస్సార్ పశునష్ట పరిహారం పథకాల అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించడమే కాకుండా క్లెయిమ్ సొమ్మును సంబంధిత కుటుంబాలకు వారి ఇంటివద్దే వలంటీర్ల ద్వారా అందించాలని నిర్ణయించింది.
బీమా క్లెయిమ్స్ పరిష్కారంలో తీవ్రజాప్యం జరుగుతుండటాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ బీమా పథకం అమల్లో సమూల మార్పులు తీసుకొచ్చారు. బీమా పరిహార ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించడం ద్వారా మరణించిన లేదా బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇప్పటికే అనేక ప్రభుత్వ సేవలను వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే అందిస్తున్న తరహాలోనే ఈ బీమా పథకాల పరిహారం కూడా అందించనుంది.
ఈ క్లెయిమ్‌ల పరిష్కారం విషయమై జాయింట్ కలెక్టర్ 15 రోజులకోసారి జిల్లా, మండల, పట్టణ స్థానికసంస్థల అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించి కలెక్టర్‌కు నివేదికను ఇవ్వాలని, కలెక్టర్ నెలకోసారి సమీక్షించి గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్ నెలవారీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. బీమా పథకాలు సజావుగా సకాలంలో అమలవుతున్నాయా లేదా అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి సమీక్షించనుంది.
4 బీమా పథకాలు..
►పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి.. 18 నుంచి 50 ఏళ్ల వయసులోపు సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి లక్ష రూపాయలను పరిహారంగా ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల వయసులోపు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందినా 5 లక్షల రూపాయలను బీమా ద్వారా పరిహారం చెల్లిస్తుంది.
►వ్యవసాయ కారణాలతో రైతులు, కౌలు రైతులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధిత కుటుంబానికి పునరావాస ప్యాకేజీ కింద రూ.7 లక్షల పరిహారం చెల్లించాలి.
►చేపలవేట సమయంలో 18 నుంచి 60 ఏళ్ల వయసులోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి.
►వైఎస్సార్ పశునష్ట పరిహార పథకం కింద గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు మరణిస్తే ప్రభుత్వం నిర్ధారించిన పరిహారాన్ని చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment