ఉర్జిత్ పటేల్‌కు నేడు మార్కెట్ స్వాగతం
విశ్లేషకుల అంచనా
ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్, తదితర కంపెనీల క్యూ1 ఫలితాల ప్రభావం
ఫెడ్ చైర్‌పర్సన్ ఎలెన్ ఉపన్యాసం కీలకం
ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అంచనాలు
భారత రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నియామకాన్ని స్టాక్ మార్కెట్ స్వాగతిస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం కానున్నదని వారంటున్నారు. వచ్చే నెల 4న ఆర్‌బీఐ గవర్నర్ పదవి నుంచి వైదొలుగుతున్న రఘురామ్ రాజ న్ స్థానంలో ఉర్జిత్ పటేల్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా 52 ఏళ్ల ఉర్జిత్ పటేల్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.సంస్కరణల కొనసాగింపునకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదన్న సంకేతాల్ని ఉర్జిత్ పటేల్ నియామకం ఇన్వెస్టర్లకు అందినట్లేనని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ప్రస్తుతం ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేస్తున్న ఉర్జిత్ పటేల్ సంస్కరణల విషయంలో సహకరిస్తారని, ఇది మార్కెట్‌కు సానుకూలమైన అంశమని నిపుణులంటున్నారు.
రాజన్ విధానాలు కొనసాగింపు..
రాజన్ వారసుడిగా పటేల్ నియామకం సంస్కరణల కొనసాగింపునకు నిదర్శనమని, అందుకని ఉర్జిత్ పటేల్ నియామాకాన్ని మార్కెట్లు సంతోషంతో స్వాగతిస్తాయని ప్రభుదాస్ లీలాధర్ బ్రోకరేజ్ సంస్థ సీఈఓ అజయ్ బోడ్కే చెప్పారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ ద్రవ్య విధాన నివేదిక రూపకల్పన విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ధనంజయ్ సిన్హా చెప్పారు. రాజన్ నిష్ర్కమణ తర్వాత ఆర్‌బీఐ పాలసీలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనకు ఉర్జిత్ పటేల్ నియామకంతో తెరపడినట్లేనని వివరించారు. రాజన్ విధానాలను పటేల్ కొనసాగిస్తారని అంచనాలున్నట్లు జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహకర్త వి.కె. విజయ్‌కుమార్ చెప్పారు. ద్రవ్యోల్బణం నియంత్రణ లక్ష్యంగా ఉన్న రాజన్ విధానాలను ఆర్‌బీఐ కొనసాగిస్తుందనడానికి ఉర్జిత్ పటేల్ నియామకం ఒక నిదర్శనమని సెంట్రమ్ బ్రోకింగ్ ఈడీ, సీఈఓ సందీప్ నాయక్ చెప్పారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు దీనికి సానుకూలంగా స్పందిస్తారని పేర్కొన్నారు.
డెరివేటివ్స్ ముగింపు కారణంగా ఒడిదుడుకులు...
ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం (ఈ నెల 25న) ముగియనున్నందున ఈ వీరం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతుందని నిపుణులంటున్నారు. ఇక ఈ వారంలో ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్, అరబిందో ఫార్మా, టాటా పవర్ తదితర సంస్థలు తమ క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలు, వర్షపాత విస్తరణ, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పనితీరు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం తదితర అంశాలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచే అవకాశాలు పెరగడం, డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు వంటి అంశాల కారణంగా స్టాక్ సూచీలు హెచ్చుతగ్గులకు లోను కావచ్చని వారంటున్నారు.
నేడు ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్‌ల ఫలితాలు
ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్ కంపెనీలు నేడు (ఈ నెల 22-సోమవారం) తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. రేపు (ఈ నెల 23-మంగళవారం) అరబిందో ఫార్మా, టాటా పవర్ కంపెనీలు శుక్రవారం (26న) టాటా మోటార్స్ తమ, ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ శుక్రవారం వ్యోమింగ్‌లోని జాక్సన్ హోల్ వద్ద ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ యెలెన్ ప్రసంగించనున్నారని, ఈ ప్రసంగంలో ఆమె కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశాలున్నాయని, అందుకని ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్ సీఎండీ డి.కె. అగర్వాల్ చెప్పారు. సెప్టెంబర్‌లో జరిగే ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు ఆమె చేసే చివరి ప్రసంగం ఇదే. ఎనిమిది కీలక పరిశ్రమలతో పాటు జీడీపీకి సంబంధించిన గణాంకాలు కూడా ఈ వారంలోనే వెలువడనున్నాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబాకు చెందిన ఆనంద్ జేమ్స్ తెలిపారు. ఈ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్ గమనంపై ఉంటుందని వివరించారు.
గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 75 పాయింట్లు నష్టపోయి 28,077 పాయింట్లు వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 8,667 పాయింట్ల వద్ద ముగిశాయి.
విదేశీ పెట్టుబడులు జోరుగా..
స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 0.25%కి దించడం, దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న జీఎస్ టీ బిల్లు ఆమోదం పొందడం వంటి కారణాల వల్ల విదేశీ నిధు లు జోరుగా వస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఈ నెలలో 19 వ తేదీవరకూ ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ.7,723 కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,699 కోట్లు డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. వెరశి ఈ నెలలో భారత క్యాపిటల్ మార్కె ట్లో విదేశీ పెట్టుబడులు రూ.6,023 కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.39,501 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.6,422 కోట్లు ఉపసంహరించుకున్నారు. భారత క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడులు రూ.33,079గా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచడంలో జాప్యం జరగడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యంగా భారత్‌కు ప్రయోజనకరమని నిపుణులంటున్నారు. రేట్ల పెంపులో జాప్యం కారణంగా మరిన్ని నిధులు మన ఈక్విటీ మార్కెట్లోకి వస్తాయని వారంటున్నారు.