ముంబై: దేశీయ స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 774 పాయింట్లు పతనమై 60,205 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 226 పాయింట్లు క్షీణించి 18వేల దిగువున 17,892 వద్ద నిలిచింది. ఉదయం ప్రతికూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 898 పాయింట్లు క్షీణించి 60,081 వద్ద, నిఫ్టీ 272 పాయింట్లు నష్టపోయి 17,846 వద్ద ఇంట్రాడే కనిష్టాను నమోదు చేశాయి.
సెన్సెక్స్ సూచీలో ఏడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.50%, ఒకశాతం నష్టపోయాయి. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు. డాలర్ మారకంలో రూపాయి విలువ 2 పైసలు క్షీణించి 81.65 స్థాయి వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2394 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1378 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. సెన్సెక్స్ ఒకశాతానికి పైగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.3.66 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
నష్టాలు ఎందుకంటే
దేశీయ ప్రధాన ప్రైవేట్ గ్రూప్ అదానీ కంపెనీ షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. రిపబ్లిక్ డే సెలవు నేపథ్యంలో వీక్లీ, వారాంతాపు ఎక్స్‌పైరీ బుధవారమే జరిగింది. దేశీయ అతిపెద్ద ఎఫ్‌పీఓ(ఆదానీ ఎంటర్‌ప్రైజస్) ప్రారంభం, టీ1 సెటిల్‌మెంట్ అమల్లోకి రానుండటం, వచ్చేవారం(బుధవారం) కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పరిణామాల నేపథ్యంలో లిక్విడిటీ కోసం ట్రేడర్లు తమ పొజిషన్లను విక్రయించాయి. ఎఫ్‌ఐఐలు భారత ఈక్విటీల నుంచి ఈ నెలలో ఇప్పటివరకు రూ. 17 వేల కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, బడ్జెట్ అంచనాలు, ముడి చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
►నష్టాల మార్కెట్లోనూ టీవీఎస్ కంపెనీ షేరు దూసుకెళ్లింది. డిసెంబర్ త్రైమాసికంలో మెరుగైన ప్రదర్శన కనబరచడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో 5.50 శాతం పెరిగి రూ. 1,038 వద్ద స్థిరపడింది.
►క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలను సాధించినప్పటికీ., ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేరు విక్రయాల ఒత్తిడికి లోనైంది. నాలుగు శాతం నష్టంతో రూ.715 వద్ద ముగిసింది.
►ఇండస్ టవర్స్ షేరు రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. మూడో క్వార్టర్ ఫలితాలు నిరాశపరచడం షేరుకు ప్రతికూలంగా మారింది. బీఎస్‌ఈలో 7.19% నష్టపోయి రూ. 158.20 వద్ద ముగిసింది.
చదవండి: Credit Card Tips: క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఇవి పాటించకపోతే మీ జేబుకు చిల్లు ఖాయం!
Comments
Please login to add a commentAdd a comment