సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కౌంట్‌డౌన్ మొదలవడంతో ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పరిశీలకులు, సామాన్య ప్రజల నుంచి విదేశాల్లోనూ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఇక స్టాక్ మార్కెట్ వర్గాలూ, ఇన్వెస్టర్లు సైతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో పాలక బీజేపీ గెలుపోటముల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పెను ప్రభావం చూపనుంది.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలను సంకేతాలుగా చూస్తున్నక్రమంలో ఫలితాలపై ఉత్సుకత నెలకొంది. గుజరాత్, హిమాచల్‌లో బీజేపీకి అధికార పగ్గాలు దక్కుతాయని శుక్రవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌తో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లిన క్రమంలో వెల్లడవనున్న ఎన్నికల ఫలితాలు మార్కెట్‌ను ఎటువైపు నడిపిస్తాయనేది ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి భారీ విజయం దక్కితే మాత్రం సెన్సెక్స్,నిఫ్టీలు సరికొత్త శిఖరాలకు చేరతాయని నిపుణులు భావిస్తున్నారు.
నిఫ్టీ 10,500 పాయింట్ల దిశగా సాగుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు నిర్ధిష్టంగా లేకున్నా, బీజేపీకి నిరుత్సాహకరంగా ఉన్నా స్టాక్ మార్కెట్లు డీలా పడటమే కాకుండా కొంత కాలం స్థబ్ధతగా ఉంటాయని చెబుతున్నారు. బీజేపీకి భారీ విజయం దక్కితే సంస్కరణలపై మోదీ సర్కార్ దూకుడు కొనసాగుతుందనే విశ్వాసంతో దేశీ ఇన్వెస్టర్లతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు ఇబ్బడిముబ్బడిగా కొనుగోళ్లకు దిగుతారని, ఫలితంగా స్టాక్ మార్కెట్ నూతన శిఖరాలకు చేరుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అదే జరిగితే ఎగ్జిట్ పోల్స్‌తో నెలకొన్న మార్కెట్ జోష్ అదే ఊపును కొనసాగిస్తుంది. ఏ మాత్రం తేడా జరిగినా స్టాక్ మార్కెట్ కుదుపులకు లోనవడం ఖాయమనే ఆందోళనలూ నెలకొన్నాయి. ఏమైనా ఎన్నికల ఫలితాలతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులపై తీసుకునే నిర‍్ణయాలు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment