క్యూ2 ఫలితాలదే పైచేయి | Domestic stock markets were dominated by corporate results this week | Sakshi
Sakshi News home page

క్యూ2 ఫలితాలదే పైచేయి

Published Mon, Oct 21 2024 4:26 AM | Last Updated on Mon, Oct 21 2024 4:26 AM

Domestic stock markets were dominated by corporate results this week

జాబితాలో ఐటీసీ, హెచ్‌యూఎల్‌ 

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కీలకం 

గ్లోబల్‌ మార్కెట్ల ట్రెండ్‌కు ప్రాధాన్యం 

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ నడకపై విశ్లేషకుల అంచనాలు 

దేశీ స్టాక్‌ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్‌ ఫలితాలు నిర్దేశించనున్నాయి. గత వారాంతాన పలు దిగ్గజాలు జులై–సెపె్టంబర్‌(క్యూ2) ఫలితాలు వెల్లడించాయి. బ్యాంకింగ్‌ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహీంద్రాసహా ఆర్‌బీఎల్‌ బ్యాంక్, యుకో బ్యాంక్, ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం పనితీరు ప్రకటించాయి. దీంతో సోమవారం ప్రధానంగా ఈ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఈ వారం మరిన్ని రంగాలకు చెందిన బ్లూచిప్‌ కంపెనీలు క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. 

జాబితాలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు ఐటీసీ, హచ్‌యూఎల్, రిఫైనరీ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్,  సిమెంట్‌ దిగ్గజం అల్ట్రాటెక్‌ తదితరాలున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. ఇదేవిధంగా ఫైనాన్స్‌ దిగ్గజాలు బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఇటీవలే స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌తోపాటు.. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, వన్‌97 కమ్యూనికేషన్స్‌(పేటీఎమ్‌), జొమాటో, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) సైతం ఫలితాలు ప్రకటించనున్నాయి.  

చమురు ధరలు సైతం 
ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య ముదిరిన వివాదాలతో ఇటీవల ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. వారాంతాన బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 75 డాలర్లకు చేరింది. దీనికిజతగా అన్నట్లు విదేశీ మార్కెట్లో పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 2,730 డాలర్ల ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని దాటింది. చమురు, పసిడి ధరల పెరుగుదల వాణిజ్యలోటును పెంచే వీలుంది. దీనికితోడు ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది.

 చరిత్రత్మాక కనిష్టం 84కు బలహీనపడి కదులుతోంది. ఇవి ప్రతికూల అంశాలుగా మార్కెట్‌ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇరాన్‌– ఇజ్రాయెల్‌ యుద్ధ భయాలు, చమురు ధరల సెగ మార్కెట్లలో ఆటుపోట్లకు కారణమయ్యే అవకాశమున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ ప్రవేష్‌ గౌర్‌ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కార్పొరేట్‌ ఫలితాలను నిశితంగా గమనిస్తారని మిశ్రా చెబుతున్నారు.  

గత వారమిలా
 పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప వెనకడుగు వేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నికరంగా 157 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 81,225 వద్ద ముగిసింది. నిఫ్టీ కొంత అధికంగా 110 పాయింట్లు(0.4 శాతం) నీరసించి 24,854 వద్ద నిలిచింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.2 శాతమే నష్టపోగా.. స్మాల్‌ క్యాప్‌ 1 శాతంపైగా క్షీణించింది. 

ఎఫ్‌పీఐ అమ్మకాలు 
భౌగోళిక, రాజకీయ అనిశి్చతులు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా సెంటిమెంటు బలహీనపడినట్లు మెహతా ఈక్విటీస్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌(రీసెర్చ్‌) ప్రశాంత్‌ తాప్సే పేర్కొన్నారు. మరోపక్క దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నట్లు వివరించారు. 

ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 74,700 కోట్ల విలువైన అమ్మకాలు చేట్టారు. అయితే ఇందుకు ధీటుగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐలు) కొనుగోళ్లు చేపడుతుండటం గమనార్హం! ఈ ట్రెండ్‌ సమీపకాలంలో కొనసాగవచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు.

 చైనా స్టాక్స్‌ చౌకగా లభిస్తుండటం, దేశీ మార్కెట్లు అధిక విలువలకు చేరుకోవడం ఎఫ్‌పీఐలపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేíÙంచారు. కాగా.. క్యూ2లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 6 శాతం వృద్ధితో రూ. 17,286 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కొటక్‌ బ్యాంక్‌ 13 శాతం అధికంగా రూ. 5,044 కోట్ల నికర లాభం ఆర్జించింది. టెక్‌ మహీంద్రా 60.3 కోట్ల డాలర్ల(రూ. కోట్లు) విలువైన కొత్త డీల్స్‌ కుదుర్చుకుంది. ఈ వివరాలు శనివారం(19న) వెల్లడయ్యాయి. వీటి ప్రభావం నేడు(21న) ఆయా స్టాక్స్‌పై కనిపించనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు.

క్యూ2 ఫలితాలదే పైచేయి
ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సొల్యూషన్స్‌ అందించే బ్లూ క్లౌడ్‌ సాఫ్టెక్‌ సంస్థ తమ షేర్లను 2:1 నిష్పత్తిలో విభజించనుంది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు వివరించింది. దీని ప్రకారం రూ. 2 ముఖ విలువ ఉండే ఒక్కో షేరును రూ. 1 ముఖ విలువ ఉండే షేరుగా విభజిస్తారు. కంపెనీ ఇటీవలే బ్లూహెల్త్‌ అప్లికేషన్, బ్లూరా, ఎడ్యుజీనీ, బయోస్టర్‌ పేరిట నాలుగు ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఉత్పత్తులను ఆవిష్కరించింది.

నవంబర్‌ 1న ముహూరత్‌ ట్రేడింగ్‌
దీపావళి సందర్భంగా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ రెడీ 
స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ దీపావళి పండుగ సందర్భంగా యథావిధిగా ముహూరత్‌(మూరత్‌) ట్రేడింగ్‌ను చేపట్టనున్నాయి. ఇందుకు నవంబర్‌ 1న(శుక్రవారం) సాయంత్రం 6 నుంచి 7వరకూ గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. తద్వారా స్టాక్‌ మార్కెట్‌కు కొత్త ఏడాది సంవత్‌ 2081 ప్రారంభంకానున్నట్లు ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలియజేశాయి.

 హిందువుల క్యాలండర్‌ ప్రకారం దీపావళికి ప్రారంభమయ్యే కొత్త ఏడాది తొలి రోజు చేపట్టే ముహూరత్‌ ట్రేడింగ్‌ ఆర్థికంగా శుభాన్ని, లాభాన్ని కలగజేస్తుందని స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు భావిస్తుంటాయి. కాగా.. దీపావళి రోజు మార్కెట్లలో సాధారణ ట్రేడింగ్‌ ఉండదు. దీనిస్థానే సాయంత్రం గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. 5.45కల్లా ప్రీఓపెనింగ్‌ సెషన్‌ ప్రారంభమవుతుంది. ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో, కమోడిటీ, కరెన్సీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌కు వీలుంటుంది.

పీఎస్‌యూలలో ట్రేడింగ్‌కు నో 
ప్రభుత్వ అధికారులకు దీపమ్‌ ఆదేశాలు
ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల షేర్లలో ట్రేడింగ్‌ చేపట్టవద్దంటూ ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్‌ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఆయా కంపెనీలకు సంబంధించిన మార్కెట్లపై ప్రభావం చూపగల రహస్య సమాచారం అందుబాటులో ఉంటుందన్న యోచనతో దీపమ్‌ తాజా నిర్ణయం తీసుకుంది. 

ఆయా శాఖలలో చేరేందుకు ఎంపికయ్యే వ్యక్తులు పీఎస్‌యూలలో షేర్లను కలిగి ఉంటే ముందుగానే వెల్లడించవలసిందిగా తెలియజేసింది. అధికారిక అనుమతులు పొందాక మాత్రమే వీటిని విక్రయించేందుకు వీలుంటుందని వివరించింది. పీఎస్‌యూలలో ప్రభుత్వ ఈక్విటీని దీపమ్‌ మేనేజ్‌ చేస్తుంటుంది. అంతేకాకుండా పీఎస్‌యూలలో ప్రభుత్వానికి చెందిన మైనారిటీ వాటా లేదా వ్యూహాత్మక వాటాల విక్రయం, ఎంపిక చేసిన కంపెనీల ప్రయివేటైజేషన్‌ తదితరాలను చేపట్టే  సంగతి తెలిసిందే. 

వెరసి షేర్ల ధరలను ప్రభావితం చేయగల సమాచారం అందుబాటులో ఉంటుందన్న కారణంతో  పీఎస్‌యూలలో ట్రేడింగ్‌ చేపట్టవద్దంటూ ప్రభుత్వ అధికారులకు అంతర్గత ఆదేశాల ద్వారా దీపమ్‌ స్పష్టం చేసింది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం  గతేడాది(2023–24) రూ. 16,507 కోట్ల విలువైన సీపీఎస్‌ఈ షేర్లను విక్రయించిన విషయం విదితమే. అంతక్రితం ఏడాది(2022–23)లోనూ రూ. 35,294 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) జీఐసీ, కొచిన్‌ షిప్‌యార్డ్‌లలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 5,160 కోట్లు అందుకుంది.

చిన్నషేర్ల ఫండ్స్‌కు భారీ పెట్టుబడులు 
6 నెలల్లో రూ. 30,352 కోట్లు 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి ఆరు నెలల్లో మధ్య, చిన్నతరహా షేర్ల ఫండ్స్‌కు మరోసారి పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. వెరసి ఏప్రిల్‌–సెపె్టంబర్‌ మధ్య మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌కు రూ. 30,352 కోట్లు ప్రవహించాయి. మ్యూచువల్‌ ఫండ్‌ అసోసియేషన్‌(యాంఫీ) వివరాల ప్రకారం మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ. 14,756 కోట్లు, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ. 15,586 కోట్లు చొప్పున పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. 

ఇందుకు మధ్య, చిన్నతరహా షేర్ల విభాగాలు ఆకట్టుకునే స్థాయిలో రిటర్నులు సాధించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) తొలి ఆరు నెలల్లోనూ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌కు రూ. 32,924 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఓవైపు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది పెట్టుబడులు కొనసాగడం గమనార్హం!  

అధిక రిటర్నులు 
మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ అత్యధిక లాభాలు అందించగలవన్న ఇన్వెస్టర్ల విశ్వాసమే ఇందుకు కారణమని ట్రస్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) సీఈవో సందీప్‌ బాగ్లా, ట్రేడ్‌జినీ సీవోవో ట్రివేష్‌ పేర్కొన్నారు. ఇకపైన కూడా చిన్న షేర్లు వేగవంతంగా వృద్ధి చెందనున్నట్లు అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధిగల రంగాలలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు.
 

 వెరసి స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియో కేటాయింపుల్లో భాగమైపోయినట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 20 శాతం, స్మాల్‌ క్యాప్‌ 24 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా నిఫ్టీ, లార్జ్‌క్యాప్‌ ఇండెక్సులను అధిగమించాయి. 2024 మార్చిలో స్ట్రెస్‌ టెస్ట్‌ సైతం ఇందుకు కీలకపాత్ర పోషించినట్లు ఆనంద్‌ రాఠీ వెల్త్‌ డిప్యూటీ సీఈవో ఫిరోజ్‌ అజీజ్‌ తెలియజేశారు. దీంతో ఫండ్‌ మేనేజర్లు మార్కెట్‌ ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడినట్లు వివరించారు.

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement