పాలసీ, ఫలితాలు.. కీలకం
* మార్కెట్‌పై ప్రభావం చూపే అంశాలు
* విశ్లేషకుల అభిప్రాయం
న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్‌పై రేపు (మంగళవారం) భారత రిజర్వ్ బ్యాంక్ వెల్లడించే విధాన సమీక్ష, బజాజ్ ఆటో, టాటా స్టీల్ వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రభావం చూపనున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఆర్‌బీఐ పాలసీ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. ఈ పాలసీతో పాటు ఆర్థిక రంగానికి సంబంధించిన గణాంకాలు, ఈ వారంలో వెల్లడయ్యే కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్, రూపాయి కదలికలు, ముడి చమురు ధరలు... ఇవన్నీ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వివరించారు.
బడ్జెట్‌కు ముందు ఆర్‌బీఐ ప్రకటించే చివరి పాలసీ ఇదేనని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్‌క్యాప్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. ద్రవ్య లోటు నియంత్రణలోనే ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక రేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
బడ్జెట్ కౌంట్‌డౌన్ షురూ...
2016-17 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌కు కౌంట్ డౌన్ మొదలైందని సింఘానియా చెప్పారు. బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అన్ని రంగాలపై అంచనాలను పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. రానున్న బడ్జెట్‌పై ఆశలతో పలు మిడ్ క్యాప్ షేర్లలో జోరుగా కార్యకలాపాలు జరుగుతాయని వివరించారు. సేవలు, తయారీ రంగాలకు సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కూడా స్టాక్ మార్కెట్‌పై తగిన ప్రభావాన్నే చూపుతాయని నిపుణులంటున్నారు.
ఈ వారంలో ఫలితాలు ప్రకటించే కంపెనీలపైన, రానున్న బడ్జెట్‌పైన పలువురి దృష్టి ఉందని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్, హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా పేర్కొన్నారు. జనవరి నెల అమ్మకాల గణాంకాలను వాహన కంపెనీలు సోమవారం వెల్లడించనున్నాయి. దీంతో ఈ కంపెనీల షేర్లు వెలుగులో ఉంటాయి.
టెక్ మహీంద్రా, డీఎల్‌ఎఫ్, ఇండియన్ ఆయిల్, టాటా స్టీల్, లుపిన్,హెచ్‌పీసీఎల్, బజాజ్ ఆటో తదితర కంపెనీలు ఈ వారంలోనే తమ క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. ఈ కంపెనీల ఫలితాలతో పాటు వాహన విక్రయ గణాంకాలు స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు.