
పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశపరచడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. చైనాలో కోవిడ్–19(కరోనా) వైరస్ సంబంధిత కొత్త కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. ముడి చమురు ధరలు 2 శాతం మేర తగ్గినప్పటికీ, మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 106 పాయింట్లు పతనమై 41,460 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 12,175 వద్ద ముగిశాయి.
దెబ్బతిన్న సెంటిమెంట్....
గత ఏడాది డిసెంబర్‌లో పారశ్రామికోత్పత్తి 0.3 శాతం తగ్గింది. ఇక జనవరిలో రిటైల్ ద్రవ్యల్బోణం ఐదున్నరేళ్ల గరిష్ట స్థాయి, 7.59 శాతానికి ఎగసింది. కోవిడ్–19(కరోనా) వైరస్ కష్టాల కారణంగా చైనాలో కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని, ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉండగలదని, దీంతో అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్ తగ్గగలదని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) హెచ్చరించడం.. ఈ అంశాలన్నీ కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
371 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్....
సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైనా, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఆరంభంలోనే 143 పాయింట్లు పెరిగినా, ఆ తర్వాత 228 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 371 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
► ద్రవ్యోల్బణం పెరగడంతో రేట్ల కోత ఆశలు ఆవిరి కావడంతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు
నష్టపోయాయి.
► ఇండస్‌ఇండ్ బ్యాంక్ 3.8 శాతం నష్టంతో రూ.1,230 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
► స్టాక్ మార్కెట్ నష్టపోయినప్పటికీ, పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. హెచ్‌యూఎల్, అవెన్యూ సూపర్‌మార్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇప్కా ల్యాబ్స్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, ట్రెంట్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment