మీది అక్కరకొచ్చే పాలసీయేనా?
- బీమా పథకాలతో జాగ్రత్త
- చాలా అంశాలు చూశాకే
- పాలసీ తీసుకోవాలి
మనలో చాలామంది పక్కవాళ్ళు తీసుకున్నారని అవసరం లేని బీమా పథకాలు తీసుకొని చేతులు కాల్చుకుంటారు. 2007-08లో స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు యులిప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి మార్కెట్లు భారీగా పడిపోయాక వాటిని సరెండర్ చేసి భారీ నష్టాలను మూటకట్టుకున్న సంఘటనలు ఇంకా మనకళ్ళెదుట కదులుతూనే ఉన్నాయి. అలాగే ఎంత బీమా రక్షణ ఉండాలన్న దానిపై కూడా సరైన అవగాహన ఉండదు. బీమా పాలసీ తీసుకునేముందు వీటిపై సరైన స్పష్టత లేకపోతే అవి అక్కరకు రాని పథకాలుగానే మిగిలిపోతాయి.
రక్షణా?.. ఇన్వెస్ట్‌మెంటా?
ఏ అవసరం కోసం బీమా పాలసీని తీసుకుంటున్నారన్న దానిపై ముందుగా ఒక స్పష్టత ఉండాలి. మరణానంతరం కుటుంబానికి ఆర్థిక రక్షణ కావాలనుకునే వారికి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అనువైనవి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కేవలం క్లెయిమ్‌లే ఉంటాయి. మెచ్యూరిటీ అనేది ఉండదు. దీంతో ఈ పాలసీల ద్వారా తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ పొందవచ్చు. సాధారణంగా మీ వార్షిక ఆదాయానికి 8-10 రెట్లు అధిక మొత్తానికి బీమా రక్షణ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడానికి ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా బీమా పథకాలను ఎంచుకుంటే సంప్రదాయ ఎండోమెంట్, యులిప్ పథకాలకేసి చూడవచ్చు.
గ్యారంటీ ఉండదు
ఇన్వెస్ట్‌మెంట్ కోసం యులిప్స్ ఎంచుకునే వారు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. 2010లో నిబంధనలు మార్చాక యులిప్స్‌లో చార్జీలు తగ్గి ఆకర్షణీయంగా మారాయి. ఇదే సమయంలో లాకిన్ ిపీరియడ్‌ను మూడు నుంచి ఐదేళ్లకు పెంచారు. అంటే స్వల్ప కాలిక అవసరాలకు ఈ పథకం సరిపోదు అన్న విషయం గుర్తు పెట్టుకోండి. వీటిని దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకోసం ఉపయోగించుకోవచ్చు. యులిప్స్‌లో నిర్వహణ వ్యయం తక్కువే అయినప్పటికీ వీటి రాబడిపై ఎటుంటి హామీ ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా వీటి రాబడిలో కూడా మార్పు ఉంటుంది. అందుకనే తక్కువ రిస్క్ సామర్థ్యం ఉండి, ఒడిదుడుకులను తట్టుకోలేని వారు యులిప్స్‌కి దూరంగా ఉండండి.
కొనసాగించగలరా?..
బీమా అనేది దీర్ఘకాలిక ఒప్పందం. ఒకేసారి ప్రీమియం కట్టేస్తే సరిపోదు. పాలసీ కాలపరిమితి మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పాలసీ తీసుకునే ముందే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులెదురైనా ప్రీమియం కట్టగలిగే సామర్థ్యం ఉందా లేదా అన్నది ముందే పరిశీలించుకోవాలి. మీ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఎంత మొత్తానికి పాల సీ తీసుకోవాలి? ప్రీమియం ఎన్ని విడతలుగా చెల్లించాలి? అన్న విషయాలపై ముందుగానే అవగాహనకు రండి.
చెక్ చేసుకోండి..
అన్ని వేళలా ఏజెంట్లు చెప్పిన విషయాలను గుడ్డిగా నమ్మకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి చూసుకోండి. కొంతమంది ఏజెంట్లు కమీషన్ల కోసం మీ లక్ష్యాలకు సరిపోని పాలసీలను అంటగట్టే ప్రమాదం ఉంది. అందుకనే పాలసీ తీసుకునే ముందు ఒకసారి డాక్యుమెంట్లు పూర్తిగా పరిశీలించిన తర్వాత... అది మీ ఆర్థిక అవసరాలకు సరిపోతుందన్న నమ్మకం ఏర్పడిన తర్వాతనే తీసుకోండి.