వ్యక్తిగత సంపదలో భారత్‌కు 10వ స్థానం
న్యూఢిల్లీ: దేశాల వారీగా వ్యక్తిగత సంపద విషయంలో భారత్ ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. దేశం మొత్తం ప్రైవేటు సంపద విలువ 3,492 బిలియన్ డాలర్లు. ఆస్తి, నగదు, ఈక్విటీలు, బిజినెస్ ప్రయోజనాలుసహా ప్రతి దేశంలోని వ్యక్తులందరి ప్రైవేటు సంపద ప్రాతిపదికన న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ 2015కు సంబంధించి ఈ నివేదికను విడుదల చేసింది. ఈ వరుసలో 48,734 బిలియన్ డాలర్లతో అమెరికా ముందు నిలిచింది.
వరుసలో తరువాత 8 స్థానాల్లో చైనా(17,254 బిలియన్ డాలర్లు), జపాన్(15,230 బి. డాలర్లు), జర్మనీ (9,358 బి. డాలర్లు), బ్రిటన్(9,240 బి. డాలర్లు), ఫ్రాన్స్(8,722 బి. డాలర్లు), ఇటలీ (7,308 బి. డాలర్లు), కెనడా(4,796 బి. డాలర్లు), ఆస్ట్రేలియా(4,497 బి. డాలర్లు) నిలిచాయి.
తలసరి విషయంలో 20వ ర్యాంక్.
కాగా ఈ సంపద తలసరి విషయానికి వచ్చే సరికి భారత్ 20వ స్థానంలో నిలిచింది. భారతీయుని సగటు సంపద 2,800 డాలర్లుగా ఉంది. అధిక జనాభా దీనికి కారణంగా కనిపిస్తోంది. 2,85,100 డాలర్లతో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. అయితే 2000వ సంవత్సరంలో భారత్‌లో వ్యక్తిగత సంపద తలసరి కేవలం 900 డాలర్లు. 2015 నాటికి 211 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఈ 15 సంవత్సరాల్లో భారీగా సంపద వృద్ధి నమోదుచేసుకున్న దేశం ర్యాంకుల్లో భారత్ 5వ స్థానాన్ని దక్కించుకుంది.