ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారమూ సానుకూలతలు కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్య విధానంపై ఆర్‌బీఐ వైఖరి.., స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్ ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదైంది. మే తయారీ రంగ పీఎంఐ మెప్పించింది.
తాజాగా అమెరికా ‘రుణ పరిమితి పెంపు’ చట్టంపై నెలకొన్న సందిగ్ధత సైతం తొలగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్న ఈ పరిణామాల ప్రభావం మరికొంత కాలం కొనసాగొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువ స్థాయిలో 18,650 – 18,800 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయి 18,450–18,500 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహన్ తెలిపారు. అమెరికా అప్పుల పరిమితి పెంపు బిల్లుకు ఎగువ సభ ఆమోదం తెలుపుతుందో లేదో అనే ఆందోళనల నడుమ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా గతవారం సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు చొప్పున స్వల్పంగా లాభపడ్డాయి.
మంగళవారం ఆర్‌బీఐ పాలసీ సమావేశం
ఆర్‌బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు గురువారం (జూన్ 8న) వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం దిగిరావడం, మార్చి జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదవడం తదితర పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపునకే మొగ్గుచూపొచ్చని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఊహించినట్లే ఆర్‌బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోతే సూచీలు మరింత బలంగా ర్యాలీ చేయోచ్చంటున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్‌బీఐ ఛైర్మన్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది.
స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం
ఇవాళ భారత మే నెల సేవారంగ తయారీ గణాంకాలు విడుదల కానున్నాయి. అలాగే అమెరికా, యూరోజోన్, చైనా, పీఎఎంఐ డేటా సైతం ఇవాళ వెల్లడి కానుంది. బుధవారం మే నెల చైనా బ్యాలె న్స్ ఆఫ్ ట్రేడ్, గురువారం అమెరికా ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్, జపాన్ క్యూ1 జీడీపీ వృద్ధి, శుక్రవారం చైనా మే ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. శుక్రవారం జూన్ తొలి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఏప్రిల్ 28న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు.
నైరుతి రుతుపవనాల వార్తలపై దృష్టి
స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు.
9 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు
విదేశీ ఇన్వెస్టర్లు ఈ మే నెలలో రూ.43,838 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇది తొమ్మిది గరిష్టమని మార్కెట్ నిపుణులు తెలిపారు. బలమైన ఆర్థిక గణాంకాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎఫ్‌పీఐలు 2022 ఆగస్టులో అత్యధికంగా రూ. 51,204 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత నెలతో పాటు ప్రస్తుత నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి సానుకూలంగానే ఉన్నారు. జూన్ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,490 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. ‘‘గతవారం విడుదలైన జీడీపీ వృద్ధి రేటు, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల మద్దతు ఉన్నందున ఈ నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి అదే స్థాయిలో కొనసాగుతుంది’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment