రక్షణా...రాబడా?
పసిపాప దగ్గర్నుంచి పదవీ విరమణ చేసే వ్యక్తుల వరకు అనేక రకాల బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బీమా కంపెనీలు కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అందుబాటులో ఉన్న వివిధ బీమా పథకాలు, అవి అందించే ప్రయోజనాలు, ఎవరికి అనువుగా ఉంటాయన్న విషయాలపై అవగాహన పెంచేదే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం.
బీమా పాలసీలపై నిపుణుల అభిప్రాయాలు రెండు రకాలుగా ఉంటాయి.
ఆపద సమయంలో ఆర్థికంగా తోడ్పాటునిచ్చే సాధనంగానే బీమాను చూడాలన్నది కొందరి వాదన. బీమా అంటే బహుళ ప్రయోజనకరమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనమని, ఆర్థిక రక్షణతో పాటు పన్ను ప్రయోజనాలు, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చని మరి కొందరు అంటారు. ఒక విధంగా చూస్తే ఈ రెండు వాదనలూ సబబే. అందుకే బీమా కంపెనీలు కూడా ఇరు వర్గాల అభిప్రాయాలకు అనుగుణంగా పథకాలను విడుదల చేస్తున్నాయి. అందించే ప్రయోజనాలను బట్టి బీమా పథకాలను ఏడు రకాలుగా విభజించొచ్చు. ఇప్పుడు వీటి గురించి విడివిడిగా తెలుసుకుందాం.
ఎండోమెంట్ ప్లాన్
బీమా రక్షణతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఎండోమెంట్ పథకాలు అనువుగా ఉంటాయి. పిల్లల చదువు, పెళ్లి, సొంతింటి నిర్మాణం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను ఎండోమెంట్ పథకాల ద్వారా చేరుకోవచ్చు. ఈ పథకాలు నిర్దిష్ట కాలానికి బీమా రక్షణ కల్పిస్తూ, కాలపరిమితి ముగిసిన తర్వాత మెచ్యూర్టీ కింద మొత్తం సొమ్మును ఒకేసారి అందిస్తాయి. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వీటి రాబడి తక్కువగానే ఉంటుంది. ఎండోమెంట్ పాలసీల వార్షిక సగటు రాబడి 5-6 శాతంగా ఉంది.
వీటిపై ఉండే పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే రాబడి 10 శాతం దాటుతుందని ఆర్థిక నిపుణుల అంచనా. కట్టిన ప్రీమియంపై పన్ను ప్రయోజనాలతో పాటు, మోచ్యూర్టీ కింద వచ్చే లాభంపై కూడా ఎటువంటి పన్ను ఉండదని, అదే బ్యాంకు డిపాజిట్లలో అయితే వడ్డీపై ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. సాధారణంగా ఎండోమెంట్ పాలసీలు 10, 15, 20, 30 ఏళ్ళ కాలపరిమితుల్లో లభిస్తుంటాయి. ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయంతో పాటు బీమా రక్షణ కావాలనుకునే వారికి ఎండోమెంట్ పాలసీలు అనువుగా ఉంటాయి.
మనీ బ్యాక్ ప్లాన్
ఇవి ఎండోమెంట్ పాలసీ లక్షణాలనే కలిగి ఉన్నప్పటికీ వీటి పేరులో ఉన్నట్లుగానే మధ్యమధ్యలో నగదును వెనక్కి ఇస్తుంటాయి. ప్రతీ మూడేళ్లకు ఒకసారి లేదా ఐదేళ్లకు ఒకసారి చొప్పున ఇలా నగదును వెనక్కి ఇస్తుంటాయి. పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి మధ్యమధ్యలో నగదు కావాలనుకునే వారికి మనీ బ్యాక్ పథకాలు అనువుగా ఉంటాయి. మధ్యమధ్యలో కొంత మొత్తం చొప్పున ముందే నగదు తీసుకుంటారు కాబట్టి ఈ మేరకు మెచ్యూర్టీ సమయంలో అందుకునే మొత్తం తగ్గుతుంది. అంతే కాకుండా సాధారణ ఎండోమెంట్ పాలసీల కంటే మనీ బ్యాక్ పాలసీల ప్రీమియం అధికంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనీ బ్యాక్ పాలసీలకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణుల సూచన.
హోల్‌లైఫ్ పాలసీలు
ఇప్పుడు అనేక బీమా కంపెనీలు హోల్‌లైఫ్ పేరిట జీవిత కాలం లేదా 100 ఏళ్ళ వరకు బీమా రక్షణ కల్పిస్తున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జీవితకాలం బీమా రక్షణ లభిస్తుంది. వీటిని చిన్న వయస్సులోనే తీసుకుంటే తక్కువ ప్రీమియంతోనే జీవిత కాలం బీమా రక్షణ పొందవచ్చు.
యులిప్స్...
రిస్క్ చేయగల సామర్థ్యం ఉండి, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడికై స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యులిప్) రూపొందించారు. వీటి పనితీరు ఇంచుమించు మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. యులిప్స్‌లో బీమా రక్షణతో పాటు పన్ను ప్రయోజనాలు అదనం. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి వాటి నుంచి వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తారు.
అందువల్ల వీటి రాబడులపై కచ్చితమైన హామీ ఉండదు. ఇవి దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు. ఐదేళ్ల లాకిన్ పిరియడ్ అయిపోయిన వెంటనే వైదొలగకుండా కనీసం 10 ఏళ్లైనా వేచి చూస్తేనే యులిప్స్ ప్రయోజనాలను పొందగలం అంటున్నారు బీమా నిపుణులు. యులిప్స్‌లో ఉండే అధిక చార్జీలను ఐఆర్‌డీఏ తగ్గించడంతో ఇప్పుడివి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నారు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి లాభాలను అందించడంలో ఈక్విటీలు ముందుంటాయి కాబట్టి దీర్ఘకాలిక లక్ష్యాలకు యులిప్‌లు అనువుగా ఉంటాయి.
పెన్షన్ ప్లాన్స్
పదవీ విరమణ తర్వాత పెన్షన్ కావాలనుకునే వారు ఈ రిటైర్మెంట్ పథకాలను ఆశ్రయించాలి. రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఎండోమెంట్, యులిప్స్‌లో ఒక పెన్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు సాధారణంగా అన్ని బీమా పథకాలు 55 నుంచి 60 ఏళ్ళ వరకు రిటైర్మెంట్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తున్నాయి. ఈ విధంగా సమకూరిన మొత్తాన్ని యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతీ నెలా లేదా మూడు నెలలకు ఒకసారి చొప్పున పెన్షన్ పొందచ్చు. సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచే రిటైర్మెంట్‌కు కేటాయించడం మొదలు పెడితే తక్కువ మొత్తంతోనే ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు.
హెల్త్ పాలసీలు
ఇప్పుడు వైద్య ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేం కాబట్టి అందరూ వైద్య బీమా తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హెల్త్ ఇన్సూరెన్స్‌కు కూడా టర్మ్ పాలసీల మాదిరిగా క్లెయిమ్‌లు తప్ప మెచ్యూర్టీ ఉండదు. వ్యక్తిగత పాలసీలతో పాటు కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి.