నిరుపేదలకు బీమా ధీమా.. | Aam Aadmi Bima Yojana | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు బీమా ధీమా..

Published Fri, Mar 25 2016 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

Aam Aadmi Bima Yojana

 రామచంద్రపురం : కుటుంబ యజమాని ఆకస్మికంగా మృతి చెందితే ఆ కుటుంబంలోనివారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకునేందుకు వివిధ బీమా పథకాలు అమలవుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
 
 ఆమ్ ఆద్మీ బీమా యోజన
 అర్హతలు : గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన యజమాని మాత్రమే ఈ పథకానికి అర్హుడు. వయస్సు 18 నుంచి 58 సంవత్సరాల మధ్య ఉండాలి.
 
 ప్రయోజనాలు : సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాద మరణానికి రూ.75 వేలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.37,500, పూర్తి అంగవైకల్యానికి రూ.75 వేలు, ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు పిల్లలకు 9 నుంచి 12వ తరగతి వరకూ, ఐటీఐ చదువుతున్నవారికి నెలకు రూ.100 చొప్పున ఉపకార వేతనం ఇస్తారు.
 ప్రీమియం : ఈ పథకంలో చేరినవారు ఏడాదికి రూ.320 ప్రీమియం చెల్లించాలి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.160 చెల్లిస్తాయి. పాలసీదారుడు రూ.15 సేవా రుసుము చెల్లిస్తే చాలు.
 
 అన్న అభయహస్తం
 అరవయ్యేళ్లు నిండిన తరువాత బ్యాంకు రుణం పొందే అర్హత కోల్పోయి, సంఘంలో సభ్యత్వ విరమణ పొంది సంపాదించే శక్తి లేని కుటుంబానికి భరోసా ఇచ్చే పథకం ఇది. దీనిని 2009 నుంచి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అన్న అభయహస్తంగా పేరు మార్చారు. 2009-10 నుంచి అభయహస్తం పథకంలో నమోదైన స్వయంసహాయ సంఘాల్లో అర్హులైన మహిళలకు జనశ్రీ బీమా యోజన(జేబీవై)లో ప్రయోజనం కల్పిస్తారు.
 
 అర్హతలు : సంఘ సభ్యురాలై ఉండాలి. బియ్యం కార్డు ఉండి 18-59 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నారు అర్హులు.
 
 ప్రయోజనాలు : 60 సంవత్సరాలు పైబడినవారికి ప్రతి నెలా రూ.500 నుంచి రూ.2,200 వరకూ పింఛను మంజూరు చేస్తారు. సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాద మరణం సంభవిస్తే రూ.75 వేలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.37,500, పూర్తి అంగవైకల్యానికి రూ.75 వేలు ఇస్తారు. ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు పిల్లలకు 9 నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న వారికి  నెలకు రూ.100 చొప్పున ఉపకార వేతనం  ప్రతి ఆరు నెలలకు అందిస్తారు.
 
 ప్రీమియం : నమోదైన ప్రతి సభ్యురాలు సంవత్సరానికి రూ.365 ప్రీమియం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం అంతే మొత్తాన్ని ప్రభుత్వ వాటాగా సభ్యురాలి ఖాతాకు జమ చేస్తుంది. ఈ రెండు మొత్తాలను సభ్యురాలి పింఛను ఖాతాకు జమ చేస్తారు. సభ్యురాలు ఏటా రూ.20 సేవా రుసుముగా చెల్లించాలి.
 
 జనశ్రీ బీమా యోజన
 మహిళా స్వయంసహాయ సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ  సభ్యుల భర్తలకు జనశ్రీ బీమా యోజన అమలు చేస్తున్నారు.
 
 అర్హతలు : 18 నుంచి 58 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
 ప్రయోజనాలు : సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాద మరణానికి రూ.75 వేలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.37,500, పూర్తి అంగవైకల్యానికి రూ.75 వేలు చెల్లిస్తారు.
 ప్రీమియం : పాలసీదారు రూ.150 ప్రీమియం, రూ.15 సేవా రుసుము చెల్లించాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement