గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Aug 24 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

Last week Business

నియామకాలు..

♦ మ్యూచువల్ ఫండ్ సమాఖ్య ఏఎంఎఫ్‌ఐ సీఈవోగా ఆంధ్రా బ్యాంక్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్.రాజేంద్రన్ నియమితులయ్యారు. ఆయన సెప్టెంబర్‌లో పదవీ బాధ్యతలు చేపడతారు.
♦ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహానీ నియమితులయ్యారు. తొలిసారిగా ఒక రైల్వే శాఖకు చెందిన అధికారి ఎయిర్‌ఇండియా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
 
 250 విమానాలకు ఇండిగో ఆర్డర్
  కార్యకలాపాల విస్తరణలో భాగంగా 250 ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాల ఆర్డరుకు సంబంధించి ఇండిగో పూర్తి స్థాయి కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు 25.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.55 లక్షల కోట్లు). గతేడాది అక్టోబర్‌లో ఈ ఆర్డరు విషయంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. తాజా కాంట్రాక్టుతో మొత్తం 530 విమానాల కోసం ఇండిగో ఆర్డరు ఇచ్చినట్లవుతుంది.

 పసిడి దిగుమతులపై టారిఫ్ విలువ పెంపు
 పసిడి దిగుమతులపై టారిఫ్ విలువ పెరిగింది. దీని ప్రకారం- ఈ రేటు 10 గ్రాములకు 354 డాలర్ల నుంచి 363 డాలర్లకు పెరిగింది. ఇక వెండి కేజీపై రేటు కూడా 498 డాలర్ల నుంచి స్వల్పంగా 499 డాలర్లకు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పులకు అనుగుణంగా సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఎకై ్సజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ (సీబీఈసీ) పసిడి, వెండి టారిఫ్ విలువను నిర్ణయిస్తుంది.

 పెబ్స్ పెన్నార్ పబ్లిక్ ఇష్యూ
 పెబ్స్ పెన్నార్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 25 నుంచి ప్రారంభమై ఆగస్టు 27తో ముగుస్తుంది. పూర్తి బుక్ బిల్డింగ్ విధానంలో జరిగే ఈ పబ్లిక్ ఇష్యూ ఆఫర్ ధరను రూ. 170 - 178గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా కొత్తగా రూ. 58 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడంతోపాటు, 55.16 లక్షల షేర్లను విక్రయించనున్నారు.

 ఎల్‌ఐసీ నుంచి తొలి యులిప్ పాలసీ
 మారిన నిబంధనల తర్వాత దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తొలి యూనిట్ ఆధారిత బీమా పథకం (యులిప్)ను ప్రవేశపెట్టింది. న్యూ ఎండోమెంట్ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ యూలిప్ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని స్టాక్ మార్కెట్, డెట్, మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే లాభనష్టాలను పాలసీదారులకు అందిస్తారు.

 త్వరలో రిలయన్స్, ఎయిర్‌టెల్ బ్యాంకులు..
 రిలయన్స్ ఇండస్ట్రీస్, పోస్టల్ డిపార్ట్‌మెంట్ సహా 11 సంస్థలు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం ‘సూత్రప్రాయంగా’ అనుమతులు ఇచ్చింది. సూత్రప్రాయ అనుమతులు 18 నెలల పాటు వర్తిస్తాయి. ఈలోగా పూర్తి స్థాయి అనుమతులు సాధించేందుకు అవసరమైన నిబంధనలను ఈ సంస్థలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పటిదాకా ఎటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలూ నిర్వహించకూడదు. మొత్తం 41 సంస్థలు పేమెంట్ బ్యాంకు పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

 నల్లధనంపై సెబీ యుద్ధం
 పన్ను ఎగవేత కోసం స్టాక్ మార్కెట్లను ఉపయోగించుకున్నందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ 59 సంస్థలపై నిషేధం విధించింది. ఇకపై ఈ సంస్థలు  ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి కొనుగోలు, అమ్మకం వంటి కార్యకలాపాలను నిర్వహించవు. నిషేధానికి గురైన వాటిల్లో హెచ్‌ఎన్‌ఐ, రిద్దిసిద్ధి బులియన్స్, వుడ్‌ల్యాండ్ రిటైల్స్, మహా కాళేశ్వర్ మైన్స్, శ్రీ కమోడిటీస్ తదితర సంస్థలు ఉన్నాయి.

 షావొమీ ఓఎస్ అప్‌గ్రేడ్
 చైనీస్ హ్యాండ్‌సెట్ దిగ్గజం షావొమీ తాజాగా తమ ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) అప్‌గ్రేడెడ్ వెర్షన్ ‘ఎంఐయూఐ-7’ను ప్రవేశపెట్టింది. భారత్‌లో తాము విక్రయించిన స్మార్ట్‌ఫోన్స్ అన్నింటికీ దీని బీటా వెర్షన్ ఆగస్టు 24న లభిస్తుందని షావొమీ గ్లోబల్ వీపీ హ్యూగో బరా తెలిపారు. ఇందులో విజు వల్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, స్మార్ట్ ఎస్‌ఎంఎస్ ఫిల్టర్ మొదలైన ‘మేడ్ ఫర్ ఇండియా’ ఫీచర్లు ఉంటాయని ఆయన వివరించారు.

 బ్యాంకులకు 2, 4 శనివారాలు సెలవు
 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త! ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించాలన్న ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.

 3,269 కోట్లు సమీకరించిన స్నాప్‌డీల్
 ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్ తాజాగా 50 కోట్ల డాలర్ల (రూ.3,269 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా, తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ఫాక్స్‌కాన్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ల నుంచి ఈ నిధులు సమీకరించామని స్నాప్‌డీల్ తెలిపింది. ఇప్పటికే తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన టిమసెక్, బ్లాక్‌రాక్, మైరాయిడ్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ల నుంచి కూడా ఈ తాజా నిధుల సమీకరణలో పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది.

 సాఫ్ట్‌బ్యాంక్‌లో భారతీయుడి పెట్టుబడులు
 నికేశ్ అరోరా... గూగుల్ సంస్థలో అత్యున్నత స్థాయిలో పనిచేసి  గత ఏడాది బయటకు వచ్చిన  ఈయన 48 కోట్ల డాలర్ల(రూ.3,148 కోట్ల) విలువైన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ షేర్లను కొనుగోలు చేశారు. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌కు  ప్రెసిడెం ట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భారత్‌లో జన్మించిన అరోరా కొనుగోలును డెరైక్టర్ల బోర్డ్ ఆమోదించిందని సాఫ్ట్‌బ్యాం క్ సంస్థ టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బుధవారం వెల్లడించింది.
 
 నేడు ఐవోసీలో 10% వాటా విక్రయం
 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)లో 10 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) ద్వారా సోమవారం విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలో అతి పెద్ద రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీగా ఉన్న ఐవోసీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 68.57 శాతం వాటా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది నాలుగో డిజిన్వెస్ట్‌మెంట్. కనీస ధర రూ.387. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.  
 
 డీల్స్..
 ►స్విట్జర్లాండ్ సిమెంట్ దిగ్గజం లఫార్జ్-హోల్సిమ్‌కు భారతదేశంలో ఉన్న రెండు ప్లాంట్లను ఎంపీ బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన బిర్లా కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.5,000 కోట్లు.
 ►ప్రైవేట్ రంగ వ్యవసాయ స్టోరేజ్ కంపెనీ అయిన నేషనల్ కొల్లేటరల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్(ఎన్‌సీఎంఎస్)లో మెజారిటీ వాటాను ఫెయిర్‌ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.800 కోట్లు.
 ►అమెరికాకు చెందిన ట్యాక్సీ యాప్ దిగ్గజం ఉబర్‌లో టాటా క్యాపిటల్ నిర్వహణలో ఉన్న టాటా ఆపర్చునిటీస్ ఫండ్(టీఓఎఫ్) భారీగా పెట్టుబడులు పెట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement