అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అన్ని రకాల పరిశ్రమలకూ ఈ సెగ గట్టిగానే తగులుతోంది. ముడి చమురు ధరలు, లోహాలు, రసాయనాలు, వంటనూనెలు ఇలా దాదాపు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. వినియోగ డిమాండ్ పెరగడం, ఉత్పత్తి, సరఫరా తగినంత లేకపోవడం దీనికి కారణంగా పేర్కొంటున్నారు. కారణాలేవైనా కానీ మన దేశంలో ద్రవ్యోల్బణం గరిష్టాల్లోనే ఉంటోంది. కనుక ఇన్వెస్టర్లు అందరూ పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ అంశాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న అంచనాలు అధిక ద్రవ్యోల్బణానికి మార్గమే అవుతుంది. గడిచిన 12 నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6 శాతంగా ఉంది. అంటే 6 శాతం రాబడినిచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసినా.. నికరంగా మీ చేతికి వచ్చేది సున్నాయే. 2009 నుంచి 2014 మధ్య ద్రవ్యోల్బణం సగటున 10.4 శాతంగా మన దేశంలో కొనసాగింది. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడుల కోసం ఇన్వెస్టర్లు మెరుగైన సాధనాలకు పెట్టుబడుల్లో చోటివ్వాలి..
బాండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్
ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంకులు అనుసరించే మార్గం వడ్డీ రేట్లను పెంచడం. కనుక రేట్లను పెంచే క్రమంలో బాండ్లలో పెట్టుబడులు అనుకూలం కాదు. దీనివల్ల బాండ్ల ధరలు తగ్గుతాయి. కరోనా రెండు విడతల ప్రభావంతో దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడ్డాయి. వృద్ధికి మద్దతుగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కనుక కొంత ఆలస్యంగా వడ్డీ రేట్లను పెంచే మార్గంలోకి వెళ్లొచ్చు. కానీ, కీలక రేట్లు పెరగకపోయినా.. ద్రవ్యోల్బణం రెక్కలు తొడుగుకుంటే మార్కెట్ ఆధారిత వడ్డీ రేట్లు (పదేళ్ల జీ–సెక్‌లు) పెరిగిపోతాయి. ఇన్వెస్టర్లు 2009–2014 మధ్య భారత ప్రభుత్వ సెక్యూరిటీలను కలిగి ఉన్నట్టయితే వారికి లభించిన రాబడి రేటు వార్షికంగా 3.2 శాతమే. వాస్తవ రాబడి మైనస్ అవుతుంది. అందుకని అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతుందనుకుంటే అటువంటప్పుడు దీర్ఘకాల ప్రభుత్వ సెక్యూరిటీలు, దీర్ఘకాలంతో కూడిన కార్పొరేట్ బాండ్లకు దూరంగా ఉండడమే మంచిది.
బ్యాంకుల ఎఫ్‌డీ రేట్లు సార్వభౌమ బాండ్ల రేటు కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయినా కానీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఇవి చాలవు. ఈ విడత కీలక రేట్ల సవరణ విషయంలో ఆర్‌బీఐ వేచి చూసే ధోరణితో ఉన్నందున.. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్టు వడ్డీ రేట్లు కూడా సమీప కాలంలో పెరగకపోవచ్చు. ఆర్‌బీఐ గణాంకాలను పరిశీలిస్తే 2009–2014 మధ్య బ్యాంకు ఎఫ్‌డీ రేట్లు 8.6 శాతంగా ఉన్నాయి. మంచి రేటు కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో సగటు ద్రవ్యోల్బణం 10.4 శాతంగా ఉంది. నేడు బ్యాంకు ఎఫ్‌డీల రేట్లు 5–6 శాతం మధ్యే ఉన్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటోంది. కనుక వాస్తవంగా ఇన్వెస్టర్‌కు వచ్చే రాబడి ఏమీ ఉండదు. చిన్న మొత్తాల పొదు పథకాల్లో టైమ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్‌పత్ర, ఎన్‌ఎస్‌సీ రేట్లు కూడా 6–7 శాతం మధ్యే ఉన్నాయి. కనుక వాస్తవంగా వచ్చే రాబడి ఒక్క శాతం కూడా మించదు.
ఈక్విటీలు
ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొని మెరుగైన వాస్తవ రాబడులకు ఈక్విటీలు మార్గం చూపిస్తాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు బాండ్ల కంటే అధిక రాబడులనే ఇస్తున్నట్టు ఇప్పటి వరకు ఉన్న చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఈక్విటీల్లో రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలంలోనే ఈ రిస్క్‌ను అధిగమించే రాబడులకు అవకాశం ఉంటుంది. కనీసం పదేళ్లు అంతకుమించిన కాలానికి ఈక్విటీల్లో మెరుగైన రాబడులను ఆశించొచ్చు. స్వల్పకాలానికి మాత్రం స్టాక్స్‌లో రాబడులు బాండ్లను మించి, ద్రవ్యోల్బణాన్ని మించి ఉంటాయని చెప్పడానికి లేదు. ఎప్పుడూ కూడా స్టాక్స్ ధరలు ఆయా కంపెనీల వృద్ధినే ప్రతిఫలిస్తుంటాయి. పారిశ్రామిక ముడి పదార్థాలైన పెట్రోకెమికల్స్, కెమికల్స్, పారిశ్రామిక లోహాల ధరలు పెరుగుతుంటే అవి కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.
ఎందుకంటే పెరుగుతున్న ధరలను కంపెనీలు పూర్తి స్థాయిలో వినియోగదారులకు బదిలీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొం టాయి. కరోనా రెండో విడత నేపథ్యంలో డిమాండ్ పరిస్థితులు బలహీనంగానే ఉన్నాయి. పెరిగిపోయిన ముడి సరుకుల ధరల వల్ల కంపెనీల లాభాలపై ప్రభావం పడనుంది. కానీ, ఇదే సమయంలో కమోడిటీలను ఉత్పత్తి చేసే కంపెనీలు పెరుగుతున్న ధరల సైకిల్‌తో మంచి లాభాలను నమోదు చేసుకుంటాయి. ఇలా అధిక ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కమోడిటీలను వినియోగించేవి కాకుండా.. వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలను ఎంపిక చేసుకోవడం వల్ల అధిక లాభాలను ఆర్జించేందుకు వీలుంటుంది.
బంగారం
ద్రవ్యోల్బణానికి రక్షణ సాధనంగా బంగారాన్ని పరిగణిస్తుంటారు. కానీ, మన దగ్గర ద్రవ్యోల్బణానికి హెడ్జ్ సాధనంగా బంగారానికి అంత ప్రాధాన్యం లేదు. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చిన తరుణంలో బంగారం ప్రాధాన్య సాధనంగా ఉంటోంది. భారత ఇన్వెస్టర్లకు..
అంతర్జాతీయ సంక్షోభ సమయాలు లేదా కమోడిటీల ధరల పెరుగుదల సమయంలోనే రూపాయి క్షీణత కూడా చోటు చేసుకుంటోంది. 2009–2014 కాలంలో అధిక ద్రవ్యోల్బణం సమయంలో మన దేశ ఇన్వెస్టర్లకు బంగారం మంచి రాబడులను కురిపించింది. వార్షికంగా 13.2 శాతం చొప్పున బంగారం ఈటీఎఫ్‌లు రాబడులను ఇచ్చాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుందనుకుంటే ఆ సమయంలో బంగారానికి కొంత కేటాయింపులు సహేతుకమే అవుతాయి.
వివేకంతో వ్యవహరించాలి
ఇటీవలే మోతీలాల్ ఓస్వాల్ సంస్థ విడుదల చేసిన నివేదికను పరిశీలించినట్టయితే.. నిఫ్టీ ఇండెక్స్‌లోని 11 కంపెనీలు పెరుగుతున్న కమోడిటీల ధరల నుంచి లబ్ధి పొందుతాయని అర్థమవుతోంది. 13 కంపెనీలపై చాలా ప్రతికూల ప్రభావం పడనుంది. మిగిలిన కంపెనీలపై ప్రభావం తటస్థంగానే ఉంటుందని తెలుస్తోంది. అధిక కమోడిటీల ధరలు ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలే ఉంటే.. ఇన్వెస్టర్లు ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలకు దూరంగా ఉండడమే మంచిదవుతుంది. దిగ్గజ కంపెనీలతో పోలిస్తే.. మధ్య తరహా, చిన్న కంపెనీలకు ఉత్పత్తుల ధరలను నిర్ణయించే శక్తి తక్కువగానే ఉంటుంది. కనుక పెరుగుతున్న తయారీ వ్యయాల ప్రభావం వాటిపైనే ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సమయంలో పెద్ద కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సురక్షితం. నిఫ్టీ లాభాల్లో కమోడిటీ కంపెనీల వాటా 36 శాతంగా ఉంది.
ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉన్న 2009–14 కాలంలో నిఫ్టీ–50 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్, నిఫ్టీ 500 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ వార్షికంగా 17 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఆ కాలంలో ఉన్న సగటు ద్రవ్యోల్బణం 10.4 శాతం కంటే ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇచ్చినట్టు అర్థమవుతోంది. కాకపోతే నాటికి, నేటికీ మధ్య స్టాక్స్ వ్యాల్యూషన్లలో వ్యత్యాసం ఉంది. బేర్ మార్కెట్ తర్వాత 2009లో స్టాక్స్ వ్యాల్యూషన్లు చౌకగా ఉన్నాయి. నిఫ్టీ 50పీఈ 2009 జనవరిలో 13.3 పీఈ వద్ద ఉంది. కానీ నేడు నిఫ్టీ 50 పీఈ 29వద్ద ఉంది. కనుక ఈ దశలో పెట్టుబడులకు ఎంపిక చేసుకునే కంపెనీల విషయంలో వివేకంతో వ్యవహరించాలి. ధరలను శాసించగల కంపెనీలను, పెరుగుతున్న కమోడిటీల ధరల నుంచి లబ్ధి పొందే వాటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీలు ఏ ఇతర సాధనంతో పోల్చినా దీర్ఘకాలంలోనే మెరుగైన రాబడులను ఇచ్చాయి. స్వల్ప కాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులేవనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment