కొత్త ఏడాదిలో తొలి లాభం
కొత్త ఏడాదిలో ఐదురోజులపాటు వరుస నష్టాలు చవిచూసిన స్టాక్ సూచీలు బుధవారం తొలిసారిగా లాభపడ్డాయి. స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 36 పాయింట్లు ఎగిసి 20,729 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 6,174 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎంపికచేసిన పీఎస్‌యూ, ఫార్మా, ఆటో షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలుచేశారు. కోల్ ఇండియా, గెయిల్, సిప్లా, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 2-3%ర్యాలీ జరిపాయి. టాటా పవర్, కెయిర్న్ ఎనర్జీ, ఎన్‌ఎండీసీ, పీఎన్‌బీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు 1-2% మధ్య పెరిగాయి. ప్రధాన బ్యాంకింగ్ షేర్లన్నీ మందకొడిగా ట్రేడయినా, ప్రత్యేక డివిడెండ్ ప్రకటిస్తున్నాయన్న వార్తలతో మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు 4-8% మధ్య భారీ ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ జరిపాయి. ఎఫ్‌ఐఐలు రూ. 79 కోట్ల పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 88 కోట్లు వెనక్కు తీసుకున్నాయి.
పీఎస్‌యూ బ్యాంకింగ్ కౌంటర్లలో లాంగ్ బిల్డప్...
మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకింగ్ కౌంటర్లలో భారీ నగదు కొనుగోళ్లతో పాటు ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో పెద్ద ఎత్తున లాంగ్ బిల్డప్ జరిగింది. అన్నిటికంటే అధికంగా 8 శాతం ర్యాలీ జరిపిన సిండికేట్ బ్యాంక్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 14.28 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 61.08 లక్షల షేర్లకు పెరిగింది. అలహాబాద్ బ్యాంక్ ఫ్యూచర్ ఓఐలో 17.22 లక్షల షేర్లు (34 శాతం), యూనియన్ బ్యాంక్ ఫ్యూచర్లో 13.72 లక్షల షేర్లు (15 శాతం), ఐడీబీఐ బ్యాంక్ ఫ్యూచర్లో 9.52 లక్షల షేర్లు (11 శాతం), బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్లో 15.08 లక్షల షేర్లు (24 శాతం), కెనరా బ్యాంక్ ఫ్యూచర్లో 5.74 లక్షల షేర్ల (9.5 శాతం) చొప్పున యాడ్ అయ్యాయి. అయితే నిఫ్టీ 50 షేర్లలో భాగమైన స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫ్యూచర్లలో ఓఐ తగ్గింది. బీవోబీ 2 శాతం పెరిగినప్పటికీ, ఎస్‌బీఐ స్వల్పంగా తగ్గింది.