అదుపులోకిరాని రిటైల్‌ ధరలు | Retail inflation reaches 7.61per cent in October due to rise in food prices | Sakshi
Sakshi News home page

అదుపులోకిరాని రిటైల్‌ ధరలు

Published Fri, Nov 13 2020 5:42 AM | Last Updated on Fri, Nov 13 2020 5:42 AM

Retail inflation reaches 7.61per cent in October due to rise in food prices - Sakshi

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడంలేదు. 2020 అక్టోబర్‌లో 7.61 శాతంగా నమోదయ్యింది. అంటే సూచీలోని ఉత్పత్తుల బాస్కెట్‌ ధర 2019 అక్టోబర్‌తో పోల్చితే 2020 అక్టోబర్‌లో 7.61 శాతం పెరిగిందన్నమాట. ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల మొత్తం సూచీపై ప్రభావం చూపిస్తోంది. సెప్టెంబర్‌లో సూచీ 7.27 శాతంగా ఉంది. సూచీలోని ప్రధాన విభాగాల్లో ఒకటైన ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 10.68 శాతం ఉంటే, అక్టోబర్‌లో 11.07 శాతంగా నమోదయ్యింది. కూరగాయల ధరలు వార్షికంగా చూస్తే, అక్టోబర్‌లో 22.51 శాతం పెరిగాయి.  

వడ్డీరేట్ల తగ్గింపు కష్టమే!
రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై  వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4శాతం) మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.  ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో 4 శాతంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం ఆర్‌బీఐకి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది.  ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ, రిటల్‌ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్ట్, అక్టోబర్‌ నెలల్లో జరిగిన  ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది.  

తగ్గుతుందన్న విశ్వాసం...
అయితే సెప్టెంబర్‌ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో  లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ అంచనావేస్తోంది.  వ్యవసాయ రంగం పరిస్థితి  ఆశాజనకంగా ఉండడం, ముడి చమురు ధరలు ఒక నిర్దిష్ట శ్రేణితో తిరుగుతుండడం, లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో సరఫరాల వ్యవస్థ మెరుగుపడుతుండడం ఆర్‌బీఐ అంచనాలకు ప్రధాన కారణాలు. వెరసి డిసెంబర్‌ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది.

క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్‌బీఐ తన పాలసీ సమీక్షలో భావించింది.  ఈ అంచనాల నేపథ్యంలో వృద్ధికి దోహదపడే సరళతర ద్రవ్య విధానంవైపే ఆర్‌బీఐ మొగ్గుచూపుతోంది. మరోవైపు ఇప్పటికే ఏడాది ఆపైన కాలపరిమితుల స్థిర డిపాజిట్‌ రేటు 4.90 నుంచి 5.50 శాతం శ్రేణిలో ఉన్నాయని,  ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది నెగటివ్‌ రిటర్న్స్‌ అనీ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement