పెళ్లిరోజే పరలోకాలకు.. | pregnant woman dead in sri vijaya sai hospital karimnagar district | Sakshi
Sakshi News home page

కుట్లు విప్పారు.. కాటికి పంపారు

Published Fri, Feb 16 2018 8:49 AM | Last Updated on Fri, Feb 16 2018 8:49 AM

pregnant woman dead in sri vijaya sai hospital karimnagar district - Sakshi

ఆసుపత్రిలో రోదిస్తున్న బంధువులు, రమ్య మృతదేహం, రమ్య కూతురు

వారు గతేడాది ఫిబ్రవరి 15న పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. తొమ్మిదిరోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు. ఏడాది క్రితం ఇద్దరుగా ఉన్నతాము ముగ్గురిగా మారామని సంతోష పడ్డారు. ప్రసవం సమయంలో ఆ తల్లి ఆపరేషన్‌ కాగా.. వైద్యులు కొన్ని కుట్లు తొలగించి.. మరికొన్ని అలాగే ఉంచారు. బంధువులు, కుటుంబసభ్యుల మధ్య పెళ్లిరోజును ఘనంగా జరుపుకుందామని భావించి మిగిలిన కుట్లు తొలగించుకునేందుకు ఆ తల్లి ఆసుపత్రికి చేరింది. కుట్లు తొలగించిన తర్వాత ఇంటికి చేరిన ఆమె.. పదినిమిషాలు కూడా ఉండలేకపోయింది. కళ్లు తిరిగి పడిపోవడం.. ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించడం.. అక్కడ వైద్యులు పరీక్షించేలోపే.. కన్నుమూయడం నిమిషాల వ్యవధిలో జరిగిపోయాయి. జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం జరిగిన ఈ సంఘటన కంటతడి పెట్టించింది.

జమ్మికుంట(హుజూరాబాద్‌): కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ఓగ్గు రమ్యకు అదే గ్రామానికి చెందిన అనిల్‌తో గతేడాది ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. రమ్య గర్భం దాల్చినప్పటినుంచి పట్టణంలోని శ్రీవిజయసాయి ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటోంది. ఈ నెల 7న పురిటి నొప్పులు రావడంతో బంధువులు ఆమెను అదేరోజు ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్‌ చేసి పండంటి పాపకు పురుడు పోశారు. ఆపరేషన్‌ సమయంలో కుట్లు వేసిన వైద్యులు.. ఈనెల 12న కొన్నికుట్లు విప్పి ఇంటికి పంపించారు. ఫిబ్రవరి 15న పెళ్లిరోజు కావడంతో బంధువుల మధ్య ఘనంగా జరుపుకుందామనే ఉద్దేశంతో రమ్య మిగితా కుట్లు విప్పించుకునేందుకు గురువారం ఆస్పత్రికి వచ్చింది. అనిల్‌ గోదావరిఖనిలో పండ్లు విక్రయించేందుకు వెళ్లాడు. కుట్లు విప్పిన తర్వాత రమ్యను ఇంటికి పంపించారు. ఏం జరిగిందోగానీ.. ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే రమ్య కళ్లు తిరుగుతున్నాయంటూ కుటుంబసభ్యులకు చెప్పడంతో వెంటనే ఆటోలో మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి రాగా వైద్యుడు రమ్యను పరీక్షించి స్ట్రెచర్‌పై ఆక్సిజన్‌ ఏర్పాటు చేశాడు. కొద్ది సేపటికే మృతి చెందింది.

వైద్యుల నిర్లక్ష్యమేనంటూ ఆందోళన
రమ్య మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కోపంతో ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్‌ సంఘటనస్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపు చేశారు. మృతదేహం ఆస్పత్రిలోనే ఉంది.

పెళ్లిరోజే పరలోకాలకు వెళ్లావా బిడ్డ..
సరిగ్గా ఏడాది క్రితం రమ్యకు అనిల్‌తో వివాహం కా గా.. తిరిగి అదేరోజు కన్నుమూయడంపై బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ‘అయ్యో దేవుడా.. ఎంతపనిచేస్తివి.. పాపకు జన్మనిచ్చి.. కడుపార చూసుకోకముందే.. కానరాని లోకాలకు తీసుకెళ్లా వా..’ అంటూ బంధువులు, కుటుంబసభ్యులు రోదించిన తీరు కన్నీరు తెప్పించింది. గోదావరిఖని నుంచి వచ్చిన అనిల్‌ భార్య మృతదేహంపై ఏడుస్తుండగా ఆపడం ఎవరితరమూ కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement