అమెరికా వెళ్లుంటే దక్కేవాడేమో
Published Fri, Nov 1 2013 1:53 AM | Last Updated on Thu, Apr 4 2019 3:41 PM
రామచంద్రపురం, న్యూస్‌లైన్ :ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాల్సిన తమ కుమారుడు ఇలా కుటుంబంతో దూరమై పోయాడని బెంగుళూరు బస్సు ప్రమాదంలో అసువులు భాసిన పలుకూరి నాగవెంకట రాజేష్ తండ్రి వీరభద్రరావు విలపించిన తీరు చూపరులను కలచివేసింది. తమ బిడ్డ అమెరికా వెళ్లుంటే తమకు దక్కేవాడేమోనని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. పట్టణానికి చెందిన రాజేష్, ఆయన భార్య రమ్య, కుమార్తె రిథిమలు బెంగుళూరు నుంచి హైదరబాద్ పెళ్లికి వస్తుండగా వోల్వో బస్సు దుర్ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం పట్టణంలోని రాజేష్ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటి వద్ద శోక సంద్రమైంది. అందరితో సరదాగా ఉండే రాజేష్ కుటుంబం ఇలా మృతి చెందడం ఆయన స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులను దుఃఖ సాగరంలో ముంచెత్తింది.
రామచంద్రపురం తహశీల్దార్ పిల్లా రామోజీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ రాజేష్ ఇంటికి వెళ్లి వారిని పరామర్శిచారు. ఈ సందర్భంగా తండ్రి వీరభద్రరావు తన కుమారుడి మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ విలపించారు. బెంగళూరులో అపార్ట్‌మెంటు తీసుకుని గృహ ప్రవేశం కావాల్సి ఉండగా ఈ ఘోరం జరిగిందని వాపోయారు. ‘గృహ ప్రవేశమైన తర్వాత అమెరికా వెళతాను నాన్న’ అని చెప్పాడని ఇంతలోనే ఇలా జరిగిందని ఆయన విలపించిన తీరు అందరినీ కలిచి వేసింది.
హైద రాబాద్‌లో రాజేష్ మృతదేహాన్ని గుర్తుపట్టేందుకు అన్నయ్య కిశోర్, రమ్య తండ్రి సూర్యనారాయణ రక్త నమూనాలను ఇచ్చినట్టు రామచంద్రపురంలో ఉన్న తమ్ముడు బాపిరాజు చెప్పారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం వారం రోజుల్లో మృతదేహాలను అప్పగిస్తారని చెప్పినట్టు ఆయన తెలిపారు. అన్నయ్య కిశోర్ కుటుంబంతో పాటు రమ్య కుటుంబ సభ్యు లు కూడా హైదరాబాద్‌లో ఉన్నట్టు బాపిరాజు తెలిపారు. టీడీపీ నాయకులు పలివెల వెంకట రమణ, ఆరై బొబ్బిలి రాధాకృష్ణ, వీఆర్వో పి.సత్యనారాయణ, న్యాయవాది గుబ్బల శ్రీనివాస్ తదితరులు రాజేష్ తల్లిదండ్రులను ఓదార్చారు.
Advertisement