కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నాయి. రేపు(మంగళవారం) వెలువడే ఈ ఫలితాలతో పాటు ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, ఈ వారంలో వెలువడే కంపెనీల ఆర్థిక ఫలితాలు, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులంటున్నారు.
కర్ణాటక ఫలితాలు స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులకు కారణమవుతాయని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ ఎనలిస్ట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు. ఇరాన్ అణు డీల్ నుంచి అమెరికా వైదొలగడం, తదనంతర పరిణామాలు యుద్ధ పరిస్థితులను తలపింపజేయనున్నాయని, ఇది స్టాక్ మార్కెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపగలదని శామ్‌కో సీఈఓ జిమీత్ మోదీ అంచనా వేస్తున్నారు. ముడి చమురు ధరలు, డాలర్ బలపడుతుండటం బుల్స్‌కు ప్రతికూలమని, మార్కెట్‌పై ఒత్తిడి తప్పదని వివరించారు.
నేడు ‘టోకు’ ద్రవ్యోల్బణ గణాంకాలు...
టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడతాయి. ఈ వారంలో హిందుస్తాన్ యూనిలివర్, లుపిన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హిందాల్కో, ఐటీసీ, బజాజ్ ఆటో, బ్లూస్టార్, బాంబే డైయింగ్, ఆర్‌కామ్, టాటా స్టీల్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అమర రాజా బ్యాటరీస్, తదితర కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి.
శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడించిన కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, ఓరయంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తదితర బ్యాంక్ షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. ఈ బ్యాంక్‌లన్నీ భారీ నష్టాలను ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఔషధ విధానంలో భయపడిన స్థాయిలో భారీ సంస్కరణలు లేకపోవడంతో ఫార్మా షేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
8 రోజుల్లో.. రూ.12,671 కోట్లు వెనక్కి...
మన మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల ఉపసంహరణ జోరుగా సాగుతోంది. ఈ నెల ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో మన క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,671 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమనడం, ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులు పెరగడం, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో లాభాల స్వీకరణ దీనికి ప్రధాన కారణాలు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.4,030 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.8,641 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment