రిస్క్ లేకపోతే డెట్ బెటర్ | The decline in interest rates | Sakshi
Sakshi News home page

రిస్క్ లేకపోతే డెట్ బెటర్

Published Sun, Jun 15 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

రిస్క్ లేకపోతే డెట్ బెటర్

రిస్క్ లేకపోతే డెట్ బెటర్

రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టనున్నాయన్న స్పష్టమైన సంకేతాలు ఆర్‌బీఐ నుంచి వస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడానికి తోడు వృద్ధిరేటు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు తీసుకొంటుండటంతో వడ్డీరేట్లు ఇక తగ్గడమే కానీ పెరిగే అవకాశం లేదన్న విషయం స్పష్టమైంది. ఇటువంటి తరుణంలో మార్కెట్లో ఉన్న వివిధ డెట్ పథకాలు, వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
 
ఈక్విటీ మార్కెట్లు ఒకపక్క దూసుకుపోతూ... నూతన గరిష్ట స్థాయిలు చేరుతున్నా... ఇప్పటికీ చిన్న ఇన్వెస్టర్లు దూరంగానే ఉంటున్నారు. దీనికి కారణం స్టాక్ మార్కెట్ పెట్టుబడులనేవి తీవ్ర ఒడిదుడుకుల లక్షణాలు కలిగి ఉండటమే కాకుండా, గత అనుభవాలు ఇంకా మది నుంచి తొలగకపోవడమే. ఇలా రిస్క్ చేయలేని వారికి డెట్ పెట్టుబడులు అనువైనవి. వీటిల్లో కూడా రిస్క్ సామర్థ్యం ఆధారంగా పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్ల దగ్గర నుంచి ఆల్ట్రా షార్ట్‌టర్మ్ వరకు అనేక రకాల పెట్టుబడి సాధనాలున్నాయి.
 
బ్యాంకు డిపాజిట్లు
ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇవి అనువైనవి. ఇప్పటికే పలు స్వల్పకాలిక డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాయి. రానున్న కాలంలో వడ్డీరేట్లు ఇంకా బాగా తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు దీర్ఘకాలిక డిపాజిట్లపై 8-9 శాతం వడ్డీని అందిస్తున్నాయి. వడ్డీరేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉండటంతో ఇప్పుడు డిపాజిట్ చేసేవాళ్లు దీర్ఘకాలిక డిపాజిట్లను ఎంచుకోవడం ఉత్తమం.
 
ప్రభుత్వ బాండ్లు
వివిధ ప్రభుత్వ సంస్థలు వాటి అవసరాల కోసం దీర్ఘకాలిక బాండ్లను జారీ చేస్తుంటాయి. ఇవన్నీ రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. కనీస ఇన్వెస్ట్‌మెంట్ రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఉంటాయి. ఆర్‌బీఐ సేవింగ్స్ బాండ్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్, ఇన్‌ఫ్రా, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అన్నీ వీటి కోవలోకే వస్తాయి. అలాగే హడ్కో, సిడ్బి వంటి సంస్థలు ఎప్పుడూ డిపాజిట్లను స్వీకరిస్తూనే ఉంటాయి. సాధారణంగా వీటి వడ్డీరేట్లు బ్యాంకు డిపాజిట్ రేట్ల కంటే తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం పదేళ్ల కాలపరిమితి దాటిన వాటిపై వడ్డీరేటు 6%పైన ఉంది.
 
ప్రైవేటు బాండ్లు
వివిధ కంపెనీలు బాండ్లు, డిపాజిట్ల ద్వారా నిధులు సేకరిస్తుంటాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త కంపెనీల చట్టం కంపెనీల డిపాజిట్ల సేకరణపై ప్రభావం చూపనుంది. బ్యాంకుల వలే కంపెనీలు కూడా సేకరించే డిపాజిట్లకు బీమా రక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆ చట్టంలో నిర్దేశించింది. కంపెనీల డిపాజిట్లకు బీమా ఇచ్చే పథకాలు ఇపుడు అందుబాటులో లేకపోవడమే అసలు సమస్య. ఈ దిశగా బీమా కంపెనీలు కొత్త పథకాలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నాయి. ఇది పూర్తిస్థాయిలో అమలైతే ఇక కార్పొరేట్ డిపాజిట్లు, బాండ్లు కూడా అత్యంత ఆకర్షణీయంగా మారతాయనడంలో సందేహం లేదు. సాధారణంగా కార్పొరేట్ డిపాజిట్లపై వడ్డీరేట్లు బ్యాంకు డిపాజిట్ల కంటే కొద్దిగా అధికంగా ఉంటాయి.
 
గవర్నమెంట్ సెక్యూరిటీస్
కేంద్ర ప్రభుత్వం స్వల్ప, దీర్ఘకాలిక అవసరాల కోసం ఆర్‌బీఐ ద్వారా వివిధ రూపాల్లో నగదును సేకరిస్తుంది. ఇందులో ప్రధానమైనవి గవర్నమెంటు సెక్యూరిటీస్(జీ-సెక్), ట్రెజరీ బిల్లులు. దీర్ఘకాలిక అవసరాల కోసం విడుదల చేసే వాటిని సెక్యూరిటీస్ అనీ, రోజులు, నెలలు, సంవత్సరం లోపు కాలపరిమితి ఉండే స్వల్పకాలిక అవసరాల కోసం విడుదల చేసే వాటిని ట్రెజరీ బిల్లులనీ అంటారు. సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు  నేరుగా వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు. వీటిల్లో ఫైనాన్షియల్ సంస్థలైన పీపీఎఫ్, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థలు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలవు. రిటైల్ ఇన్వెస్టర్లు పరోక్షంగా ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ అందించే గిల్ట్ ఫండ్స్ అవకాశాన్ని కల్పిస్తాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం రూ.2 లక్షలుండాలి.
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
డెట్ ఫండ్స్..
పైన పేర్కొన్న చాలా డెట్ పథకాల్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు. కానీ వీటిల్లో పరోక్షంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రయోజనం పొందే అవకాశాన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో విభిన్న రకాల డెట్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి రాబడులనేవి వడ్డీరేట్ల కదలికలపై ఆధారపడి ఉంటాయి. వడ్డీరేట్లు పెరిగేటప్పుడు కొన్ని పథకాలు అధిక రాబడులను అందిస్తే మరికొన్ని వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు లాభాలను అందిస్తున్నాయి. వీటిని నేరుగా ఆయా మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్స్ లేదా స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే పన్ను ప్రయోజనాల పరంగా డెట్ ఫండ్స్ అనువైనవి. ఇప్పుడు వివిధ రకాల డెట్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అనుకూలమైనవేనా అనే అంశాలను తెలుసుకుందాం.
 
గిల్డ్ ఫండ్స్: ఇవి కేవలం గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అంత అనుకూలం కాదు. వీటిల్లో వడ్డీరేట్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు ఇవి అధిక లాభాలను అందిస్తాయి. ఒకసారి ట్రెండ్ మారి వడ్డీరేట్లు పెరుగుతుంటే వీటి నుంచి తక్షణం వైదొలిగే ప్రయత్నం చేయాలి.

ఇన్‌కమ్ ఫండ్స్:  వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు అధిక రాబడులను అందించే వాటిలో ఇన్‌కమ్ ఫండ్స్ ముఖ్యమైనవి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అన్నిరకాల డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ పథకాలకు ఉంది. డైనమిక్ బాండ్స్, ఫ్లెక్సీ డెట్ ఫండ్స్ ఈ కోవలోకే వస్తాయి.
 
షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్: ఒకటి నుంచి రెండు సంవత్సరాల కాలపరిమితి గల డెట్ ఫండ్స్‌ను షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. వడ్డీరేట్లు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా కనిపించే తరుణంలో ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
 
అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్: స్వల్ప కాలిక ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవి. ఎటువంటి లాకిన్ పీరియడ్ లేకపోవడం, బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడిని అందించే అవకాశం ఉండటంతో వీటికి డిమాండ్ అధికం. కానీ, వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు పైవాటితో పోలిస్తే వీటి రాబడి తక్కువ.  
 
లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్:  వడ్డీరేట్లు బాగా తగ్గే అవకాశాలున్నప్పుడు వీటి రాబడులు క్షీణిస్తాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి దూరంగా ఉండాలన్నది నిపుణుల సూచన.
 
ఫిక్స్‌డ్ మెచ్యూర్టీ ప్లాన్స్ (ఎఫ్‌ఎంపీ): వడ్డీరేట్లలో హెచ్చు తగ్గులున్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఫిక్స్‌డ్ మెచ్యూర్టీ ప్లాన్ (ఎఫ్‌ఎంపీ)లు అనువుగా ఉంటాయి. వడ్డీ రేట్ల కదలికల వల్ల వచ్చే రిస్క్ లేకుండా ఒక పరిమిత కాలానికి వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ముఖ్యంగా వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో ఒక సంవత్సరం కాలపరిమితి ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement