Ramacandrapuram
-
రూ. 500 వెండి నోటు
అవునండీ మీరు విన్నది నిజమే..మోదీ పరిచయం చేసిన కొత్త రూ. 500 నోటుకు డిటోగా వెండి నోటు మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇది ప్రభుత్వమో, రిజర్వు బ్యాంకో విడుదల చేసింది మాత్రం కాదు. కొందరు జ్యువెలరీ షాపు యజమానులు అయినవారికి బహుమతిగా ఇచ్చేందుకు ఈ నోటును తయారు చేశారు. తులం వెండితో రూపొందించిన ఈ నోటును వ్యాపారులు రూ. 500 కే విక్రయిస్తున్నారు. –రామచంద్రపురం రూరల్ (రామచంద్రపురం) -
కామెడీతోనే సగటు ప్రేక్షకుడికి రిలీఫ్
ప్రముఖ కామెడీ ఆర్టిస్ట్ సుమన్ శెట్టి సగటు ప్రేక్షకుడు సినిమాల్లో కామెడీతోనే రిలీఫ్ అవుతాడని ప్రముఖ కామెడీ ఆర్టిస్ట్ పాశర్ల సుమన్ శెట్టి అన్నారు. ద్రాక్షారామలోని భీమేశ్వర దంత వైద్యశాల ఏడో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలివీ.. సాక్షి : సినిమాల్లోకి ఎలా వచ్చారు? సుమన్ శెట్టి : అప్పట్లో చిత్రం సినిమా మాగజైన్లో కొత్త నటీనటులు కావాలని చూసి తేజ గారికి నా ఫోటోలు పంపాను. హైదరాబాద్ ఆడిషన్స్‌కి రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. అక్కడ ఆడిషన్స్‌లో నన్ను సెలక్ట్ చేశారు. సాక్షి : మీకు బాగా పేరు తెచ్చిన సినిమా? సుమన్ శెట్టి: మొదటి సినిమా జయంలోనే మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. అలాగే 7/జీ బృందావనం కాలనీ సినిమాకు తమిళంలో నంది అవార్డు(తమిళంలో వెరైటీ అవార్డుగా పిలుస్తారు) వచ్చింది. యజ్ఞం, రణం, నిజం తదితర సినిమాల్లో మంచి పేరు వచ్చింది. ఇప్పటి వరకు సుమారు 380 సినిమాలు చేశాను. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న ప్రేమభిక్ష, హర్రర్ మూవీ 12ఓ క్లాక్ సినిమాలు చేస్తున్నాను. సాక్షి: మీరు ఇష్టపడే సినిమాలు? సుమన్ శెట్టి: కచ్చితంగా కామెడీ సినిమాలే. ఎందుకంటే సగటు ప్రేక్షకుడు రిలీఫ్ కోసం సినిమాకు వస్తాడు. సాక్షి: కామెడీ చిత్రాల ఉరవడి తగ్గింది కదా? సుమన్ శెట్టి : కొంతకాలంగా హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఎప్పడు ఏ ట్రెండ్ నడిచినా కామెడీకి తగిన ప్రాధాన్యం ఉంటుంది. దీనికి ఉదాహరణ ఇప్పటి హర్రర్ సినిమాలే. వాటితో భయపెట్టాలని కాకుండా నవ్వించాలని చూస్తున్నారు. సాక్షి : కొత్తగా సినిమాల్లోకి వచ్చేవారికి మీరిచ్చే సలహా? సుమన్ శెట్టి : తప్పకుండా కొత్తతరం రావాలి. ప్రతిభ ఉన్నవారికి వెండితెర, బుల్లితెరలు ఎప్పుడూ స్వాగతం పలుకుతాయి. సాక్షి: మీకు ఇష్టమైన నటులు? సుమన్ శెట్టి : రాళ్లపల్లి, అల్లు రామలింగయ్య, రాజబా బు ఇలా పాతతరం హాస్యనటుల ప్రేరణ నా మీద ఎక్కువ. – రామచంద్రపురం రూరల్ (రామచంద్రపురం) -
అనుమానం పెనుభూతమై..
రామచంద్రపురం : అందరితో ఎంతో మంచిగా ఉండే మనిషి ఒక్కసారిగా విగత జీవిగా మారడంతో చూసిన వారు విలవిలలాడారు. కట్టుకున్నవాడే గొంతు కోసి కడతేర్చాడని తెలియడంతో పట్టణంలోని రాజబాబునగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనుమానమే పెనుభూతం కావడంతో భార్యను గొంతు కోసి హతమార్చిన సంఘటన పట్టణంలో శనివారం రాత్రి సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రాజబాబు నగర్‌కు చెందిన ఖండవిల్లి మరియమ్మ(35)కు కె.గంగవరం మండలం పేకేరుకు చెందిన దొరబాబుతో వివాహమయ్యింది. పట్టణంలోని స్టిల్వెల్ పేటలో వీరు నివాసముంటున్నారు. దొరబాబు కార్పొరెంటర్గా పనిచేస్తుం టాడు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కొంత కాలం గా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం తో తరచూ మద్యం తాగి వచ్చి కొడుతుండేవాడు. శనివారం రాజ బాబునగర్‌లో తన అమ్మగారి ఇంటి వద్ద ఉన్న మరియమ్మ వద్దకు వచ్చి గొడవ పడ్డాడు. వీరు గొడవ పడుతుండగా మరియమ్మ తమ్ముడి భార్య ప్రశాంతి మధ్యలోకి రావటంతో గర్భవతిగా ఉన్న ఆమె స్పృహతప్పి పడిపోయింది. దీంతో మరియమ్మ తన తమ్ముడు సహాయంతో ప్రశాంతిని రిక్షాలో ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా ఆస్పత్రి గేటు వద్ద వెనుకనుంచి వచ్చిన దొరబాబు చాకుతో భార్య గొంతుకోశాడు. ఇది గమనించిన ఆమె తమ్ముడు మరియమ్మను ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అప్పటికే మృతిచెందిన ట్టు వైద్యులు ధ్రువీకరించారు. రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. ఎస్సై శ్రీనునాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరియమ్మ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు కన్నీటి పర్యంతమయ్యారు. -
నిరుపేదలకు బీమా ధీమా..
రామచంద్రపురం : కుటుంబ యజమాని ఆకస్మికంగా మృతి చెందితే ఆ కుటుంబంలోనివారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకునేందుకు వివిధ బీమా పథకాలు అమలవుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.. ఆమ్ ఆద్మీ బీమా యోజన అర్హతలు : గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన యజమాని మాత్రమే ఈ పథకానికి అర్హుడు. వయస్సు 18 నుంచి 58 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రయోజనాలు : సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాద మరణానికి రూ.75 వేలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.37,500, పూర్తి అంగవైకల్యానికి రూ.75 వేలు, ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు పిల్లలకు 9 నుంచి 12వ తరగతి వరకూ, ఐటీఐ చదువుతున్నవారికి నెలకు రూ.100 చొప్పున ఉపకార వేతనం ఇస్తారు. ప్రీమియం : ఈ పథకంలో చేరినవారు ఏడాదికి రూ.320 ప్రీమియం చెల్లించాలి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.160 చెల్లిస్తాయి. పాలసీదారుడు రూ.15 సేవా రుసుము చెల్లిస్తే చాలు. అన్న అభయహస్తం అరవయ్యేళ్లు నిండిన తరువాత బ్యాంకు రుణం పొందే అర్హత కోల్పోయి, సంఘంలో సభ్యత్వ విరమణ పొంది సంపాదించే శక్తి లేని కుటుంబానికి భరోసా ఇచ్చే పథకం ఇది. దీనిని 2009 నుంచి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అన్న అభయహస్తంగా పేరు మార్చారు. 2009-10 నుంచి అభయహస్తం పథకంలో నమోదైన స్వయంసహాయ సంఘాల్లో అర్హులైన మహిళలకు జనశ్రీ బీమా యోజన(జేబీవై)లో ప్రయోజనం కల్పిస్తారు. అర్హతలు : సంఘ సభ్యురాలై ఉండాలి. బియ్యం కార్డు ఉండి 18-59 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నారు అర్హులు. ప్రయోజనాలు : 60 సంవత్సరాలు పైబడినవారికి ప్రతి నెలా రూ.500 నుంచి రూ.2,200 వరకూ పింఛను మంజూరు చేస్తారు. సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాద మరణం సంభవిస్తే రూ.75 వేలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.37,500, పూర్తి అంగవైకల్యానికి రూ.75 వేలు ఇస్తారు. ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు పిల్లలకు 9 నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న వారికి నెలకు రూ.100 చొప్పున ఉపకార వేతనం ప్రతి ఆరు నెలలకు అందిస్తారు. ప్రీమియం : నమోదైన ప్రతి సభ్యురాలు సంవత్సరానికి రూ.365 ప్రీమియం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం అంతే మొత్తాన్ని ప్రభుత్వ వాటాగా సభ్యురాలి ఖాతాకు జమ చేస్తుంది. ఈ రెండు మొత్తాలను సభ్యురాలి పింఛను ఖాతాకు జమ చేస్తారు. సభ్యురాలు ఏటా రూ.20 సేవా రుసుముగా చెల్లించాలి. జనశ్రీ బీమా యోజన మహిళా స్వయంసహాయ సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ సభ్యుల భర్తలకు జనశ్రీ బీమా యోజన అమలు చేస్తున్నారు. అర్హతలు : 18 నుంచి 58 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రయోజనాలు : సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాద మరణానికి రూ.75 వేలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.37,500, పూర్తి అంగవైకల్యానికి రూ.75 వేలు చెల్లిస్తారు. ప్రీమియం : పాలసీదారు రూ.150 ప్రీమియం, రూ.15 సేవా రుసుము చెల్లించాలి. -
భార్యను హతమార్చిన భర్త
వెంకటాయపాలెం(రామచంద్రపురం) :కట్టుకున్న భర్తే కాలయముడై ఆమెను అంతమొందించిన విషాద సంఘటన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం ఎస్సీ పేటకు చెందిన తాతపూడి సత్యనారాయణ అలియాస్ సత్తికొండ, వెంకటాయపాలెం శివారు బొడ్డువారిపేటకు చెందిన చిన మంగను (43) ఇరవై ఐదేళ్ల కిత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పదేళ్లవరకు వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం సత్తికొండ భార్యను వేదింపులకు గురిచేసేవాడు. నాలుగేళ్లుగా వీరిద్దరూ విడి గా జీవిస్తున్నారు. చినమంగ కుమారులు శ్రీను, రమేష్‌లతో కలిసి వేరుగా ఉంటున్నారు. అప్పుడప్పుడు సత్తికొండ ఉంటున్న ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో రెండురోజుల క్రితం చినమంగ ఆమె కుమార్తె ఇంటికి జి.మామిడాడ వెళ్లింది. అక్కడకు వెళ్లిన భర్త సత్తికొండతో కలిసి బుధవారం ఉదయం వెంకటాయపాలెం తిరిగి వచ్చారు. రాత్రి సమయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకోవటంతో భార్య తలను గోడకు ఢీకొట్టాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. గురువారం ఉదయం రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ పి.కాశీవిశ్వనాథ్, ద్రాక్షారామ ఎస్సై కె.వంశీధర్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్న కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. -
రామచంద్రపురంలో అగ్నిప్రమాదం
అంటుకున్న బాణసంచా మహిళ పరిస్థితి విషమం రామచంద్రపురం :స్థానిక ముచ్చుమిల్లి రోడ్డులోని ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంతో పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం, ముచ్చుమిల్లి రోడ్డులో సాయిబాబా గుడివద్ద త్రిపురారి వెంకటేశ్వరరావు సొంత ఇంట్లో ఉంటున్నారు. శనివారం సాయంత్రం ఆయన మరదలు వాణి టీ కాస్తూండగా.. గదిలో నిల్వ ఉంచిన బాణసంచాకు ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావటంతో స్థానికులు ఆందోళనతో రోడ్డుమీదకు వచ్చారు. ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే గదిలో ఉన్న సామగ్రి కాలిపోయింది. మంటల్లో చిక్కుకున్న వాణి తీవ్రగాయాలపాలయ్యారు. ఆమెను హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి, పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడనుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఇంట్లో బాణసంచా పేలుతూండటం గమనార్హం. సంఘటన స్థలాన్ని సీఐ పి.కాశీ విశ్వనాథ్, ఎస్సై ఎల్.శ్రీనునాయక్ సందర్శించారు. అగ్నిమాపక అధికారి ఎన్.నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆర్డీవో కె.సుబ్బారావు, తహశీల్దార్ వి.సుబ్బారావు పరిస్థితిని సమీక్షించారు. -
నదుల అనుసంధానం పేరుతో మోసం
రామచంద్రపురం :గోదావరి, కృష్ణా నదులను ఆగస్టు 15 నాటికి అనుసంధానం చేస్తామంటూ సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజలను మభ్యపెడుతున్నారని, పట్టిసీమ పేరుతో ఉభయ గోదావరి జిల్లాల రైతులను మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15 నాటికి లీటరు నీటినైనా కృష్ణానదికి తరలించగలిగితే వారికి శాసనమండలిలో తమ పార్టీ తరఫున సన్మానం చేస్తామని ప్రకటించారు. రామచంద్రపురంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలో నదుల అనుసంధానం చేస్తున్న మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఇరిగేషన్ మంత్రి ప్రకటించటం హాస్యాస్పదమన్నారు. అసలు నిర్మాణం లేకుండా నే పట్టిసీమ ద్వారా నీటిని ఎలా మళ్లిస్తారని ప్రశ్ని ంచారు. నదుల అనుసంధానానికి పునాది వేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డేనని పేర్కొన్నారు. ఆయన హయాంలో నిర్మించిన తాటిపూడి పంపింగ్ స్కీం నుంచి పట్టిసీమ కుడి కాలువకు 14వ కిలోమీటరు వద్ద నీటిని మళ్లించి కృష్ణానదికి అనుసంధానం చేసేందుకు సీఎం, ఇరిగేషన్ మంత్రి యత్నించటం సిగ్గుచేటన్నారు. తాటిపూడి పంపింగ్ స్కీం వద్ద 8 పంపులు ఉండగా 5 పంపుల ద్వారా నీటిని పట్టిసీమ కుడికాలువ ద్వారా విడుదలకు సిద్ధమవుతున్నారన్నారు. పట్టిసీమ కుడికాలువ సుమారు 174 కిలోమీటర్లు కాగా దానిని వైఎస్ హయాంలోనే 135 కిలోమీటర్ల మేర పూర్తి చేశారని, ఇంకా 45 కిలోమీటర్ల కాలువ పనులు చేయాల్సి ఉందని, పనులు కాకుండా తాటిపూడి పంపింగ్ స్కీము నుంచి నీటిని ఎలా మళ్లిస్తారని ప్రశ్నించారు. ‘ఉభయ గోదావరి’ ఎడారే తాటిపూడి పంపింగ్ స్కీం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాలు సాగవుతున్నాయని, 8 పంపుల్లో 5 పంపుల ద్వారా నీటిని మళ్లిస్తే మిగిలిన మూడు పంపుల ద్వారా రైతులకు ఎంతమేర నీటిని అందించగలరని బోస్ ప్రశ్నించారు. పట్టిసీమ జీవోలో ఎక్కడా సాగునీటి ప్రస్తావన లేదని, కేవలం రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలకు నీటిని అందించేందుకే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని విమర్శించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టా ప్రాంతాలను ఎడారి చేసేందుకే చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి నడుంకట్టారని ఆరోపించారు. గోదావరికి వరద సమయంలో నీటిని పంపింగ్ చేస్తామని చెబుతూ పట్టిసీమ వద్ద గోదావరిలో 11 మీటర్ల వద్ద ఫుట్‌వాల్వు ఎందుకు బిగిస్తున్నారని, అదే సమయంలో కృష్ణా నదికీ వరదలు వస్తాయనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. నదుల అనుసంధానం చేస్తామంటున్న ఇరిగేషన్ మంత్రి గోదావరి జలాలను కృష్ణానదిలో ఎక్కడ నిల్వ ఉంచుతారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐ విచారణ వేయించుకోండి..
రామచంద్రపురం :‘ఓటుకు నోటు వ్యవహారంలో మీకు ఎటువంటి ప్రమేయమూ లేకపోతే మీరు సీబీఐ ఎంక్వయిరీ వేయించుకుని విచారణకు సిద్ధం కావాలి. లేనిపక్షంలో తక్షణం రాజీనామా చేసి రాష్ట్ర ప్రజల గౌరవ మర్యాదలను కాపాడాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ పీఏసీ సభ్యుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయంవద్ద బోస్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడారు. నాగిరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని, ఆడియో టేపుల ద్వారా చంద్రబాబు ప్రమేయం ఉన్నట్టు నిరూపణ అయిందని, అయినప్పటికీ తనకే సంబంధమూ లేదని చంద్రబాబు బుకాయిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఆడియో టేపుల వ్యవహారంలో పరకాల ప్రభాకర్ పొంతన లేని ప్రకటనలు చేసి సీఎం ప్రమేయం ఉందని చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్క రోజూ రోడ్డెక్కి నిరసన తెలపలేదని, ఆ విధంగా వైఎస్సార్ పాలన సాగించారని, చంద్రబాబు ఏడాది పాలనకే ప్రజలు నానా అవస్థలూ పడుతూ ఎన్నో ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు బావమరుదులు, తోడల్లుడు, తమ్ముడు రామ్మూర్తి నాయుడులు బాబు రాష్ట్రానికే మోసగాడని గతంలోనే ప్రచారం చేశారన్నారు. 2004లో ‘చంద్రబాబు నయవంచన’ అనే పుస్తకాన్ని బీజేపీ కూడా విడుదల చేసిందన్నారు. ఇలా చంద్రబాబాబు నైజం బయట పడుతున్నా, అటు బీజేపీ నాయకులు, ఇటు లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణవంటి వారు ఓటుకు నోటు వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీ బోస్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి చంద్రబాబునాయుడు నీతిమాలిన రాజకీయాలకు తెర తీశారన్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేటీఆర్ చెప్పిన విధంగా విచారణకు అంగీకరించాలని, లేకుంటే తక్షణం రాజీనామా చేసి రాష్ట్ర మర్యాదను కాపాడాలని డిమాండ్ చేశారు. -
అమెరికా వెళ్లుంటే దక్కేవాడేమో
రామచంద్రపురం, న్యూస్‌లైన్ :ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాల్సిన తమ కుమారుడు ఇలా కుటుంబంతో దూరమై పోయాడని బెంగుళూరు బస్సు ప్రమాదంలో అసువులు భాసిన పలుకూరి నాగవెంకట రాజేష్ తండ్రి వీరభద్రరావు విలపించిన తీరు చూపరులను కలచివేసింది. తమ బిడ్డ అమెరికా వెళ్లుంటే తమకు దక్కేవాడేమోనని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. పట్టణానికి చెందిన రాజేష్, ఆయన భార్య రమ్య, కుమార్తె రిథిమలు బెంగుళూరు నుంచి హైదరబాద్ పెళ్లికి వస్తుండగా వోల్వో బస్సు దుర్ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం పట్టణంలోని రాజేష్ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటి వద్ద శోక సంద్రమైంది. అందరితో సరదాగా ఉండే రాజేష్ కుటుంబం ఇలా మృతి చెందడం ఆయన స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులను దుఃఖ సాగరంలో ముంచెత్తింది. రామచంద్రపురం తహశీల్దార్ పిల్లా రామోజీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ రాజేష్ ఇంటికి వెళ్లి వారిని పరామర్శిచారు. ఈ సందర్భంగా తండ్రి వీరభద్రరావు తన కుమారుడి మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ విలపించారు. బెంగళూరులో అపార్ట్మెంటు తీసుకుని గృహ ప్రవేశం కావాల్సి ఉండగా ఈ ఘోరం జరిగిందని వాపోయారు. ‘గృహ ప్రవేశమైన తర్వాత అమెరికా వెళతాను నాన్న’ అని చెప్పాడని ఇంతలోనే ఇలా జరిగిందని ఆయన విలపించిన తీరు అందరినీ కలిచి వేసింది. హైద రాబాద్‌లో రాజేష్ మృతదేహాన్ని గుర్తుపట్టేందుకు అన్నయ్య కిశోర్, రమ్య తండ్రి సూర్యనారాయణ రక్త నమూనాలను ఇచ్చినట్టు రామచంద్రపురంలో ఉన్న తమ్ముడు బాపిరాజు చెప్పారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం వారం రోజుల్లో మృతదేహాలను అప్పగిస్తారని చెప్పినట్టు ఆయన తెలిపారు. అన్నయ్య కిశోర్ కుటుంబంతో పాటు రమ్య కుటుంబ సభ్యు లు కూడా హైదరాబాద్‌లో ఉన్నట్టు బాపిరాజు తెలిపారు. టీడీపీ నాయకులు పలివెల వెంకట రమణ, ఆరై బొబ్బిలి రాధాకృష్ణ, వీఆర్వో పి.సత్యనారాయణ, న్యాయవాది గుబ్బల శ్రీనివాస్ తదితరులు రాజేష్ తల్లిదండ్రులను ఓదార్చారు.