ముంబై: ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల తీరుతెన్నులు ఈ వారం సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల పురోగతికి సంబంధించిన వార్తలను పరిగణలోకి తీసుకోవచ్చంటున్నారు. ఇదేవారంలో ఫెడ్‌తో సహా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌లు తమ ద్రవ్య విధానాలపై చేసే ప్రకటనలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు.
వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వెల్లడించే ద్రవ్య విధాన వైఖరి అనుగుణంగా ఈక్విటీ మార్కెట్లు కదలాడొచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువన 18,680 – 18,780 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు కొనసాగితే దిగువ స్థాయిలో 18,500 – 18,450 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు.
ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అవుట్‌లుక్‌ను(5.2% నుంచి 5.1 శాతానికి)ను ఆశించిన స్థాయిలో తగ్గించకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. ఫలితంగా మార్కెట్ గతవారం చివరి రెండు ట్రేడింగ్ సెషన్లో అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అయినప్పటికీ.., వారం మొత్తంగా సెన్సెక్స్ 79 పాయింట్లు, నిఫ్టీ 29 పాయింట్లు చొప్పున బలపడ్డాయి.
ఎఫ్‌ఐఐలు.., డీఐఐలు కొనుగోళ్లే..
గడచిన వారంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు).., సంస్థాగత ఇన్వెస్టర్లు ఇరువురూ కొనుగోళ్లు చేపట్టారు. జూన్ 5–9 తేదీల మధ్య ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.979 కోట్లు, డీఐఐలు రూ. 1938 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఎఫ్‌ఐఐలకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించే విధంగా సెబీ ఇటీవల నిబంధనలను కఠినతరం చేసింది. సులభతర వ్యాపార నిర్వహణ విషయంలో భారత్ ధృడవైఖరిపై ఇది మరోసారి చర్చకు దారీ తీసింది’’ బీడీఓ ఇండియా ఫైనాన్సియల్ సర్వీసెస్ టాక్స్ చైర్మన్ మనోజ్ పురోహిత్ తెలిపారు.
దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు
ఈ ఏడాది మే రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. ఏప్రిల్ నమోదైన 4.79% కంటే తక్కువగానే మేలో 4.34శాతంగా నమోదవచ్చొని ఆర్థిక అంచనా వేస్తున్నారు. మరుసటి రోజు(జూన్ 13) డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జూన్ రెండోవారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూన్‌రెండో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది.
ఎఫ్‌ఓఎంసీ నిర్ణయాలపై దృష్టి
అమెరికా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశం మంగళవారం(జూన్ 13న) మొదలై బుధవారం ముగిస్తుంది. ఈసారి కీలక వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల వైపు నుంచి చూస్తే ఎఫ్‌ఓఎంసీ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకమైనవి. పాలసీ వెల్లడి సందర్భంగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసే వ్యాఖ్యలు ఈక్వి టీ మార్కెట్ల స్థితిగతులను మార్చగలవు.
ప్రపంచ పరిణామాలు...
అమెరికా మే సీపీఐ ద్రవ్యల్బణ డేటా మంగళవారం, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వెల్లడి బుధవారం వెల్లడి కానున్నాయి. గురువారం అమెరికా మే రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానున్నాయి. అదేరోజున యూరోపియన్ జోన్ ఏప్రిల్ వాణిజ్య లోటు డేటా యూరోపియన్ యూనియన్ బ్యాంక్ ద్రవ్య విధాన వైఖరి విడుదల అవుతుంది. చైనా మే పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు, నిరుద్యోగ రేటు డేటా వెల్లడి కానుంది. మరుసటి రోజు బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల డేటా, యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా కన్జూమర్ సెంటిమెంట్ గణాంకాలు విడుదల అవుతాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు.
Comments
Please login to add a commentAdd a comment