సాక్షి, హైదరాబాద్: బంగారం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ ఇలా పెట్టుబడి సాధనాలు చాలానే ఉన్నాయి. అయితే వీటిల్లో ఏది లాభదాయకంగా ఉంటుందనేదే చర్చ. కరోనా తర్వాతి నుంచి ఈక్విటీ మార్కెట్ ఎంత నష్టపోయాయో మనకు తెలిసిందే. ఫస్ట్ వేవ్ (2020, డిసెంబర్-మార్చి, 2021)లో బంగారం విలువ 4 శాతం మేర పెరిగినప్పటికీ.. ఆశించిన స్థాయిలో వృద్ధి చెందలేదు. ఇక, స్థిరాస్తి ధరలైతే కరోనా తొలి దశలో స్థిరంగా ఉండి.. ఆ తర్వాత 7 శాతం మేర పెరిగాయి.
ఫస్ట్ వేవ్‌లో.. : ద్రవ్యత, సౌలభ్యం కారణంగా భారతీయ కుటుంబాలకు ఇష్టమైన పెట్టుబడి సాధనం బంగారం. 2019 ముగింపు నాటికి కరోనా మహమ్మారి విజృంభించింది. ఈ దశలో బంగారం ధర 4 శాతం మేర పెరిగింది. అస్థిరమైన పెట్టుబడి ఈక్విటీలు. వీటిపై సామాజిక, రాజకీయ, ఆర్థ్ధిక ప్రతికూలతలు ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాయి. కోవిడ్ ఫస్ట్ వేవ్‌లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన మన దేశంలో 2019, డిసెంబర్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 29 శాతం మేర క్షీణించింది. రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా పరిగణిస్తారు. భౌతికంగా ఉండటం, సులభతరం విక్రయం, తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వంటివి రియల్టీ పెట్టుబడులకు అదనపు బలాలు. అయితే ఫస్ట్ వేవ్‌లో ప్రాజెక్ట్‌ల అమలు, అభివృద్ధి, విక్రయాలలో అనిశ్చిత కారణంగా గృహ సముదాయాల విపణి మాత్రం స్థిరంగా ఉంది.
సెకండ్ వేవ్‌లో.. : ఇక కోవిడ్ రెండో దశ మరింత కఠినంగా మారింది. ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్ కొనసాగింపులు ఒకవైపు.. లక్షలాది మంది ప్రాణ నష్టం మరో వైపు నేపథ్యంలో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే ఫస్ట్ వేవ్ పాఠాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు చురుకుగా వ్యవహరించడంతో క్రితం నెలతో పోలిస్తే గతేడాది ఏప్రిల్‌లో సెన్సెక్స్ 1 శాతం మేర వృద్ధి చెందింది. బంగారం మునుపటి గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పటికీ... రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మళ్లీ స్థిరంగానే ఉంది.
థర్డ్ వేవ్‌లో.. : కరోనా ప్రభావం తగ్గిన థర్డ్ వేవ్‌లో ఈ ఏడాది ప్రారంభంలో సెన్సెక్స్ రికార్డు స్థాయికి చేరింది. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం, భౌగోళిక రాజకీయ ప్రతికూలతలు, సరఫరాలో సమస్యల కారణంగా బంగారం పెట్టుబడులు మళ్లీ క్షీణించాయి. కరోనా కాలంలో గృహ సముదాయ విపణి స్థిరంగా ఉండి, ప్రస్తుతం వృద్ధి బాటలో పయనిస్తుందని అనరాక్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో సగటు ధర పెరిగిందని చెప్పారు. మహమ్మారి సమయంలో సరఫరాకు మించి విక్రయాలు జరిగాయని పేర్కొన్నారు. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.
భవిష్యత్తు ఎలా ఉంటుందో..
అన్ని పెట్టుబడి విభాగాలు కరోనా కంటే ముందు స్థాయిని మించిపోయాయి. 2019 సెప్టెంబర్‌తో పోలిస్తే సెన్సెక్స్‌లో 52 శాతం, బంగారం ధరలో 34 శాతం, గృహ సముదాయ ధరలు 9 శాతం మేర పెరిగాయి. అయితే ప్రపంచ అనిశ్చితులు, ద్రవ్యోల్భణ వృద్ధి వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఆయా పెట్టుబడి విభాగాలు బలంగానే ఉండే సూచనలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
కరోనా గృహ అవసరాన్ని పెంచింది. కోవిడ్‌తో ఇళ్లు కేవలం వసతి మాత్రంగానే కాకుండా ఎన్నో అవసరాలను తీర్చింది. ఆర్థిక అస్థిరత సమయంలో భద్రతను ఇస్తుందని ప్రశాంత్ ఠాకూర్ వివరించారు. బంగారం, స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉండటంతో పాటు నష్టాలకు లోబడి ఉంటాయి. ప్రస్తుతం స్థిరాస్తి సరఫరా, డిమాండ్ కార్యకలాపాలు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. 2019 హెచ్2తో పోలిస్తే 2022 హెచ్1లో గృహ ప్రాజెక్ట్‌ల లాంచింగ్‌లు 76 శాతం, విక్రయాలు 61% మేర పెరిగాయి. రానున్న పండుగ సీజన్‌లో హౌసింగ్ మార్కెట్‌లో లావాదేవీలు పెరుగుతాయని, దీంతో ధరలూ వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment