ఎన్నికలు, క్యూ4 ఫలితాలే కీలకం..! | Elections, earnings to dictate market trend this week | Sakshi
Sakshi News home page

ఎన్నికలు, క్యూ4 ఫలితాలే కీలకం..!

Published Mon, Apr 8 2019 5:46 AM | Last Updated on Mon, Apr 8 2019 5:46 AM

Elections, earnings to dictate market trend this week - Sakshi

ముంబై: దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల వేడి పెరుగుతోంది. లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ జరగనుండగా.. ఈవారంలోనే తొలి దశ ప్రారంభంకానుంది. గురువారం (ఏప్రిల్‌ 11న) జరిగే ఈ పోలింగ్‌.. సామాన్య పౌరులతో పాటు ఇటు మార్కెట్‌ వర్గాల్లోనూ వేడి పెంచుతోంది. ఎన్నికల నేపథ్యంలో వెలువడే ప్రీ–పోల్‌ సర్వేలు, తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నారనే ప్రధాన అంశాలు మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ‘సాధారణ ఎన్నికల అంశమే ప్రధానంగా ఈవారంలో మార్కెట్‌ను నడిపించనుంది.

వచ్చే ఐదేళ్లలో ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉండనున్నాయనే కీలక అంశానికి ఈ ఎన్నికలే స్పష్టత ఇవ్వనున్నాయి. కచ్చితంగా ఇన్వెస్టర్ల దృష్టి పోల్స్‌పైనే ఉండనుంది’ అని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సునీల్‌ శర్మ అన్నారు. ఎన్నికల వేడిలో ఫ్రెంట్‌లైన్‌ స్టాక్స్‌ అప్‌మూవ్‌కు కొంత సమయం పట్టే అవకాశం ఉండగా.. స్మాల్‌ స్టాక్స్‌ మాత్రం ర్యాలీని కొనసాగించే అవకాశం ఉందని ఎడిల్‌వీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌ కపూర్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చిలో ర్యాలీ చేసిన లార్జ్‌క్యాప్‌ షేర్లు.. ఈనెల్లో తగ్గిన కారణంగా.. ఈ షేర్లలో అప్‌ట్రెండ్‌కు అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు.

ఐటీ ఫలితాలతో క్యూ4 ఎర్నింగ్స్‌ బోణి
దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ఈవారంలోనే ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. నాలుగో త్రైమాసికం (క్యూ4) ఫలితాలతో పాటు పూర్తి ఏడాది (2018–19) ఫలితాలను ఇరు సంస్థలు శుక్రవారం వెల్లడించనున్నాయి. టీసీఎస్‌ వరుస నిరంతర (సీక్వెన్షియల్‌ కాన్‌స్టెంట్‌) కరెన్సీ వృద్ధి క్యూ4లో 2% ఉండేందుకు అవకాశం ఉండగా.. డాలర్‌ రెవెన్యూ (క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌) వృద్ధి 2% ఉండవచ్చని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనాకట్టింది. ఇన్ఫీ డాలర్‌ ఆదాయ వృద్ధి 2–2.5% మేర ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తుండగా.. డిజిటల్‌ ట్యాలెంట్‌ కోసం అత్యధిక నిధులు కేటాయించడం వల్ల ఎబిటా మార్జిన్‌లో క్షీణత ఉండవచ్చని ప్రభుదాస్‌ లిలాధర్‌ అంచనావేసింది. ఇక 2020 రెవెన్యూ గైడెన్స్‌ అత్యంత కీలకంకానుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి..
ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మార్చి రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈ ఆర్థిక అంశాలు మార్కెట్‌కు కీలకమని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.  అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ఈఏడాదిలో 12 డాలర్ల మేర పెరిగి శుక్రవారం 70.41 డాలర్ల వద్ద ముగియగా.. ఆర్థిక వ్యవస్థ మందగించ వచ్చంటూ వస్తున్న అంచనాల నేపథ్యంలో ముడిచమురు ధరలు మరింత పెరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. క్రూడ్‌ 69–70.20 శ్రేణిలో కదలాడేందుకు అవకాశం ఉందని ఎడిల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ ఫారెక్స్‌ సజల్‌ గుప్తా అంచనావేశారు.  

11,760 పాయింట్లకు నిఫ్టీ..!
వీక్లీ ముగింపు ఆధారంగా చూస్తే.. నిఫ్టీ మరోసారి తన జీవితకాల గరిష్టస్థాయి అయిన 11,760 పాయింట్లను తాకేందుకు ప్రయత్నం చేయవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసని విశ్లేషించారు. అయితే ఇందుకు 11,570–11,532 స్థాయిలో ఈ సూచీ నిలదొక్కుకోవాల్సి ఉంటుందని, ఇక్కడ నిలిస్తేనే అప్‌ట్రెండ్‌కు అవకాశం ఉందని అన్నారయన.

5 సెషన్లలో రూ.8,634 కోట్ల విదేశీ నిధులు
విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈనెల్లోనూ జోరుగా కొనసాగుతోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)లు గడిచిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.8,634 కోట్లను భారత స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల్లో వీరు ఈక్విటీ మార్కెట్లో రూ.8,989 కోట్లను ఇన్వెస్ట్‌చేసి.. డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.355 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో నికర పెట్టుబడి 8,634 కోట్లుగా నమోదైంది. మార్చిలో రూ.45,981 కోట్లను పెట్టుబడిపెట్టిన వీరు.. ఈనెల ప్రారంభంలో కూడా అదే జోరును కొనసాగించారు. భారత్‌–పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడం, దేశ స్థూల ఆర్థిక అంశాలు మెరుగుపడడం, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానుందన్న అంచనాల నేపథ్యంలో విదేశీ నిధులు పెరుగుతున్నాయని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ హిమంశు శ్రీవాత్సవ విశ్లేషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement