ఈసారైనా టెస్లాకు లైన్ క్లియర్ అవుతుందా?
టెస్లా(Tesla) సీఈఓ ఎలాన్ మస్క్‌తోపాటు ఇతర ప్రధాన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థల ఉన్నతాధికారులకు దేశంలోని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం (SPMEPCI)కు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు వారికి ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం ఈమేరకు చర్చసాగనుంది.
మార్చి 2024లో కొత్త ఈవీ పాలసీని ప్రతిపాదించారు. ప్రపంచ వాహన తయారీదారులను ఆకర్షించడానికి, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచడానికి దీన్ని రూపొందించినట్లు ప్రభుత్వం గతంలో తెలిపింది. స్థానిక తయారీ, సరఫరాను తప్పనిసరి చేస్తూ దేశంలో ఉత్పత్తి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఈ పథకం ప్రోత్సాహకాలను అందిస్తుంది. ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్ (పీఎల్ఐ-ఆటో) కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అనుగుణంగా దేశీయ విలువ జోడింపు (DVA)ను లెక్కిస్తారు.
ఈవీ పాలసీ నిబంధనలు ఇవే..
భారతదేశంలో కనీసం 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,150 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్న వాహన తయారీదారులకు దిగుమతి సుంకాలను తగ్గించాలనే నిబంధనలున్నాయి. ఏదైనా కంపెనీ స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలో 25% డీవీఏ(DVA), ఐదో సంవత్సరం నాటికి 50% డీవీఏ సాధించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన తయారీదారులకు చెందిన ఉత్పత్తులు 35,000 డాలర్లు(రూ.30 లక్షలు) కంటే ఎక్కువ ధర ఉంటే దిగుమతి పన్ను సుమారు 70%గా విధిస్తారు.
విభిన్న వాదనలు
ప్రతిపాదిత పథకానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ పథకం ద్వారా గణనీయమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నప్పటికీ టెస్లా, విన్‌ఫాస్ట్ వంటి వాహన తయారీదారులు కొన్ని నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 2024లో పాలసీపై ఇరు కంపెనీల నుంచి భిన్న వాదనలు వినిపించాయి. డీవీఏ లెక్కింపు పద్ధతి, అర్హత ప్రమాణాలపై ఆందోళన చెందాయి. నిర్ణీత గడువులోగా డీవీఏ లక్ష్యాలను చేరుకోవడంపై టెస్లా తన సలహాదారు ‘ది ఆసియా గ్రూప్ (TAG) ఇండియా’ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఇప్పటికే విన్‌ఫాస్ట్ పెట్టుబడులు
500 మిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంటును నిర్మిస్తున్న వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్, ముందుగా కంపెనీలు చేస్తున్న ఖర్చులకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని కోరుతోంది. ఈ రెండు కంపెనీలే కాకుండా ఇతర కంపెనీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని పాలసీ మార్గదర్శకాలను సవరించడానికి ప్రభుత్వం యోచిస్తుందేమో చూడాల్సి ఉంది. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఆర్ అండ్ డీ), ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ పథకంలో చేర్చాలని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి.
ఇదీ చదవండి: గోవాలో హై డిమాండ్ వేటికంటే..
గతంలో మస్క్ పర్యటన రద్దు
2024లో మస్క్ ఇండియా పర్యటన కొన్ని కారణాల వల్ల రద్దు అయింది. అప్పటి నుంచి భారత్‌లో కంపెనీ పెట్టుబడి ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారాయి. తాజా పరిణామాల వల్ల ఈమేరకు తిరిగి చర్చసాగే అవకాశం ఉంటుదేమోనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో రాబోయే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. దాంతో త్వరలో జరగబోయే ఈ సంప్రదింపులకు ప్రాముఖ్యత సంతరించుకుంది. టెస్లా, హ్యుందాయ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, కియా, టయోటాతో సహా టాటా మోటార్స్, మహీంద్రా, హీరో మోటోకార్ప్ వంటి భారతీయ కంపెనీలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment