ఎకానమీ.. శుభ సంకేతాలు! | Industrial Production Grows 12. 3percent In June | Sakshi
Sakshi News home page

ఎకానమీ.. శుభ సంకేతాలు!

Published Sat, Aug 13 2022 6:32 AM | Last Updated on Sat, Aug 13 2022 10:27 AM

Industrial Production Grows 12. 3percent In June - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ, దేశీయ సవాళ్ల నేపథ్యంలోనూ భారత్‌ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. పలు రంగాలకు సంబంధించి శుక్రవారం వెలువడిన అధికారిక రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతుల గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.  

తగ్గిన ఆహార ధరలు
ఆర్‌బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం  చర్యల నేపథ్యంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. మేలో  7.04 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.01 శాతానికి దిగివచ్చింది. ఈ స్పీడ్‌ తాజా సమీక్షా నెల్లో మరింత దిగిరావడం హర్షణీయం. నిజానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి.

అధికారిక గణాంకాల ప్రకారం, జూన్‌లో 7.75 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జూలైలో 6.75 శాతానికి దిగివచ్చింది.  జూన్‌లో కూరగాయల ధరల స్పీడ్‌ 17.37 శాతం ఉంటే, తాజా సమీక్షా నెల్లో 10.90 శాతానికి దిగివచ్చాయి. ఇక ఆయిల్‌ అండ్స్‌ ఫ్యాట్స్‌ ధరల స్పీడ్‌ ఇదే కాలంలో 9.36 శాతం నుంచి 7.52 శాతానికి తగ్గింది.  గుడ్ల ధరలు 3.84 శాతం తగ్గాయి. పండ్ల ధరలు మాత్రం 3.10 శాతం నుంచి 6.41 శాతానికి ఎగశాయి.  ఇంధనం, విద్యుత్‌ ధరలు తీవ్రంగానే (11.67 శాతం) కొనసాగుతున్నాయి.  

తయారీ, మైనింగ్‌ సానుకూలం
జూన్‌లో వరుసగా రెండవనెల పారిశ్రామిక ఉత్పత్తి సూచీ రెండంకెలపైన వృద్ధిని సాధించింది. తయారీ (12.5 శాతం), విద్యుత్‌ 16.5 శాతం), మైనింగ్‌ (7.5 శాతం) రంగాల దన్నుతో పారిశ్రామిక ఉత్పత్తి జూన్‌లో 12.3 శాతంగా నమోదయ్యింది.  అయితే మే నెలతో పోల్చితే (19.6 శాతం) సూచీ స్పీడ్‌ తగ్గింది. పెట్టుబడులు, డిమాండ్‌కు సూచికయిన క్యాపిటల్‌ గూడ్స్‌ ఉత్పత్తి విభాగం 26.1 శాతం పురోగతి సాధించింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్ల వంటి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో 23.8 శాతం వృద్ధి నమోదుకాగా, ఎఫ్‌ఎంసీజీ రంగానికి సంబంధించి కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ రంగం 2.9 శాతం పురోగమించింది.  ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 12.7 శాతంగా నమోదయ్యింది.  

వృద్ధి బాటనే ఎగుమతులు...
ఎగుమతులు జూలైలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్‌ డాలర్లుగా నమోదయినట్లు ఆగస్టు మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే తాజా లెక్కల ప్రకారం, సవరిత గణాంకాలు వెల్లడించాయి. ఇక దిగుమతులు 43.61 శాతం పెరిగి 66.72 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు మూడు రెట్లు పెరిగి 30 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (జూలై వరకూ) భారత్‌ ఎగుమతులు 20 శాతం పెరిగి 157.44 బిలియన్‌ డాలర్లుగా నమోదయితే, దిగుమతులు 48 శాతం పెరిగి 256.43 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు దాదాపు 99 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement