పెట్టుబడికి ఏది బెటర్?
సాక్షి, హైదరాబాద్ : బంగారం, ఈక్విటీలు, షేర్లు, స్థిరాస్తి.. వీటిల్లో పెట్టుబడికి ఏదీ బెటర్ అని అడిగితే? చాలా మంది నుంచి వచ్చే సమాధానం స్థిరాస్తి అనే! ఎందుకంటే రియల్టీ ధరలు.. అందులోనూ స్థలాల ధరలు పెరగడమే తప్ప తగ్గడమంటూ ఉండదు గనక! పైపెచ్చు ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరం వైపు అడుగులేస్తోంది కనక.. స్థలాలకు గిరాకీ పెరుగుతుందని నిపుణుల సూచన.
స్థలమెక్కడ?
ముందుగా మీరు స్థలంపై ఎంత పెట్టుబడి పెట్టగలరనే విషయంపై ఓ అవగాహనకు వచ్చాక.. ఆ తర్వాత ఎక్కడ కొనాలో నిర్ణయించుకోండి. ఇప్పుడు కాకపోయినా ఓ పదేళ్లయ్యాకైనా స్థలం విలుల రెట్టింపయ్యే అవకాశం గల ప్రాంతాన్ని ఎంచుకోండి. ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఆస్కారమున్న ప్రాంతాలైతే ఉత్తమం.
హెచ్‌ఎండీఏ లాంటి స్థానిక సంస్థలు తరచూ వేలం పాటలను నిర్వహిస్తాయి కాబట్టి వీలుంటే ఓసారి కనుక్కోండి. క్రమం తప్పకుండా లావాదేవీలు నిర్వహించే మీ బ్యాంకు ఆమోదం ఉన్న లే అవుట్లు ఉన్నాయోమో ఓసారి ఆరా తీయండి. బృహత్ ప్రణాళిక ప్రకారం మీరు కొనే ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉంటే ఉత్తమం.
పెట్టుబడికి ఏది బెటర్?
మీరు కొనాలనుకున్న స్థలం దేని పరిధిలోకి వస్తుంది? అంటే రెసిడెన్షియల్ జోన్ కిందికొస్తుం దా? కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి వస్తుందా? అనే విషయాల్ని కనుక్కోండి. హెచ్‌ఎండీఏ తాజా బృహత్ ప్రణాళిక ప్రకారం.. దాదాపు ఆరు వేల కిలో మీటర్లు విస్తరించిన హుడా ఎక్స్‌టెండెడ్ ఏరియాను 12 స్థల వినియోగ జోన్లుగా వర్గీకరించారు. ఏ స్థలం ఏయే జోన్ పరిధిలోకి వస్తుందో తెలియని పరిస్థితి. హెచ్‌ఎండీఏ అధికారుల్ని అడిగినా సరైన సమాధానం రాకపోవచ్చు. రిక్రియేషన్ జోన్ పరిధిలోని స్థలం కొని విశాలమైన ఇల్లు కట్టుకుంటానంటే కుదరదు. కాబట్టి, ఈ విషయంలో ముందే అవగాహనకు రండి.
ధర ఎంత?
మాంద్యం తర్వాత మార్కెట్లో స్థలాల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి మీరు ఎంపిక చేసుకున్న ప్లాటులో ప్రస్తుతం ధరెంత చెబుతున్నారు. బూమ్ సమయంలో ధర ఎంతుందో బేరీజు వేయండి. ఆ తర్వాత సదరు సంస్థ నుంచి స్థలం పత్రాలు, టైటిల్ డీడ్, పన్ను రశీదులుంటే అడిగి తీసుకోండి. వాటిని లాయర్‌తో పరిశీలింపజేయండి.
♦ స్థానిక సంస్థల నుంచి స్థలం కొనాలని భావిస్తే బేరమాడే అవకాశముండదు. అదే ప్రైవేటు సంస్థలనుకోండి.. మీరు ఎంత దాకా పెట్టగలరో సూటిగా చెప్పొచ్చు. ధర విషయంలో మీరో నిర్ణయానికి రాగానే.. సంస్థ నిబంధనల ప్రకారం కొంత సొమ్ము ముందు చెల్లించండి. మిగతా మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో వివరించండి. కొన్ని ప్రైవేటు రియల్టీ సంస్థలూ బ్యాంకులతో అవగాహన కుదుర్చుకుని రుణాలిస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు.
రిజిస్ట్రేషన్ మీ పేరిటే
మీరు సొమ్మంతా కట్టేశాక.. స్థలాన్ని మీ పేరిట రిజిస్టర్ చేసుకోండి. ఏదేనీ లే అవుట్‌లో స్థలం కొంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఖాళీగా ఉన్న ప్రాంతంలో కొంటే ముందుగా పునాది వేసుకోండి. వీలైతే గోడ కూడా కట్టుకోండి. అపరిచితులు ఆక్రమించకుండా ఉండాలంటే మాత్రం మీరు క్రమం తప్పకుండా మీ స్థలంపై దృష్టి సారించాలి.