Commodities prices
-
సూపర్మార్కెట్ల ‘చేయూత’
సాక్షి, అమరావతి: మార్కెట్ ధరలకన్నా తక్కువకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను గ్రామీణులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యాచరణను సిద్ధంచేసింది. ఇందులో భాగంగా పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో మండలాల వారీగా ‘చేయూత’ మహిళా సూపర్మార్కెట్లను ఏర్పాటుచేయనుంది. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా మార్ట్లు విజయవంతం కావడంతో ఈ ఫార్ములాను గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలుచేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంకల్పించింది. ప్రయోగాత్మకంగా జూలై నాటికల్లా జిల్లాకు రెండేసి చొప్పున 52 మండలాల్లో వీటిని ఏర్పాటుచేయనుంది. చేయూత మహిళా మార్ట్‌గా వీటికి నామకరణం చేశారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున ఈ మహిళా మార్ట్లను ఏర్పాటుచేస్తారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా అర్హులైన పేద మహిళలకు ఏటా దాదాపు రూ.11 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఆర్థిక లబ్ధిపొందిన మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, హిందూస్థాన్ లీవర్, ఐటీసీ, రిలయెన్స్, అమూల్ వంటి అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలు సాధారణ మార్కెట్ ధర కన్నా తక్కువకే తమ కిరాణా సరుకులను 78,931 మహిళా సంఘాల రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నాయి. తక్కువ ధరకే సేకరణ.. విక్రయాలు ఇక సూపర్ మార్కెట్‌కు అవసరమైన ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి, కారం, పసుపు, వివిధ రకాల మసాలాలతో పాటు నెయ్యి, పల్లీచిక్కీ వంటి స్థానికంగా దొరికే నాణ్యమైన ఉత్పత్తులను పొదుపు సంఘాల్లోని మహిళలు సేకరిస్తారు. మరోవైపు.. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న కార్పొరేట్ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను హోల్‌సేల్ వ్యాపారులకు ఇచ్చే ధరకే మహిళా సంఘాలకు సరఫరా చేసే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతంలో సాధారణ వ్యాపారుల కన్నా తక్కువ ధరకు ఈ సూపర్ మార్కెట్లు నాణ్యమైన నిత్యావసర సరుకులు సేకరించే వీలుందని.. అదే సమయంలో కొంత లాభం వేసుకుని మార్కెట్ ధర కన్నా తక్కువకు వినియోగదారులకు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మహిళా మార్ట్ల ఏర్పాటు ఇలా.. మండలంలోని మహిళా సంఘాల సభ్యులందరూ ఫెడరేషన్‌గా ఏర్పడతారు. అందులో ప్రాథమికంగా ఒకొక్కరు రూ.150ల నుంచి రూ.200ల మధ్య షేర్ క్యాపిటల్‌గా పెట్టుబడి పెడతారు. అదనంగా అవసరమైన నిధులను మండల సమాఖ్య ద్వారా స్త్రీనిధి, లేదంటే బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని కనీసం రూ.30 లక్షలతో ఈ సూపర్ మార్కెట్లను ఏర్పాటుచేస్తారు. ఆ మండలంలోని పొదుపు సంఘాల మహిళలు ప్రతినెలా తమ కుటుంబ అవసరానికి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ ఆ సూపర్‌మార్కెట్ ద్వారానే కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తారు. ఇతర వినియోగదారులను కూడా ఆకర్షించేలా హోల్‌సేల్ ధరలకే సరుకులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మరోవైపు.. మండల పరిధిలో ఎక్కువమందికి అందుబాటులో ఉండేలా ఓ పెద్ద గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడ కనీసం 1000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తారు. వీటి ద్వారా నెలకు కనీసం లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారుల ప్రాథమిక అంచనా. వచ్చే లాభాలను మొదట్లో ఫెడరేషన్ సభ్యుల్లో అవసరమైన వారికి తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడం.. తర్వాత దశలో లాభాలను సమానంగా పంచుకోవడం వంటివి ఉంటాయి. సూపర్‌మార్కెట్ నిర్వహణకు కమిటీలు ఇక సూపర్ మార్కెట్ నిర్వహణకు పొదుపు సంఘాల్లోని మహిళలతో కమిటీలను ఏర్పాటుచేస్తారు. వాటిల్లో పనిచేసేందుకు సిబ్బందిని కూడా పొదుపు సంఘాల్లోని చురుకైన మహిళలనే ఎంపిక చేస్తారు. ఇక సూపర్ మార్కెట్ రోజు వారీ నిర్వహణ, కావాల్సిన సరుకులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడం.. అమ్మకాలకు సంబంధించి రికార్డుల నిర్వహణపై సభ్యులకు సెర్ప్ అధికారులతో పాటు వివిధ అంతర్జాతీయ వ్యాపార సంస్థలతో శిక్షణ ఇప్పిస్తారు. 15, 16 తేదీల్లో జిల్లా పీడీల భేటీ పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా మార్ట్లు విజయవంతం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ చేయూత మహిళా మార్ట్ల పేరుతో ఏర్పాటుచేస్తున్నాం. ప్రాథమికంగా ప్రతి జిల్లాకు రెండేసిచోట్ల జూలై నాటికి వీటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. దీనిపై చర్చించేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో అన్ని జిల్లాల పీడీలతో సమావేశం ఏర్పాటుచేశాం. – మహ్మద్ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో -
కమోడిటీలకు రెక్కలు.. ఎలక్ట్రిక్ వాహనాలకు చిక్కులు
పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఉత్పత్తిని మరింతగా పెంచాలన్న లక్ష్యాలకు ఊహించని రీతిలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈవీల్లో కీలకమైన బ్యాటరీల తయారీకి సంబంధించిన ముడి వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోవడం ఇందుకు కారణం. దీని వల్ల ఈవీల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు మరింత సమయం పట్టేయనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈవీల్లో వాడే బ్యాటరీల తయారీలో లిథియం, కోబాల్ట్, మాంగనీస్, నికెల్ వంటి ముడి వస్తువులను ఉపయోగిస్తారు. ఈ ఏడాది తొలి నాళ్ల నుంచి మ్యాంగనీస్ మినహా మిగతా కమోడిటీల ధరలన్నీ ఒక్కసారిగా ఎగిశాయి. గణాంకాల ప్రకారం ప్రపంచంలో సరఫరా అయ్యే మొత్తం లిథియం వినియోగంలో నాలుగింట మూడొంతుల వాటా బ్యాటరీలదే ఉంటోంది. ఈవీల కొరత, ఉత్పత్తి పెంపు అంచనాల కారణంగా లిథియం రేట్లు గతేడాది నుంచే పరుగులు తీస్తున్నాయి. లిథియం ధరలకు ప్రామాణికమైన లిథియం కార్బొనేట్ ధరలు ఈ ఏడాది 75 శాతం పెరిగాయి. ప్రస్తు తం టన్ను రేటు 78,294 డాలర్ల స్థాయిలో ఉంది. కస్టమర్లపై భారం.. నికెల్, ఇంధనాల ధరల పెరుగుదల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ సంస్థలు, వాహన తయారీ సంస్థల వ్యయాలూ పెరుగుతాయని ఫిచ్ సొల్యూషన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భారం అంతిమంగా వినియోగదారులకు బదిలీ అవుతుందని తెలిపాయి. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఫిబ్రవరి 24 నుండి ఇంధనాల ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముడిచమురు, బొగ్గు, సహజ వాయువు, ఇథనాల్ మొదలైన వాటన్నింటి రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పరిస్థితులు అదుపులోకి రావచ్చన్న ఆశలతో ఆ తర్వాత కాస్త దిగివచ్చాయి. క్రూడాయిల్, సహజ వాయువు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఉక్రెయిన్‌పై దాడుల కారణంగా రష్యాపై ఆంక్షలు విధించడంతో ఇంధనాల సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలతో క్రూడాయిల్ రేట్లు ఎగిశాయి. అటు గోధుమలు, బార్లీ, వంటనూనెల ధరలూ పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాలు రెండూ.. వీటిని అత్యధికంగా సరఫరా చేసే దేశాలు కావడం ఇందుకు కారణం. ముడి వస్తువుల ధరలు పెరిగిపోవడం, సరఫరా తగ్గిపోవడం వంటి అంశాల కారణంగా కంపెనీలు ఇతర ప్రత్యామ్నాయాల వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు చాలా మటుకు దేశాలు లిథియం–నికెల్–మాంగనీస్–కోబాల్ట్ బ్యాటరీల ను ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగిస్తున్నాయి. కానీ చైనా ఈవీ మార్కెట్లో మాత్రం లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నికెల్‌ను పక్కన పెట్టి లిథియం–ఐరన్–ఫాస్ఫేట్ కాంబినేషన్‌తో ప్రత్యా మ్నాయ బ్యాటరీల తయారీపై ఆసక్తి పెరగవచ్చని ఫిచ్ సొల్యూషన్స్ అభిప్రాయపడింది. నికెల్ @ 1 లక్ష డాలర్లు.. మరో కీలక కమోడిటీ నికెల్ రేట్లు గడిచిన మూడు వారాల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఒక దశలో టన్నుకు 1,00,000 డాలర్లు పలికిన నికెల్ తర్వాత 45,000 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయినా కూడా ఈ ఏడాది ప్రారంభం నాటి 20,995 డాలర్లతో పోలిస్తే ఇప్పటికీ రెట్టింపు స్థాయిలోనే ఉండటం గమనార్హం. రష్యాపై ఆంక్షల వల్ల ఆ దేశం నుండి కొనుగోళ్లు పడిపోయి.. ఈ ఏడాదంతా కూడా నికెల్ ధరలు అధిక స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నికెల్ సరఫరాలో రష్యాకు దాదాపు తొమ్మిది శాతం వాటా ఉంది. అటు కోబాల్ట్ 2021లో గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటిదాకా మరో 16 శాతం పెరిగింది. టన్నుకు 82,000 డాలర్లకు చేరింది. మాంగనీస్ ధరలు 2022లో మూడు శాతం పెరిగి టన్నుకు 5.43 డాలర్లకు చేరాయి. ఈ ధరలు అధిక స్థాయిలో అలాగే కొనసాగాయంటే హరిత వాహనాల వైపు మళ్లే ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవీలకు డిమాండ్ భారీగా పెరగడంతో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో లిథియం ఉత్పత్తిని పెంచేందుకు మైనింగ్ కంపెనీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం అమెరికాను మినహాయించి గతేడాది అంతర్జాతీయంగా లిథియం ఉత్పత్తి 21 శాతం పెరిగి 1,00,000 టన్నులకు చేరింది. రేట్లు పెరగడంతో వివిధ వనరుల ద్వారా ఉత్పత్తిని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
రాబడి మీకోసమేనా..?
అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అన్ని రకాల పరిశ్రమలకూ ఈ సెగ గట్టిగానే తగులుతోంది. ముడి చమురు ధరలు, లోహాలు, రసాయనాలు, వంటనూనెలు ఇలా దాదాపు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. వినియోగ డిమాండ్ పెరగడం, ఉత్పత్తి, సరఫరా తగినంత లేకపోవడం దీనికి కారణంగా పేర్కొంటున్నారు. కారణాలేవైనా కానీ మన దేశంలో ద్రవ్యోల్బణం గరిష్టాల్లోనే ఉంటోంది. కనుక ఇన్వెస్టర్లు అందరూ పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ అంశాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న అంచనాలు అధిక ద్రవ్యోల్బణానికి మార్గమే అవుతుంది. గడిచిన 12 నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6 శాతంగా ఉంది. అంటే 6 శాతం రాబడినిచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసినా.. నికరంగా మీ చేతికి వచ్చేది సున్నాయే. 2009 నుంచి 2014 మధ్య ద్రవ్యోల్బణం సగటున 10.4 శాతంగా మన దేశంలో కొనసాగింది. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడుల కోసం ఇన్వెస్టర్లు మెరుగైన సాధనాలకు పెట్టుబడుల్లో చోటివ్వాలి.. బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంకులు అనుసరించే మార్గం వడ్డీ రేట్లను పెంచడం. కనుక రేట్లను పెంచే క్రమంలో బాండ్లలో పెట్టుబడులు అనుకూలం కాదు. దీనివల్ల బాండ్ల ధరలు తగ్గుతాయి. కరోనా రెండు విడతల ప్రభావంతో దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడ్డాయి. వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కనుక కొంత ఆలస్యంగా వడ్డీ రేట్లను పెంచే మార్గంలోకి వెళ్లొచ్చు. కానీ, కీలక రేట్లు పెరగకపోయినా.. ద్రవ్యోల్బణం రెక్కలు తొడుగుకుంటే మార్కెట్ ఆధారిత వడ్డీ రేట్లు (పదేళ్ల జీ–సెక్‌లు) పెరిగిపోతాయి. ఇన్వెస్టర్లు 2009–2014 మధ్య భారత ప్రభుత్వ సెక్యూరిటీలను కలిగి ఉన్నట్టయితే వారికి లభించిన రాబడి రేటు వార్షికంగా 3.2 శాతమే. వాస్తవ రాబడి మైనస్ అవుతుంది. అందుకని అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతుందనుకుంటే అటువంటప్పుడు దీర్ఘకాల ప్రభుత్వ సెక్యూరిటీలు, దీర్ఘకాలంతో కూడిన కార్పొరేట్ బాండ్లకు దూరంగా ఉండడమే మంచిది. బ్యాంకుల ఎఫ్డీ రేట్లు సార్వభౌమ బాండ్ల రేటు కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయినా కానీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఇవి చాలవు. ఈ విడత కీలక రేట్ల సవరణ విషయంలో ఆర్బీఐ వేచి చూసే ధోరణితో ఉన్నందున.. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్టు వడ్డీ రేట్లు కూడా సమీప కాలంలో పెరగకపోవచ్చు. ఆర్బీఐ గణాంకాలను పరిశీలిస్తే 2009–2014 మధ్య బ్యాంకు ఎఫ్డీ రేట్లు 8.6 శాతంగా ఉన్నాయి. మంచి రేటు కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో సగటు ద్రవ్యోల్బణం 10.4 శాతంగా ఉంది. నేడు బ్యాంకు ఎఫ్‌డీల రేట్లు 5–6 శాతం మధ్యే ఉన్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటోంది. కనుక వాస్తవంగా ఇన్వెస్టర్‌కు వచ్చే రాబడి ఏమీ ఉండదు. చిన్న మొత్తాల పొదు పథకాల్లో టైమ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్పత్ర, ఎన్ఎస్సీ రేట్లు కూడా 6–7 శాతం మధ్యే ఉన్నాయి. కనుక వాస్తవంగా వచ్చే రాబడి ఒక్క శాతం కూడా మించదు. ఈక్విటీలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొని మెరుగైన వాస్తవ రాబడులకు ఈక్విటీలు మార్గం చూపిస్తాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు బాండ్ల కంటే అధిక రాబడులనే ఇస్తున్నట్టు ఇప్పటి వరకు ఉన్న చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఈక్విటీల్లో రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలంలోనే ఈ రిస్క్‌ను అధిగమించే రాబడులకు అవకాశం ఉంటుంది. కనీసం పదేళ్లు అంతకుమించిన కాలానికి ఈక్విటీల్లో మెరుగైన రాబడులను ఆశించొచ్చు. స్వల్పకాలానికి మాత్రం స్టాక్స్‌లో రాబడులు బాండ్లను మించి, ద్రవ్యోల్బణాన్ని మించి ఉంటాయని చెప్పడానికి లేదు. ఎప్పుడూ కూడా స్టాక్స్ ధరలు ఆయా కంపెనీల వృద్ధినే ప్రతిఫలిస్తుంటాయి. పారిశ్రామిక ముడి పదార్థాలైన పెట్రోకెమికల్స్, కెమికల్స్, పారిశ్రామిక లోహాల ధరలు పెరుగుతుంటే అవి కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే పెరుగుతున్న ధరలను కంపెనీలు పూర్తి స్థాయిలో వినియోగదారులకు బదిలీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొం టాయి. కరోనా రెండో విడత నేపథ్యంలో డిమాండ్ పరిస్థితులు బలహీనంగానే ఉన్నాయి. పెరిగిపోయిన ముడి సరుకుల ధరల వల్ల కంపెనీల లాభాలపై ప్రభావం పడనుంది. కానీ, ఇదే సమయంలో కమోడిటీలను ఉత్పత్తి చేసే కంపెనీలు పెరుగుతున్న ధరల సైకిల్‌తో మంచి లాభాలను నమోదు చేసుకుంటాయి. ఇలా అధిక ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కమోడిటీలను వినియోగించేవి కాకుండా.. వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలను ఎంపిక చేసుకోవడం వల్ల అధిక లాభాలను ఆర్జించేందుకు వీలుంటుంది. బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణ సాధనంగా బంగారాన్ని పరిగణిస్తుంటారు. కానీ, మన దగ్గర ద్రవ్యోల్బణానికి హెడ్జ్ సాధనంగా బంగారానికి అంత ప్రాధాన్యం లేదు. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చిన తరుణంలో బంగారం ప్రాధాన్య సాధనంగా ఉంటోంది. భారత ఇన్వెస్టర్లకు.. అంతర్జాతీయ సంక్షోభ సమయాలు లేదా కమోడిటీల ధరల పెరుగుదల సమయంలోనే రూపాయి క్షీణత కూడా చోటు చేసుకుంటోంది. 2009–2014 కాలంలో అధిక ద్రవ్యోల్బణం సమయంలో మన దేశ ఇన్వెస్టర్లకు బంగారం మంచి రాబడులను కురిపించింది. వార్షికంగా 13.2 శాతం చొప్పున బంగారం ఈటీఎఫ్‌లు రాబడులను ఇచ్చాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుందనుకుంటే ఆ సమయంలో బంగారానికి కొంత కేటాయింపులు సహేతుకమే అవుతాయి. వివేకంతో వ్యవహరించాలి ఇటీవలే మోతీలాల్ ఓస్వాల్ సంస్థ విడుదల చేసిన నివేదికను పరిశీలించినట్టయితే.. నిఫ్టీ ఇండెక్స్‌లోని 11 కంపెనీలు పెరుగుతున్న కమోడిటీల ధరల నుంచి లబ్ధి పొందుతాయని అర్థమవుతోంది. 13 కంపెనీలపై చాలా ప్రతికూల ప్రభావం పడనుంది. మిగిలిన కంపెనీలపై ప్రభావం తటస్థంగానే ఉంటుందని తెలుస్తోంది. అధిక కమోడిటీల ధరలు ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలే ఉంటే.. ఇన్వెస్టర్లు ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలకు దూరంగా ఉండడమే మంచిదవుతుంది. దిగ్గజ కంపెనీలతో పోలిస్తే.. మధ్య తరహా, చిన్న కంపెనీలకు ఉత్పత్తుల ధరలను నిర్ణయించే శక్తి తక్కువగానే ఉంటుంది. కనుక పెరుగుతున్న తయారీ వ్యయాల ప్రభావం వాటిపైనే ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సమయంలో పెద్ద కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సురక్షితం. నిఫ్టీ లాభాల్లో కమోడిటీ కంపెనీల వాటా 36 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉన్న 2009–14 కాలంలో నిఫ్టీ–50 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్, నిఫ్టీ 500 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ వార్షికంగా 17 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఆ కాలంలో ఉన్న సగటు ద్రవ్యోల్బణం 10.4 శాతం కంటే ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇచ్చినట్టు అర్థమవుతోంది. కాకపోతే నాటికి, నేటికీ మధ్య స్టాక్స్ వ్యాల్యూషన్లలో వ్యత్యాసం ఉంది. బేర్ మార్కెట్ తర్వాత 2009లో స్టాక్స్ వ్యాల్యూషన్లు చౌకగా ఉన్నాయి. నిఫ్టీ 50పీఈ 2009 జనవరిలో 13.3 పీఈ వద్ద ఉంది. కానీ నేడు నిఫ్టీ 50 పీఈ 29వద్ద ఉంది. కనుక ఈ దశలో పెట్టుబడులకు ఎంపిక చేసుకునే కంపెనీల విషయంలో వివేకంతో వ్యవహరించాలి. ధరలను శాసించగల కంపెనీలను, పెరుగుతున్న కమోడిటీల ధరల నుంచి లబ్ధి పొందే వాటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీలు ఏ ఇతర సాధనంతో పోల్చినా దీర్ఘకాలంలోనే మెరుగైన రాబడులను ఇచ్చాయి. స్వల్ప కాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులేవనే చెప్పాలి. -
చికెన్ తినలేం.. మటన్ గురించి మాట్లాడలేం
సాక్షి, హైదరాబాద్: పండగ వేళ నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. మార్కెట్లో కూరగాయల దగ్గరనుంచి పప్పులు, నూనెలు, చక్కెర, బెల్లం ధరలు అమాంతం పెరిగిపోయాయి. గుడ్లు, చికెన్, మటన్ ధరలది సైతం అదే పరిస్థితి. సాధారణ రోజులతో పోల్చితే ప్రస్తుతం ప్రతి వస్తువు మీదా సుమారు రూ.10–25 వరకు ధరలు అధికమయ్యాయి. దీంతో సామాన్యుల బతుకులు భారంగా మారాయి. మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడం.. సరిపడాస్టాక్ ఉన్నా కొంతమంది దళారులు, వ్యాపారుల కుమ్మకై సరుకులను బ్లాక్ చేయడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా సామాన్య ప్రజానీకం వివిధ రాకల వంటలకు దూరమవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెరిగిన ధరలతో ఒక్కో కుటుంబంపై రూ. 600 నుంచి రూ. 1,000 వరకు అదనపు భారం పడుతోంది. ఘాటెక్కిన ఉల్లి.. ఉల్లి కొనలేని పరిస్థితి నెలకొంది. వారం రోజుల క్రితం మొదటి రకం కిలో రూ.60ఉండగా, ఇప్పుడు రూ. 80 నుంచి రూ. 100 వరకు విక్రయిస్తున్నారు. రెండో, మూడో రకం ఉల్లిపాయలు రూ. 50 నుంచి రూ.60 కి విక్రయిస్తున్నారు. మెస్‌లు, రెస్టారెంట్లలో ‘నో ఆనియన్’ బోర్డులు తగిలించారు. ఉల్లిపాయ కావాలంటే అదనంగా రూ. 20 చార్జీ చేస్తున్నారు. ఆనియన్ ఆమ్లెట్, ఆనియన్ దోసె వంటివి అమ్మడం లేదు. సన్‌ఫ్లవర్, పామాయిల్ ధరలు పైపైకి... ‘రిటైల్’లో రిఫైండ్ ఆయిల్ 110, పామాయిల్ 95 ధరలు పలుకుతున్నాయి. తాళింపు పెట్టకముందే వంట నూనె ‘గరం’ అవుతోం ది. ఏడాది క్రితం 85–90 మధ్య ధరల్లో ఉన్న వివిధరకాల వంటనూనెలు ఇప్పుడు ‘సెంచరీ’ దాటాయి. కూర ‘గాయాలే’ కూరగాయల ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. ఏ కూరగాయ కొందామన్నా కిలో రూ. 50 నుంచి రూ. 60 పలుకుతోంది. పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతి తదితర ఆకుకూరల ధరలు కూడా మండుతున్నాయి. రూ. 5కు ఐదు కట్టలు అమ్మిన పాలకూర ఇప్పుడు రెండు కట్టల చొప్పున అమ్ముతున్నారు. పరుగులు పెడుతున్న పప్పులు.. పప్పుల ధరలు ఆకాశం వైపు పరుగులు పెడుతున్నాయి. నిన్న ఉన్న ధర నేడు ఉండడం లేదు. మూడు నెలల క్రితం ఉన్న పప్పుల ధరలతో పోల్చుకుంటే ప్రస్తుతం 25 శాతం పెరిగాయి. గత నెలకంటే ఈ నెలలో ఎక్కువగా పెరిగిందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. పెసర, కందిపప్పు రూ. వందకు పైన పెడితే కానీ, కిలో రావడం లేదు. కందిపప్పు కిలో రూ. 100 నుంచి రూ. 120 వరకు పలుకుతోంది. భయపెడుతున్న బియ్యం బియ్యం ధరలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. మంచి రకం బియ్యం కిలో రూ. 45 నుంచి రూ.55 వరకు అమ్ముతున్నారు. ఇక సోనామసూరి, కర్నూల్ మసూరి, వరంగల్, సోనా రత్న, సూపర్‌ఫైన్, ఫైన్ రైస్ వంటి రకాల బియ్యం ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగిపోయాయి. నూకలు తిందామన్నా కిలో రూ.15 పైనే ఉన్నాయి. చేదెక్కిన చక్కెర చక్కెర కిలో రూ. 40 ఉంది. పావు, అర కిలో చొప్పున కొనుగోలు చేస్తే మాత్రం కిలో రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే చక్కెర కోటాను తగ్గించడంతో సామాన్యులు కిరాణా దుకాణాల్లో చక్కెరను కొనుగోలు చేయాల్సి వస్తోంది. చికెన్ తినలేం.. మటన్ గురించి మాట్లాడలేం చికెన్ ధర మండిపోతోంది. మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.250 నుంచి రూ.260 పలుకుతోంది. మటన్ ధరలు రూ. 650 ఉండగా పండుగ పూట్ మార్కెట్‌కు మేకలు, గొర్రెల దిగుమతులు లేకపోవడంతో ధరలు విపరీతంగా పెంచారు. దీంతో కిలో మటన్ రూ. 750 నుంచి 800 వరకు విక్రయిస్తున్నారు. -
ధరలను పెంచేసిన ఎం అండ్ ఎం
సాక్షి, ముంబై: యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) వాహనదారులకు చేదువార్త అందించింది. ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సోమవారం ప్రకటించింది. కమొడిటీ ధరలు పెరగిన నేపథ్యంలో కొన్ని మోడళ్ల వాహనాల ధరలను పెంచాలని భావిస్తున్నామని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ రాజన్ వధేరా ప్రకటించారు. ప్యాసింజర్ వాహనాల ధరలను 30వేల రూపాయలు లేదా 2 శాతం పెంచాలని కంపెనీ భావిస్తున్నామన్నారు. ఆగస్టు నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ మార్కెట్లో ఎక్స్‌యూవీ 500, స్కార్పియో, టీయూవీ 300, కేయూవీ100 తదితర మోడళ్ల ప్యాసింజర్ వాహనాల శ్రేణిని ఎం అండ్ ఎం విక్రయిస్తుంది. కాగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటించింది. 2.2 శాతం పెరిగిన ధరలు ఆగస్టు నుంచి అమల్లోకి రానున్నాయి. -
నిత్యవసరాల ధరలను అందుబాటులో ఉంచాలి
జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ ఆదేశం ఒంగోలు కలెక్టరేట్ : నిత్యవసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్ ఆదేశించారు. స్థానిక తన చాంబ ర్లో బుధవారం సాయంత్రం నిర్వహించి న జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బియ్యం ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదని, పౌరసరఫరాలశాఖ ద్వారా రైతు బజార్లలో బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికే కందుకూరు రైతు బజార్లో నెల్లూరు సన్నాలు బియ్యాన్ని కిలో 30 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపా రు. ఒంగోలులోని రైతు బజార్లలో కూడా ఆ రకం బియ్యాన్ని అదే ధరకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైస్మిల్ల ర్ల యజమానులతో సమావేశాన్ని ఏర్పా టు చేసి ప్రత్యేక కౌంటర్ల ద్వారా సాధారణ ధరకే బియ్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతు బజార్లలో కూడా కొన్నిరకాల నిత్యవసర సరుకుల ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ జేసీ అసహనం వ్యక్తం చేశారు. టమోటా కిలో 32, కందిపప్పు 62, మినుములు 44, ఉల్లిపాయలు కిలో 17 రూపాయల ధర ఉందన్నారు. ధరలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను జేసీ ఆదేశించారు. ప్రజల జీవితాలతో చెలగాటం : మాగులూరి వ్యాపారస్తులు కల్తీ మినరల్ వాటర్ విక్రయిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వినియోగదారుల సంఘ అధ్యక్షుడు మాగులూరి నాగేశ్వరరావు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు తనిఖీలు నిర్వహించి లెసైన్స్ లేని మినరల్ వాటర్ కంపెనీలను మూసివేయించాలని కోరారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ హోదాను ఒంగోలు దక్కించుకున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌కు 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని మరో సభ్యుడు ఫిర్యాదు చేశారు. అధికంగా వసూలు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రంగాకుమారి, సివిల్ సప్లయిస్ డీఎం కొండయ్య, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఉద్యానవనశాఖ ఏడీలు రవీంద్ర, జెన్నమ్మ, తూనికలు, కొలతలశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.