సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 18వ తేదీన జరిగిన ఎన్నికల్లో దాదాపు పాతికేళ్లపాటు అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతున్న సీపీఎం నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, ఐండైజనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ: ఆదిమ తెగలతో కూడిన ప్రజా సమాఖ్య)తో పొత్తుపెట్టుకున్న భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన ‘ప్రీపోల్ సర్వే’లో వెల్లడయింది. మొత్తం రాష్ట్ర అసెంబ్లీలోని 60 సీట్లకుగాను 59 సీట్లకు ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే. సీపీఎం అభ్యర్థి రామేంద్ర నారాయణ్ దెబ్బర్మా మరణంతో ఓ నియోజకవర్గంలో ఎన్నికలు మార్చి 12వ తేదీకి వాయిదా పడ్డాయి.
ఓ రాష్ట్రంలో పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన వామపక్ష, మితవాత పార్టీల మధ్య ముఖాముఖి పోటీ జరగడం స్వతంత్య్ర భారతంలో ఇదే మొదటి సారి. 1993 నుంచి పాతికేళ్లపాటు వామపక్ష పార్టీ అయిన సీపీఎంను ఆదరించిన రాష్ట్ర ప్రజలు ‘చలో పల్టాయి’ అంటూ సంపూర్ణ మార్పు కోరుకోవడం కూడా చరిత్రాత్మకమే అవుతుంది. ఇది జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే మార్పు కాగలదు. త్రిపుర రాష్ట్రాన్ని చేజార్చుకోవడం అంటే సీపీఎం ఆఖరి కంచుకోటను కోల్పోవడమే. ఒక్క కేరళలో మినహా ఆ పార్టీ ప్రభుత్వం ఎక్కడా ఉండదన్న మాట.
2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.5 శాతం ఓట్లను సాధించిన స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించే స్థాయికి ఎదగడం ఊహించని పరిణామం. యాభై శాతానికి మించి ఓటర్లు తాము ఈ సారి బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని, తమకు మార్పు కావాలని ప్రీ పోల్ సర్వేలో తెలిపారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు. బీజేపీకి 31–36 సీట్లు వస్తాయని, దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్‌టీకి 3–6 సీట్లు వస్తాయని, సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్‌కు 19–23 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. 1978 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ త్రిపుర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతాను తెరవలేకపోయింది.
తమ అంచనాల్లో మూడు శాతం పొరపాటు జరిగే అవకాశం ఇరువైపులా ఎటైనా ఉండవచ్చని, చివిరి నిమిషంలో, అంటే పోలింగ్ రోజున ఓటరును ప్రభావితం చేసే డబ్బు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోలేదని హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ వెల్లడించింది. తాము ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు 20 నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజక వర్గంలో మూడు పోలింగ్ కేంద్రాల ప్రాతిపదికన 1200 మంది ఓటర్లను శాంపిల్‌గా తీసుకొని సర్వే నిర్వహించినట్లు పీపుల్స్ పల్స్ తెలియజేసింది.
ఎన్నికల్లో ఏది అతిపెద్ద సమస్యని ప్రశ్నించగా 52.3 శాతం మంది అభివద్ధి అని, 16.6 శాతం నిరుద్యోగం అని సమాధానం ఇచ్చారు. ఎవరు అధికారంలోకి వస్తే అభివద్ధి జరుగుతుందని అనుకుంటున్నారని ప్రశ్నించగా, 49.7 శాతం మంది బీజేపీ అని, 37 శాతం మంది సీపీఎం అని చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వద్ధులు సీపీఎం వైపు మొగ్గు చూపగా, 60 ఏళ్లు లోపు యువత బీజేపీ వైపు మొగ్గు చూపింది. ‘చలో పల్టాయి’ అనే బీజేపీ నినాదం యువతపై ఎక్కువ ప్రభావం చూపింది.
Comments
Please login to add a commentAdd a comment