Industry Establishment
-
ఆంధ్రప్రదేశ్‌లో సమృద్ధిగా వనరులు
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నాయని పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు అధికారులు విదేశీ ప్రతినిధులకు వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం మ.3 గంటలు తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఇందులో పరిశ్రమలు, మారిటైం బోర్డు అధికారులు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ఇక్కడ వర్క్‌ఫోర్స్, ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్రోత్సాహకాలను వారికి విశదీకరించారు. ముఖ్యంగా దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు పోర్టులను సైతం నిర్మిస్తోందని వివరించారు. అలాగే, నెదర్లాండ్స్‌లో పోర్టుల నిర్మాణాలు, వాటి నిర్వహణకు గల అవకాశాలను ఆ దేశ ప్రతినిధులు ఇక్కడి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో పాటు అదాని, ఇతర ప్రైవేటు సంస్థ ప్రతినిధులకు వివరించారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి వ్యాపార అవకాశాలపై నిర్ణయం తీసుకుంటామని నెదర్లాండ్స్ ప్రతినిధులు తెలిపారు. -
గణాంకాలతో నష్టాలు
పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశపరచడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. చైనాలో కోవిడ్–19(కరోనా) వైరస్ సంబంధిత కొత్త కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. ముడి చమురు ధరలు 2 శాతం మేర తగ్గినప్పటికీ, మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. బీఎస్ఈ సెన్సెక్స్ 106 పాయింట్లు పతనమై 41,460 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 12,175 వద్ద ముగిశాయి. దెబ్బతిన్న సెంటిమెంట్.... గత ఏడాది డిసెంబర్లో పారశ్రామికోత్పత్తి 0.3 శాతం తగ్గింది. ఇక జనవరిలో రిటైల్ ద్రవ్యల్బోణం ఐదున్నరేళ్ల గరిష్ట స్థాయి, 7.59 శాతానికి ఎగసింది. కోవిడ్–19(కరోనా) వైరస్ కష్టాల కారణంగా చైనాలో కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని, ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉండగలదని, దీంతో అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్ తగ్గగలదని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) హెచ్చరించడం.. ఈ అంశాలన్నీ కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 371 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైనా, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఆరంభంలోనే 143 పాయింట్లు పెరిగినా, ఆ తర్వాత 228 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 371 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ► ద్రవ్యోల్బణం పెరగడంతో రేట్ల కోత ఆశలు ఆవిరి కావడంతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ 3.8 శాతం నష్టంతో రూ.1,230 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినప్పటికీ, పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. హెచ్‌యూఎల్, అవెన్యూ సూపర్‌మార్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇప్కా ల్యాబ్స్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, ట్రెంట్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
సీఎంతో జపాన్ కాన్సుల్ జనరల్ భేటీ
సాక్షి, అమరావతి: చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరొ ఉచియామ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్లో ఇరువురు సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జపాన్‌లో పర్యటించాలంటూ సీఎంను ఉచియామ ఆహ్వానించారు. అవినీతిలేని, పారదర్శక పాలన కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరువురి భాగస్వామ్యాలు ఉండాలని ఆకాంక్షించారు. కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ చట్టం ద్వారా పెట్టుబడుల ఆలోచన నుంచి ఉత్పత్తి దశ వరకూ కూడా పూర్తిస్థాయిలో సహాయకారిగా ఉంటామని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలు వృద్ధి చెందాలంటే శాంతియుత వాతావరణం కూడా అవసరమని, ఇందులో భాగంగానే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్లు తెచ్చామని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి ఉన్న మానవ వనరుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ వివరించారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని, ఆ దిశగా పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయాలని సీఎం కోరారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తయారీ పరిశ్రమల కోసం భూములు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, అగ్రిల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టబడులకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, మత్స్యరంగాల్లో అవకాశాలపై జపాన్ వ్యవసాయశాఖ మిజుహో ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇప్పటికే విశ్లేషణ చేయిస్తోందని ఉచియామ పేర్కొన్నారు. నూతన ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పెట్టుబడులు సీఎస్‌తో సమావేశమైన కాన్సుల్ జనరల్ కొజిరో ఉచియామ ఏపీ ప్రభుత్వం తగిన భూమిని సమకూర్చితే డెడికేటెడ్ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అభివృద్ధి చెందిన ఓడరేవులకు తగిన మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో తోడ్పడేందుకు జపాన్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ కాన్సుల్ జనరల్ కొజిరో ఉచియామ పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో ఆయన భేటీ అయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ వ్యాపారం అంశంలో ఆంధ్రప్రదేశ్‌ను జపాన్ కంపెనీలు అత్యంత ప్రాధాన్యతా డెస్టినేషన్ పాయింట్‌గా భావిస్తున్నట్టు ఉచియామ తెలిపారు. రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజి, వేర్ హౌసింగ్, సోర్సింగ్ కేంద్రాలు, అగ్రి ల్యాబ్స్, తదితర మౌలిక సదుపాయాలకు తోడ్పాటును అందించేందుకు జపాన్ పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నట్టు వివరించారు. ఆర్థిక, విద్యా, సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులతో ఎక్సేంజ్ ప్రోగ్రామ్స్‌కు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే జపాన్ కంపెనీలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. -
అయిననూ.. తాంబూలాలిచ్చేయండి!
పరిశ్రమల స్థాపనకు పంచాయతీలతో పనేంటి? ⇒ ఇండస్ట్రీ అనుమతులపై ప్రభుత్వం ఆదేశాలు.. జీవో 44 జారీ సాక్షి, హైదరాబాద్: ‘తాంబూలాలిచ్చేశాను. ఇహ.. తన్నుకు చావండి!’-అన్న కన్యాశుల్కం లోని అగ్నిహోత్రావధాన్ల మొండి వైఖరిని పుణికిపుచ్చుకున్నట్టుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఆయన చూపుతున్న చొరవ.. పంచాయతీల అధికారాలపై వేటువేస్తోంది. పరిశ్రమలకు అనుమతివ్వడమే తన బాధ్యతగా, తర్వాతేం జరిగినా తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. సాధారణంగా ఏ గ్రామంలోనైనా కొత్తగా పరిశ్రమ ఏర్పాటుకావాలంటే సదరు గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలి. అయితే, ప్రస్తుతం పంచాయతీ తీర్మానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి జీవో 44ను జారీ చేసేసింది. ప్రభుత్వ వైఖరిపై స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ కారణంగా జిల్లా అధికారులు అనుమతులు మంజూరు విషయంలో వెనుకంజ వేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. ఇదిలావుంటే, సింగిల్ డెస్క్ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి అనుమతులివ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, దీనికి పురోగతి కనిపించలేదని ఇటీవల రాష్ట్ర స్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి గుర్తించింది. పరిశ్రమల శాఖ కమిషనర్ కూడా జిల్లా అధికారులతో చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇవ్వకపోవడంపై ఆరా తీశారు. స్థానికులకు ఇబ్బంది కలిగించే పరిశ్రమలను గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే విషయం వారి దృష్టికొచ్చింది. గ్రామ పంచాయతీల సానుకూల తీర్మానం లేకుండా పరిశ్రమలు స్థాపించడం వల్ల చిక్కులు తప్పవని అధికారులు భావిస్తున్నారు. అయినా దరఖాస్తు చేసుకున్న ఔత్సాహికులకు పంచాయతీల అనుమతితో సంబంధం లేకుండా అనుమ తులివ్వడంపై అధికారులు దృష్టి పెట్టారు. కాగా, రాష్ట్రం మొత్తం మీద 2,847 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు, మరో 250 మధ్య తరహా పరిశ్రమలకు దరఖాస్తులు వచ్చాయి. ‘స్థానిక’ హక్కులపై ఉక్కుపాదం - తమ అభిమతానికి విరుద్ధంగా పరిశ్రమల అనుమతికిగాను కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇవ్వడాన్ని స్థానిక సంస్థల ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. ఇది స్థానిక సంస్థల హక్కులను దెబ్బతీయడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటపొలాలను కోల్పోవాల్సి వస్తుందని పలువురు సర్పంచ్‌లు అంటున్నారు. పరిశ్రమల వల్ల కాలుష్యంతో గ్రామాలను విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమలకు దరఖాస్తులు అందాయి. వీటిని అనుమతించడం వల్ల వాటి నుంచి వెలువడే వ్యర్థాలు స్థానిక నీటిని, వాతావరణాన్నీ కలుషితం చేస్తాయని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల్లో లోహ, రసాయన, పెట్రో రసాయనాల పరిశ్రమలకు అనుమతులిస్తే ప్రజారోగ్యంపై, పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.