రామచంద్రపురం :‘ఓటుకు నోటు వ్యవహారంలో మీకు ఎటువంటి ప్రమేయమూ లేకపోతే మీరు సీబీఐ ఎంక్వయిరీ వేయించుకుని విచారణకు సిద్ధం కావాలి. లేనిపక్షంలో తక్షణం రాజీనామా చేసి రాష్ట్ర ప్రజల గౌరవ మర్యాదలను కాపాడాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ పీఏసీ సభ్యుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయంవద్ద బోస్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడారు. నాగిరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని, ఆడియో టేపుల ద్వారా చంద్రబాబు ప్రమేయం ఉన్నట్టు నిరూపణ అయిందని, అయినప్పటికీ తనకే సంబంధమూ లేదని చంద్రబాబు బుకాయిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఆడియో టేపుల వ్యవహారంలో పరకాల ప్రభాకర్ పొంతన లేని ప్రకటనలు చేసి సీఎం ప్రమేయం ఉందని చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్క రోజూ రోడ్డెక్కి నిరసన తెలపలేదని, ఆ విధంగా వైఎస్సార్ పాలన సాగించారని, చంద్రబాబు ఏడాది పాలనకే ప్రజలు నానా అవస్థలూ పడుతూ ఎన్నో ఆందోళనలు చేస్తున్నారని అన్నారు.
ఎన్టీఆర్, చంద్రబాబు బావమరుదులు, తోడల్లుడు, తమ్ముడు రామ్మూర్తి నాయుడులు బాబు రాష్ట్రానికే మోసగాడని గతంలోనే ప్రచారం చేశారన్నారు. 2004లో ‘చంద్రబాబు నయవంచన’ అనే పుస్తకాన్ని బీజేపీ కూడా విడుదల చేసిందన్నారు. ఇలా చంద్రబాబాబు నైజం బయట పడుతున్నా, అటు బీజేపీ నాయకులు, ఇటు లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణవంటి వారు ఓటుకు నోటు వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీ బోస్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి చంద్రబాబునాయుడు నీతిమాలిన రాజకీయాలకు తెర తీశారన్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేటీఆర్ చెప్పిన విధంగా విచారణకు అంగీకరించాలని, లేకుంటే తక్షణం రాజీనామా చేసి రాష్ట్ర మర్యాదను కాపాడాలని డిమాండ్ చేశారు.
సీబీఐ విచారణ వేయించుకోండి..
Published Wed, Jun 10 2015 12:23 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement