బీమా నుంచి గాడ్జెట్ల దాకా!! | It Is Good To Start Economic Plans From A Young Age Before Today | Sakshi
Sakshi News home page

బీమా నుంచి గాడ్జెట్ల దాకా!!

Mar 5 2018 9:21 AM | Updated on Mar 5 2018 9:21 AM

 It Is Good To Start Economic Plans From A Young Age Before Today - Sakshi

మన దేశీ జనాభాలో దాదాపు సగం మంది పాతికేళ్ల కన్నా తక్కువ వయసున్న వారే. ఇక ముప్ఫై అయిదేళ్ల కన్నా తక్కువ వయసున్న వారిని చూస్తే ఏకంగా 65 శాతం. ఇందులో చాలా మంది ఇప్పటికే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వారో.. లేదా త్వరలో చేరబోయే వారో, స్వయం ఉపాధిలో ఉన్నవారో ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో యువజనాభా ఉండటం.. దేశానికి ప్రయోజనకరమే. అయితే, వీరంతా రిటైరయ్యాక పరిస్థితి ఏంటి? రిటైరయిన వారికీ భరోసానిచ్చేలా సామాజిక భద్రత పథకాలు, వృద్ధులకు చెప్పుకోతగ్గ స్థాయిలో ఆదాయాన్నిచ్చే ఆర్థికపరమైన తోడ్పాటు మన దగ్గర లేకపోవడంతో.. వీరంతా తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు సమస్యలు తప్పవు. పైగా.. దేశీయంగా ఉద్యోగానికి సైతం భద్రత తగ్గిపోతోంది. అందుకే... నేటి యువతరం కాస్త ముందు నుంచే ఆర్థిక ప్రణాళికలను వేసుకోవడం మంచిది. భవిష్యత్‌ అవసరాలు చిన్నవైనా, పెద్దవైనా... లక్ష్యాలు స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనవైనా... స్మార్ట్‌గా అధిగమించవచ్చు. 

స్వల్ప, మధ్యకాలిక లక్ష్యాల కోసం సిప్‌లు..
అన్నింటికన్నా ముందుగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఒకటి తీసుకోవడం ప్రధానం. మీ కంపెనీ నుంచి ఆరోగ్య బీమా కవరేజీ ఉన్నప్పటికీ.. కుటుంబం మొత్తానికి ఉపయోగపడేలా ప్రత్యేకంగా ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ ఒకటి తీసుకోవడం శ్రేయస్కరం. ఇందుకోసం ప్రీమియం వార్షికంగా చెల్లించేలా ప్లాన్‌ చేసుకోండి. మిగతా కాలవ్యవధులతో పోలిస్తే.. దీని వల్ల ప్రీమియం కొంత తగ్గుతుంది. 

అటుపైన స్వల్పకాలిక డెట్‌ ఫండ్‌లో నెలవారీగా సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లో (సిప్‌) ఇన్వెస్ట్‌ చేయడం మొదలెట్టండి. తర్వాత ప్రతి ఏటా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీకి అవసరమైన మొత్తాన్ని క్రమంగా సదరు డెట్‌ఫండ్‌ సిప్‌ నుంచి విడ్‌డ్రా చేసి కట్టేయొచ్చు. ఈ విధానంతో రెండురకాల ప్రయోజనాలుంటాయి. మొదటిది... వార్షికంగా కట్టడం వల్ల ప్రీమియం కొంత తగ్గుతుంది. అదే సమయంలో మీరు సిప్‌లో ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చే పెట్టుబడి ఏడాది పొడవునా ఎంతో కొంత రాబడి అందిస్తూనే ఉంటుంది. అలాగే, కాస్త ముందుగా ప్లాన్‌ చేసుకుంటే.. స్మార్ట్‌ఫోన్లూ, ల్యాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్లు.. ఇతర గాడ్జెట్స్‌ లాంటివి కొనుక్కోవడానికి ఈఎంఐల బాట పట్టకుండా సొంతంగానే కొనుక్కునే వీలుంటుంది. ఇందుకోసం కూడా స్వల్పకాలిక సిప్‌లు ప్రారంభించవచ్చు. తర్వాత వాటి నుంచి కొద్దికొద్దిగా విత్‌డ్రా చేసుకుని మీరు కోరుకున్న గాడ్జెట్స్‌.. లేదా వస్తువులు కొనుక్కోవచ్చు. 

దీర్ఘ కాలికానికీ సిప్‌లు...
యుక్త వయసులో కాస్త రిస్కు సామర్థ్యం ఎక్కువగానే ఉంటుంది కనుక... దీర్ఘకాలంలో అధిక రాబడులిచ్చే అవకాశాలున్న ఈక్విటీల్లో అధికంగా ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే దీర్ఘకాలికంగా షేర్లలో రిస్కులు క్రమంగా తగ్గి రాబడులు పెరిగే అవకాశాలుంటాయి. పైపెచ్చు అనేక సంవత్సరాలుగా ఇన్వెస్ట్‌ చేస్తూ ఉండటం వల్ల చక్రవడ్డీ తరహా కాంపౌండింగ్‌ మహిమ కూడా తోడై మరింత మెరుగైన రాబడులందుకునే ఆస్కారముంటుంది. చాలా మటుకు మిగతా ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీలు అధిక రాబడులు అందిస్తాయి. యుక్తవయస్సులోనే ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలుపెట్టడం వల్ల పెట్టుబడుల్లో ఒకటి రెండు తప్పిదాలేమైనా చేసినా.. సత్వరం సరిదిద్దుకునేందుకు కొంత అవకాశం ఉంటుంది. అదే రిటైర్మెంట్‌కి దగ్గరవుతుండగా.. ఏ చిన్న తప్పిదం చేసినా సరిదిద్దుకునేందుకు ఎక్కువ సమయం ఉండదు. 

టాప్‌ రేటెడ్‌ ఫండ్స్‌లోనే...
దీర్ఘకాలంలో సంపదను గణనీయంగా పెంచుకునే దిశగా టాప్‌ రేటెడ్‌ ఈక్విటీ ఫండ్స్‌లో మాత్రమే సిప్‌ చేయడం మంచిది. అత్యంత తక్కువగా రూ.1,000 నుంచి కూడా ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించి... జీతం పెరిగే కొద్దీ కేటాయింపులూ పెంచుకుంటూ వెళ్లండి. ఉదాహరణకు.. సగటున పదిహేను శాతం వార్షిక రాబడులు ఇచ్చే సిప్‌లో ప్రతి నెలా రూ. 1,000 పెట్టుబడితో మొదలుపెట్టారనుకుందాం. ఏటా ఈ మొత్తాన్ని రూ. 1,000 చొప్పున పెంచుకుంటూ పోతే.. ముప్ఫై ఏళ్ల తర్వాత ఏకంగా రూ. 4.8 కోట్ల సంపద పోగవుతుంది. కాబట్టి స్మార్ట్‌గా ఇన్వెస్ట్‌ చేస్తే.. లక్ష్యం ఎలాంటిదైనా సులువుగా సాధించవచ్చు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement