బీమా కంపెనీలకే లాభాల ‘పంట’  | Benefits to insurance companies not for farmers | Sakshi
Sakshi News home page

బీమా కంపెనీలకే లాభాల ‘పంట’ 

Published Sat, Dec 15 2018 2:53 AM | Last Updated on Sat, Dec 15 2018 2:53 AM

Benefits to insurance companies not for farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంటల బీమా పథకాల ద్వారా రైతులు బాగుపడుతున్నారా... లేదంటే బీమా కంపెనీలు బాగుపడుతున్నాయా... అంటే కంపెనీలే బాగుపడుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదికే అందుకు నిలువెత్తు సాక్ష్యం. 2016–17 ఖరీఫ్, రబీల్లో కంపెనీలకు రైతులవాటా, రైతుల తరఫున ప్రభుత్వం చెల్లించిన వాటా కలిపి మొత్తం ప్రీమియం సొమ్ము రూ.22,345 కోట్లు. కానీ, బీమా కంపెనీలు ఆ ఏడాది రైతులకు చెల్లించిన పరిహారం రూ.16,279 కోట్లు మాత్రమే. అంటే, ఆ ఒక్క ఏడాదిలోనే బీమా కంపెనీలు రూ.6,066 కోట్ల లాభం పొందాయి. 2017–18 ఖరీఫ్‌లో రైతుల, ప్రభుత్వం వాటా కలిపి బీమా కంపెనీలకు చెల్లించిన ప్రీమియం రూ.19,767 కోట్లు, కాగా కంపెనీలు రైతులకు చెల్లించిన పరిహారం రూ.16,967 కోట్లే. ఒక్క ఖరీఫ్‌ సీజన్‌లో కంపెనీల లాభం రూ.2,799 కోట్లు అన్నమాట. ఈ 3 సీజన్లలో బీమా కంపెనీలు రైతులు, ప్రభుత్వం నుంచి వసూలు చేసిన ప్రీమియం సొమ్ము రూ.42,112 కోట్లు కాగా, రైతులకు ఆ కంపెనీలు చెల్లించిన ప్రీమియం రూ.33,247 కోట్లు మాత్రమే. ఆయా కంపెనీలు చేసిన దోపిడీ రూ.8,865 కోట్లు కావడం గమనార్హం. ఒకవైపు అప్పులు పెరిగి దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరోవైపు కంపెనీలు వారి ప్రీమియంతో కోట్లు కూడబెట్టుకుంటున్నాయి.  

రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి... 
ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌ బీవై), పునర్నిర్మిత వాతావరణ ఆధారిత పంటల బీమా(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌) పథకాలను కేంద్రం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ 2 పథకాలను 2016–17 నుంచి అమలు చేస్తోంది. అంతకుముందు కేంద్రమే మరోపేరుతో పంటల బీమా పథకాలను అమలుచేసింది. అంతకుముందు ప్రభుత్వ బీమా కంపెనీయే పంటలబీమాను అమలు చేయగా, ఈ 2 పథకాలను ప్రవేశపెట్టాక ప్రైవేటుబీమా కంపెనీలకూ చోటు కల్పించారు. మొత్తంగా రాష్ట్రంలోనూ గత కొన్నేళ్లుగా కంపెనీ లే భారీ లాభాలు గడించాయి. కొన్నేళ్లు 2 రెట్లయితే, ఒకసారైతే ఏకంగా 3 రెట్లు లాభాలు గడిం చడం గమనార్హం. లాభాలు గణనీయంగా ఉన్నా బీమాకంపెనీలు ఏడాదికేడాదికి ప్రీమియం రేట్లను భారీగా పెంచుతున్నాయి.

2013–14లో రాష్ట్రంలో రైతులు, ప్రభుత్వం కలిపి పంటల ప్రీమియంగా రూ.137.60 కోట్లు చెల్లిస్తే, రైతు లకు క్లెయిమ్స్‌ కింద అందింది రూ. 56.39 కోట్లే. ఆ ఏడాది 8.52 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లిస్తే 1.18 లక్షలమంది రైతులే లబ్ధిపొందారు. 2014–15 వ్యవసాయ సీజన్‌లో 10 లక్షలమంది రైతులు రూ.145.97 కోట్లు ప్రీమియం చెల్లిస్తే, 1.80 లక్షలమంది రైతులు రూ. 78.86 కోట్ల పరిహారం మాత్రమే అందుకున్నారు. 2015–16 లో 7.73 లక్షలమంది రైతులు రూ.145.71 కోట్ల ప్రీమియం చెల్లిస్తే, రూ.441.79 కోట్లు పరిహారంగా వచ్చిందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 2016–17 లో 9.75 లక్షలమంది రైతులు రూ. 294.29 కోట్లు చెల్లిస్తే, 2.35 లక్షలమంది రైతులకు రూ. 178.49 కోట్లు పరిహారం గా దక్కాయి. కంపెనీలు మాత్రం నానా కొర్రీలు పెడుతూ పరిహారం ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నాయి. 2014–15 వ్యవసాయ సీజన్‌లో 10 లక్షలమంది రైతులు రూ. 145.97 కోట్ల ప్రీమియం చెల్లిస్తే, 1.80 లక్షల మంది రైతులకు రూ.78.86 కోట్ల పరిహారం అందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement