రామచంద్రపురం :గోదావరి, కృష్ణా నదులను ఆగస్టు 15 నాటికి అనుసంధానం చేస్తామంటూ సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజలను మభ్యపెడుతున్నారని, పట్టిసీమ పేరుతో ఉభయ గోదావరి జిల్లాల రైతులను మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15 నాటికి లీటరు నీటినైనా కృష్ణానదికి తరలించగలిగితే వారికి శాసనమండలిలో తమ పార్టీ తరఫున సన్మానం చేస్తామని ప్రకటించారు. రామచంద్రపురంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలో నదుల అనుసంధానం చేస్తున్న మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఇరిగేషన్ మంత్రి ప్రకటించటం హాస్యాస్పదమన్నారు.
అసలు నిర్మాణం లేకుండా నే పట్టిసీమ ద్వారా నీటిని ఎలా మళ్లిస్తారని ప్రశ్ని ంచారు. నదుల అనుసంధానానికి పునాది వేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డేనని పేర్కొన్నారు. ఆయన హయాంలో నిర్మించిన తాటిపూడి పంపింగ్ స్కీం నుంచి పట్టిసీమ కుడి కాలువకు 14వ కిలోమీటరు వద్ద నీటిని మళ్లించి కృష్ణానదికి అనుసంధానం చేసేందుకు సీఎం, ఇరిగేషన్ మంత్రి యత్నించటం సిగ్గుచేటన్నారు. తాటిపూడి పంపింగ్ స్కీం వద్ద 8 పంపులు ఉండగా 5 పంపుల ద్వారా నీటిని పట్టిసీమ కుడికాలువ ద్వారా విడుదలకు సిద్ధమవుతున్నారన్నారు. పట్టిసీమ కుడికాలువ సుమారు 174 కిలోమీటర్లు కాగా దానిని వైఎస్ హయాంలోనే 135 కిలోమీటర్ల మేర పూర్తి చేశారని, ఇంకా 45 కిలోమీటర్ల కాలువ పనులు చేయాల్సి ఉందని, పనులు కాకుండా తాటిపూడి పంపింగ్ స్కీము నుంచి నీటిని ఎలా మళ్లిస్తారని ప్రశ్నించారు.
‘ఉభయ గోదావరి’ ఎడారే
తాటిపూడి పంపింగ్ స్కీం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాలు సాగవుతున్నాయని, 8 పంపుల్లో 5 పంపుల ద్వారా నీటిని మళ్లిస్తే మిగిలిన మూడు పంపుల ద్వారా రైతులకు ఎంతమేర నీటిని అందించగలరని బోస్ ప్రశ్నించారు. పట్టిసీమ జీవోలో ఎక్కడా సాగునీటి ప్రస్తావన లేదని, కేవలం రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలకు నీటిని అందించేందుకే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని విమర్శించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టా ప్రాంతాలను ఎడారి చేసేందుకే చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి నడుంకట్టారని ఆరోపించారు.
గోదావరికి వరద సమయంలో నీటిని పంపింగ్ చేస్తామని చెబుతూ పట్టిసీమ వద్ద గోదావరిలో 11 మీటర్ల వద్ద ఫుట్‌వాల్వు ఎందుకు బిగిస్తున్నారని, అదే సమయంలో కృష్ణా నదికీ వరదలు వస్తాయనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. నదుల అనుసంధానం చేస్తామంటున్న ఇరిగేషన్ మంత్రి గోదావరి జలాలను కృష్ణానదిలో ఎక్కడ నిల్వ ఉంచుతారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నదుల అనుసంధానం పేరుతో మోసం
Published Tue, Jul 28 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM
Advertisement