pre-poll surveys
-
ఎన్నికలు, క్యూ4 ఫలితాలే కీలకం..!
ముంబై: దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల వేడి పెరుగుతోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. ఈవారంలోనే తొలి దశ ప్రారంభంకానుంది. గురువారం (ఏప్రిల్ 11న) జరిగే ఈ పోలింగ్.. సామాన్య పౌరులతో పాటు ఇటు మార్కెట్ వర్గాల్లోనూ వేడి పెంచుతోంది. ఎన్నికల నేపథ్యంలో వెలువడే ప్రీ–పోల్ సర్వేలు, తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నారనే ప్రధాన అంశాలు మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘సాధారణ ఎన్నికల అంశమే ప్రధానంగా ఈవారంలో మార్కెట్‌ను నడిపించనుంది. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉండనున్నాయనే కీలక అంశానికి ఈ ఎన్నికలే స్పష్టత ఇవ్వనున్నాయి. కచ్చితంగా ఇన్వెస్టర్ల దృష్టి పోల్స్‌పైనే ఉండనుంది’ అని సాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ శర్మ అన్నారు. ఎన్నికల వేడిలో ఫ్రెంట్‌లైన్ స్టాక్స్ అప్‌మూవ్‌కు కొంత సమయం పట్టే అవకాశం ఉండగా.. స్మాల్ స్టాక్స్ మాత్రం ర్యాలీని కొనసాగించే అవకాశం ఉందని ఎడిల్వీస్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చిలో ర్యాలీ చేసిన లార్జ్‌క్యాప్ షేర్లు.. ఈనెల్లో తగ్గిన కారణంగా.. ఈ షేర్లలో అప్‌ట్రెండ్‌కు అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు. ఐటీ ఫలితాలతో క్యూ4 ఎర్నింగ్స్ బోణి దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఈవారంలోనే ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. నాలుగో త్రైమాసికం (క్యూ4) ఫలితాలతో పాటు పూర్తి ఏడాది (2018–19) ఫలితాలను ఇరు సంస్థలు శుక్రవారం వెల్లడించనున్నాయి. టీసీఎస్ వరుస నిరంతర (సీక్వెన్షియల్ కాన్స్టెంట్) కరెన్సీ వృద్ధి క్యూ4లో 2% ఉండేందుకు అవకాశం ఉండగా.. డాలర్ రెవెన్యూ (క్వార్టర్ ఆన్ క్వార్టర్) వృద్ధి 2% ఉండవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ అంచనాకట్టింది. ఇన్ఫీ డాలర్ ఆదాయ వృద్ధి 2–2.5% మేర ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తుండగా.. డిజిటల్ ట్యాలెంట్ కోసం అత్యధిక నిధులు కేటాయించడం వల్ల ఎబిటా మార్జిన్లో క్షీణత ఉండవచ్చని ప్రభుదాస్ లిలాధర్ అంచనావేసింది. ఇక 2020 రెవెన్యూ గైడెన్స్ అత్యంత కీలకంకానుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు పేర్కొన్నాయి. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి.. ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మార్చి రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈ ఆర్థిక అంశాలు మార్కెట్‌కు కీలకమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఈఏడాదిలో 12 డాలర్ల మేర పెరిగి శుక్రవారం 70.41 డాలర్ల వద్ద ముగియగా.. ఆర్థిక వ్యవస్థ మందగించ వచ్చంటూ వస్తున్న అంచనాల నేపథ్యంలో ముడిచమురు ధరలు మరింత పెరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. క్రూడ్ 69–70.20 శ్రేణిలో కదలాడేందుకు అవకాశం ఉందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ హెడ్ ఫారెక్స్ సజల్ గుప్తా అంచనావేశారు. 11,760 పాయింట్లకు నిఫ్టీ..! వీక్లీ ముగింపు ఆధారంగా చూస్తే.. నిఫ్టీ మరోసారి తన జీవితకాల గరిష్టస్థాయి అయిన 11,760 పాయింట్లను తాకేందుకు ప్రయత్నం చేయవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. అయితే ఇందుకు 11,570–11,532 స్థాయిలో ఈ సూచీ నిలదొక్కుకోవాల్సి ఉంటుందని, ఇక్కడ నిలిస్తేనే అప్‌ట్రెండ్‌కు అవకాశం ఉందని అన్నారయన. 5 సెషన్లలో రూ.8,634 కోట్ల విదేశీ నిధులు విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈనెల్లోనూ జోరుగా కొనసాగుతోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)లు గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.8,634 కోట్లను భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల్లో వీరు ఈక్విటీ మార్కెట్లో రూ.8,989 కోట్లను ఇన్వెస్ట్‌చేసి.. డెట్ మార్కెట్ నుంచి రూ.355 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో నికర పెట్టుబడి 8,634 కోట్లుగా నమోదైంది. మార్చిలో రూ.45,981 కోట్లను పెట్టుబడిపెట్టిన వీరు.. ఈనెల ప్రారంభంలో కూడా అదే జోరును కొనసాగించారు. భారత్–పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడం, దేశ స్థూల ఆర్థిక అంశాలు మెరుగుపడడం, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానుందన్న అంచనాల నేపథ్యంలో విదేశీ నిధులు పెరుగుతున్నాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమంశు శ్రీవాత్సవ విశ్లేషించారు. -
త్రిపురలో లెఫ్ట్ అవుట్, బీజేపీకే ఓటు
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 18వ తేదీన జరిగిన ఎన్నికల్లో దాదాపు పాతికేళ్లపాటు అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతున్న సీపీఎం నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, ఐండైజనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ: ఆదిమ తెగలతో కూడిన ప్రజా సమాఖ్య)తో పొత్తుపెట్టుకున్న భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన ‘ప్రీపోల్ సర్వే’లో వెల్లడయింది. మొత్తం రాష్ట్ర అసెంబ్లీలోని 60 సీట్లకుగాను 59 సీట్లకు ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే. సీపీఎం అభ్యర్థి రామేంద్ర నారాయణ్ దెబ్బర్మా మరణంతో ఓ నియోజకవర్గంలో ఎన్నికలు మార్చి 12వ తేదీకి వాయిదా పడ్డాయి. ఓ రాష్ట్రంలో పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన వామపక్ష, మితవాత పార్టీల మధ్య ముఖాముఖి పోటీ జరగడం స్వతంత్య్ర భారతంలో ఇదే మొదటి సారి. 1993 నుంచి పాతికేళ్లపాటు వామపక్ష పార్టీ అయిన సీపీఎంను ఆదరించిన రాష్ట్ర ప్రజలు ‘చలో పల్టాయి’ అంటూ సంపూర్ణ మార్పు కోరుకోవడం కూడా చరిత్రాత్మకమే అవుతుంది. ఇది జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే మార్పు కాగలదు. త్రిపుర రాష్ట్రాన్ని చేజార్చుకోవడం అంటే సీపీఎం ఆఖరి కంచుకోటను కోల్పోవడమే. ఒక్క కేరళలో మినహా ఆ పార్టీ ప్రభుత్వం ఎక్కడా ఉండదన్న మాట. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.5 శాతం ఓట్లను సాధించిన స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించే స్థాయికి ఎదగడం ఊహించని పరిణామం. యాభై శాతానికి మించి ఓటర్లు తాము ఈ సారి బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని, తమకు మార్పు కావాలని ప్రీ పోల్ సర్వేలో తెలిపారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు. బీజేపీకి 31–36 సీట్లు వస్తాయని, దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్‌టీకి 3–6 సీట్లు వస్తాయని, సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్‌కు 19–23 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. 1978 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ త్రిపుర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతాను తెరవలేకపోయింది. తమ అంచనాల్లో మూడు శాతం పొరపాటు జరిగే అవకాశం ఇరువైపులా ఎటైనా ఉండవచ్చని, చివిరి నిమిషంలో, అంటే పోలింగ్ రోజున ఓటరును ప్రభావితం చేసే డబ్బు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోలేదని హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ వెల్లడించింది. తాము ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు 20 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజక వర్గంలో మూడు పోలింగ్ కేంద్రాల ప్రాతిపదికన 1200 మంది ఓటర్లను శాంపిల్‌గా తీసుకొని సర్వే నిర్వహించినట్లు పీపుల్స్ పల్స్ తెలియజేసింది. ఎన్నికల్లో ఏది అతిపెద్ద సమస్యని ప్రశ్నించగా 52.3 శాతం మంది అభివద్ధి అని, 16.6 శాతం నిరుద్యోగం అని సమాధానం ఇచ్చారు. ఎవరు అధికారంలోకి వస్తే అభివద్ధి జరుగుతుందని అనుకుంటున్నారని ప్రశ్నించగా, 49.7 శాతం మంది బీజేపీ అని, 37 శాతం మంది సీపీఎం అని చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వద్ధులు సీపీఎం వైపు మొగ్గు చూపగా, 60 ఏళ్లు లోపు యువత బీజేపీ వైపు మొగ్గు చూపింది. ‘చలో పల్టాయి’ అనే బీజేపీ నినాదం యువతపై ఎక్కువ ప్రభావం చూపింది. -
కర్ణాటకలో కాక పుట్టిస్తున్న పోల్ సర్వేలు
సాక్షి, బెంగళూరు : కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీలు.. ఎన్నికల శంఖాన్ని పూరించాయి.కర్ణాటకలో విజయం సాధించడం ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్‌కు అత్యంత కీలకంగా మారింది. దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలోనైనా అధికారంలోకి రావాలని బీజేపీ, చేతిలో ఉన్న అతి పెద్ద రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. గెలిస్తే.. మరోసారి ముఖ్యమంత్రి సిద్దరామయ్యే అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. 2013లో.. కర్ణాటకకు 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని 122 సీట్లతో అధికారంలోకి తెచ్చిన సిద్దరామయ్య మీదే ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి బయటకొచ్చిన యడ్యూరప్ప పరోక్షంగా ఆ పార్టీ ఓటమిని శాసించాడు. ఆ ఎన్నికల్లో బీజేపీకి జేడీఎస్‌కు సమానంగా 40 సీట్లు వచ్చాయి. తాజా పరిస్థితులు కర్ణాటకలో 2013తో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితుల్లో తీవ్రంగా మార్పులు వచ్చాయి. ప్రధానంగా అప్పుడు బీజేపీ అప్పుడు దూరం చేసుకున్న యడ్యూరప్పని తిరిగి పార్టీలోకి తెచ్చుకోవడంతో పాటు.. ప్రచార పగ్గాలు కూడా అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యడ్యూరప్పకు బలమైన లింగాయత్ సామాజిక వర్గం అండ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా జరగనుందని పలు ప్రీ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ప్రీ-పోల్ సర్వేలు ఎవరు చేశారు? కర్ణాటక ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండగానే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్న అంశంపై మూడు సంస్థలు ప్రీ పోల్ సర్వేలు జరిపాయి. సీ-ఫోర్స్, క్రియేటివ్ సెంటర్ ఫర్ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టడీస్ (సీఓపీఎస్), ఏజెడ్-సువర్నా న్యూస్ సంస్థలు ప్రీ-పోల్ సర్వేలు నిర్వహించాయి. ప్రీ - పోల్ సర్వేల ఫలితాలు? సీ-ఫోర్స్ ప్రీ పోల్ సర్వే : . కాంగ్రెస్-బీజేపీ మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగనుంది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పార్టీ జేడీఎస్ మాత్రం బరిలో దాదాపు తోక పార్టీగా నిలిచే అవకాశాలున్నాయి. సర్వేలో మెజారిటీ ప్రజలు సిద్దరామయ్య తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తేలింది. . మొత్తం మీద కాంగ్రెస్-బీజేపీలు అటూఇటుగా 60 నుంచి 72 సీట్లు సాధిస్తాయని సీ - పోర్స్ సర్వే తెలిపింది. జేడీఎస్‌కు 24 నుంచి 30 సీట్లు లభించే అవకాశం ఉంది. సీఓపీఎస్ సర్వే : క్రియేటివ్ సెంటర్ ఫర్ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టడీస్ సర్వే మాత్రం బీజేపీకి పూర్తి అనుకూలంగా ఫలితాలను ప్రకటించింది. 2018 ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా అధికారంలోకి వస్తుందని సీఓపీఎస్ పేర్కొంది. బీజేపీ నుంచి యడ్యూరప్ప మరోసారి మఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని సర్వే తెలిపింది. బీజేపీకి 117 సీట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. అదే విధంగా కాంగ్రెస్‌కు 86 సీట్లు, జేడీఎస్‌కు 25 సీట్లు రావచ్చని సర్వే తెలిపింది. ఏజెడ్ సువర్నా సర్వే : ఏజెడ్ సువర్నా సర్వే మాత్రం 2018 ఎన్నికల్లో కర్నాటకలో హంగ్ అసెంబ్లీ రావచ్చని ప్రకటించింది. కాంగ్రెస్‌కు 74 నుంచి 93 సీట్లు వస్తాయని తెలిపింది. అదే విధంగా బీజేపీకి 77 నుంచి 99 సీట్లు వస్తాయని, జేడీఎస్‌కు 11 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే ప్రకటించింది. -
ప్రజలు నేను సీఎం కావాలనుకుంటున్నారు
గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ నాగ్‌పూర్/పార్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ప్రీ-పోల్ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి ఆశావహులు మనసులో మాట బయటపెడుతున్నారు. సీఎం పోస్టును తాను చేపట్టాలని ప్రజలు అనుకుంటున్నారని దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె, ఎమ్మెల్యే పంకజ చెప్పారు. ‘నా పనే నన్ను ఆ పీఠం దగ్గరికి చేరుస్తుందని ఇదివరకు చెప్పా. మా నాన్న సీఎం కావాలని జనం అనుకున్నారు. నాకు ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే నేను సీఎంగా ఉంటానని ఎప్పుడూ చెప్పలేదు’ అని ఆమె తన నియోజకవర్గమైన పార్లీలో ఓటేసిన అనంతరం చెప్పారు. -
ఆప్‌కు అన్ని సీట్లు రాకపోవచ్చు: సుష్మా
ఆమ్ ఆద్మీ పార్టీకి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 50-60 వరకు లోక్‌సభ స్థానాలు రావొచ్చని, అవి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం చేపట్టడానికి అడ్డం పడొచ్చంటూ కొన్ని సర్వేలు చెప్పడాన్ని లోక్‌సభలో విపక్షనేత, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ తేలిగ్గా తీసుకున్నారు. ఈ సర్వేలు ఎప్పుడూ అంత నిజం కాకపోవచ్చని ఆమె అన్నారు. పార్టీ పెట్టి ఏడాది అయినా.. అప్పుడే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ లాంటి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పలు రాజకీయ పార్టీలు ఖంగుతిన్నాయి. ఇక వరుసపెట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంపై ఆమె స్పందిస్తూ ఈ విషయంలో కఠిన విచారణ జరిపించాలన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా ర్యాలీలో పాల్గొనేందుకు ఆమె నాగ్‌పూర్ వచ్చారు.