భారత రిటైల్ ద్రవ్యోల్బణం(inflation) 2024 డిసెంబర్‌లో గణనీయంగా క్షీణించి నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. నవంబర్‌లో 5.48 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 5.22 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం తగ్గుదలే(decline) ఇందుకు ప్రధాన కారణమని గణాంకాలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో 9.04% నుంచి డిసెంబర్‌లో 8.39%కి పడిపోయింది.
మెరుగైన సరఫరా, అంతర్జాతీయ పరిణామాల్లో మార్పులు డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణమని ఎంఓఎస్‌పీఐ పేర్కొంది. అయినప్పటికీ కూరగాయలు, పండ్లు, వంట నూనెలు వంటి కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు భారీగానే ఉన్నాయని అభిప్రాయపడింది. ఆహార ధరలను ప్రధాన కారణంగా పేర్కొంటూ ఆర్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచింది. ఈసారి ద్రవ్యోల్బణం మొత్తంగా తగ్గినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా 5.76%, పట్టణ ప్రాంతాల్లో 4.58% ద్రవ్యోల్బణం ఉంది. ఆర్బీఐ లక్ష్యం ప్రకారం ఇది 4 శాతానికి మించకూడదు.
వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 2022 ఏప్రిల్‌లో గరిష్టంగా 7.79 శాతం నమోదైనప్పటి నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ హెచ్చుతగ్గులను నిశితంగా గమనిస్తూ వడ్డీ రేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం పరిధిలో ఉంచాలని ఆర్‌బీఐ కీలక చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ ఆర్థిక అస్థిరతల వల్ల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గత 11 విధాన పరపతి సమావేశాల్లో ఆర్‌బీఐ వడ్డీరేట్లను మార్చకుండా స్థిరంగా రెపో రేటును 6.5 శాతం వద్ద ఉంచింది.
ఇదీ చదవండి: మస్క్‌కు ప్రభుత్వం ఆహ్వానం
ప్రస్తుత ఆర్థిక ఒడిదొడుకుల్లో ద్రవ్యోల్బణం తగ్గడం శుభపరిణామమే. కానీ అస్థిరమైన ఆహార ధరలు, ఆర్థిక ప్రతికూలతల వల్ల భవిష్యత్తులో సవాళ్లు తప్పవు. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్న నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఆర్‌బీఐ ఈసారి జరగనున్న మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో కీలకంగా వ్యవహరిస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment