ఈక్విటీల్లో తగ్గిన ‘బీమా’ పెట్టుబడులు
2016–17లో రూ.16,793 కోట్లకు పరిమితం
ముంబై: ఎల్‌ఐసీ సహా జీవిత బీమా కంపెనీలు ఈక్విటీల్లో తాజా పెట్టుబడులను గణనీయంగా తగ్గించాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో బీమా కంపెనీల పెట్టుబడులు నికరంగా రూ.39,535 కోట్లు ఉండగా, అవి గత ఆర్థిక సంవత్సరం (2016–17)లో ఏకంగా 57 శాతం తగ్గి రూ.16,793 కోట్లకు పరిమితమయ్యాయి. స్టాక్ మార్కెట్లు మార్చి చివరికి గరిష్ట స్థాయి (సెన్సెక్స్ 29,620)లకు చేరుకోవడమే ఇందుకు కారణం. జీవిత బీమా కంపెనీల మొత్తం ఈక్విటీ పెట్టుబడుల విలువ గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.56 లక్షల కోట్లకు చేరుకుంది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.5.95 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 25% పెరిగింది. ఈక్విటీల్లో పెట్టుబడులు తగ్గించిన జీవిత బీమా కంపెనీలు... మరోవైపు రిస్క్ తక్కువగా ఉండే ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ (అధిక శాతం ప్రభుత్వ సెక్యూరిటీలు) పథకాల్లో 15% అధికంగా రూ.21,67,143 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. జీవిత బీమా సంస్థల అన్ని రకాల పెట్టుబడుల విలువ 2015–16లో రూ.25.29 లక్షల కోట్లుగా ఉంటే, ఈ విలువ 2016–17లో రూ.29.81 లక్షల కోట్లకు వృద్ధి చెందడం విశేషం.
‘‘2016–17లో ఈక్విటీల్లో బీమా సంస్థల కొనుగోళ్ల కంటే విక్రయాలే ఎక్కువ. బీమా కంపెనీల ఈక్విటీ పెట్టుబడుల విలు వ అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25.5% పెరిగి, రూ.7.56 లక్షల కోట్లకు చేరింది. ఈ వృద్ధి అన్నది పూర్తి ఏడాది పాటు కొనసాగింది’’ అని అని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెక్రటరీ వి.మాణిక్యం తెలిపారు. రూ.1.61 లక్షల కోట్ల మేర పెట్టుబడుల విలువ పెరగ్గా, అందులో ఒక్క ఎల్‌ఐసీ వాటాయే రూ.1.28 లక్షల కోట్ల మేర ఉన్నట్టు చెప్పారు.