ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల గరిష్టానికి ఎగబాకడంతో వడ్డీరేట్ల పెంపు భయాలు మరోసారి మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో తీవ్ర పతన స్థాయికి చేరుకోవడం సైతం నిరాశపరిచింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ అనూహ్య రికవరీ, రూపాయి బలహీనతలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. అలాగే ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీని నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి(గురువారం)కి ముందు అప్రమత్తత వహించారు.
ధరల కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల మరో దఫా వడ్డీరేట్ల పెంపు అంచనాలు దేశీయ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా ఫైనాన్స్, ఆటో, రియల్టీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 391 పాయింట్లు పతనమై 57,235 వద్ద ముగిసింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 17,014 వద్ద నిలిచింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు అరశాతానికి పైగా క్షీణించాయి.
మెటల్, ఫార్మా, మీడియా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,636 కోట్ల షేర్లను అమ్మేయగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.753 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు గరిష్టంగా 3% వరకు క్షీణించాయి. యూఎస్ ద్రవ్యోల్బణ వెల్లడి తర్వాత అమెరికా స్టాక్ ఫ్యూచర్లు రెండుశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ అరశాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీలకు 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.269.88 లక్షల కోట్ల దిగువకు చేరింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► సెప్టెంబర్ త్రైమాసికంలో నికరలాభం క్షీణించడంతో ఐటీ కంపెనీ విప్రో షేరు 7% నష్టపోయి రూ 379 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఏడుశాతానికి పైగా పతనమై రూ.381 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది.
► ఇదే క్యూ2 క్వార్టర్‌లో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించిన హెచ్‌సీఎల్ షేరు మూడు శాతం బలపడి రూ.982 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.986 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment