సాక్షి, అమరావతి: మార్కెట్ ధరలకన్నా తక్కువకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను గ్రామీణులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యాచరణను సిద్ధంచేసింది. ఇందులో భాగంగా పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో మండలాల వారీగా ‘చేయూత’ మహిళా సూపర్‌మార్కెట్లను ఏర్పాటుచేయనుంది. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా మార్ట్‌లు విజయవంతం కావడంతో ఈ ఫార్ములాను గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలుచేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంకల్పించింది.
ప్రయోగాత్మకంగా జూలై నాటికల్లా జిల్లాకు రెండేసి చొప్పున 52 మండలాల్లో వీటిని ఏర్పాటుచేయనుంది. చేయూత మహిళా మార్ట్‌గా వీటికి నామకరణం చేశారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున ఈ మహిళా మార్ట్‌లను ఏర్పాటుచేస్తారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా అర్హులైన పేద మహిళలకు ఏటా దాదాపు రూ.11 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే.
ఇలా ఆర్థిక లబ్ధిపొందిన మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, హిందూస్థాన్ లీవర్, ఐటీసీ, రిలయెన్స్, అమూల్ వంటి అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలు సాధారణ మార్కెట్ ధర కన్నా తక్కువకే తమ కిరాణా సరుకులను 78,931 మహిళా సంఘాల రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నాయి.
తక్కువ ధరకే సేకరణ.. విక్రయాలు
ఇక సూపర్ మార్కెట్‌కు అవసరమైన ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి, కారం, పసుపు, వివిధ రకాల మసాలాలతో పాటు నెయ్యి, పల్లీచిక్కీ వంటి స్థానికంగా దొరికే నాణ్యమైన ఉత్పత్తులను పొదుపు సంఘాల్లోని మహిళలు సేకరిస్తారు. మరోవైపు.. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న కార్పొరేట్ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను హోల్‌సేల్ వ్యాపారులకు ఇచ్చే ధరకే మహిళా సంఘాలకు సరఫరా చేసే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతంలో సాధారణ వ్యాపారుల కన్నా తక్కువ ధరకు ఈ సూపర్ మార్కెట్లు నాణ్యమైన నిత్యావసర సరుకులు సేకరించే వీలుందని.. అదే సమయంలో కొంత లాభం వేసుకుని మార్కెట్ ధర కన్నా తక్కువకు వినియోగదారులకు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మహిళా మార్ట్‌ల ఏర్పాటు ఇలా..
మండలంలోని మహిళా సంఘాల సభ్యులందరూ ఫెడరేషన్‌గా ఏర్పడతారు. అందులో ప్రాథమికంగా ఒకొక్కరు రూ.150ల నుంచి రూ.200ల మధ్య షేర్ క్యాపిటల్‌గా పెట్టుబడి పెడతారు. అదనంగా అవసరమైన నిధులను మండల సమాఖ్య ద్వారా స్త్రీనిధి, లేదంటే బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని కనీసం రూ.30 లక్షలతో ఈ సూపర్ మార్కెట్లను ఏర్పాటుచేస్తారు.
ఆ మండలంలోని పొదుపు సంఘాల మహిళలు ప్రతినెలా తమ కుటుంబ అవసరానికి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ ఆ సూపర్‌మార్కెట్ ద్వారానే కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తారు. ఇతర వినియోగదారులను కూడా ఆకర్షించేలా హోల్‌సేల్ ధరలకే సరుకులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మరోవైపు.. మండల పరిధిలో ఎక్కువమందికి అందుబాటులో ఉండేలా ఓ పెద్ద గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడ కనీసం 1000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తారు.
వీటి ద్వారా నెలకు కనీసం లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారుల ప్రాథమిక అంచనా. వచ్చే లాభాలను మొదట్లో ఫెడరేషన్ సభ్యుల్లో అవసరమైన వారికి తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడం.. తర్వాత దశలో లాభాలను సమానంగా పంచుకోవడం వంటివి ఉంటాయి.
సూపర్‌మార్కెట్ నిర్వహణకు కమిటీలు
ఇక సూపర్ మార్కెట్ నిర్వహణకు పొదుపు సంఘాల్లోని మహిళలతో కమిటీలను ఏర్పాటుచేస్తారు. వాటిల్లో పనిచేసేందుకు సిబ్బందిని కూడా పొదుపు సంఘాల్లోని చురుకైన మహిళలనే ఎంపిక చేస్తారు. ఇక సూపర్ మార్కెట్ రోజు వారీ నిర్వహణ, కావాల్సిన సరుకులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడం.. అమ్మకాలకు సంబంధించి రికార్డుల నిర్వహణపై సభ్యులకు సెర్ప్ అధికారులతో పాటు వివిధ అంతర్జాతీయ వ్యాపార సంస్థలతో శిక్షణ ఇప్పిస్తారు.
15, 16 తేదీల్లో జిల్లా పీడీల భేటీ
పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా మార్ట్‌లు విజయవంతం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ చేయూత మహిళా మార్ట్‌ల పేరుతో ఏర్పాటుచేస్తున్నాం. ప్రాథమికంగా ప్రతి జిల్లాకు రెండేసిచోట్ల జూలై నాటికి వీటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. దీనిపై చర్చించేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో అన్ని జిల్లాల పీడీలతో సమావేశం ఏర్పాటుచేశాం.
– మహ్మద్ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment