ఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి (Ramesh Bidhuri) మరోసారి నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి అతిషి మర్లెనా సింగ్ తన తండ్రినే మార్చేసిందంటూ కొత్త వివాదానికి తెరతీశారు.
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ (delhi assembly elections) ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ (bjp) విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మోదీ ఇప్పటికే ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. పనిలో పనిగా ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదంతో ఢిల్లీ ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తున్నారు.
ఇక ఆయా పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.
👉చదవండి : ‘శీష్‌మహల్’ కోసం పెట్టిన ఖర్చులు చూస్తే మీకు కళ్లు బైర్లు కమ్ముతాయ్
మొన్నటికి మొన్న ఓటర్లు తనని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేస్తానో ఉదహరిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. రమేష్ బిదురితో పాటు బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో తాను ప్రియాంక గాంధీ గురించి అలా మాట్లాడాల్సింది కాదంటూ క్షమాపణలు చెప్పారు.
అలా క్షమాపణలు చెప్పారో లేదో.. కొన్ని గంటల వ్యవధిలో సీఎం అతిషీపై నోరు పారేసుకున్నారు. ఆమె(అతిషి) ఇంటి పేరు మర్లేనా నుంచి సింగ్‌గా మారింది. తన తండ్రినే మార్చేసింది. అవినీతి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనని ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం చేశారు. అదే క్రేజీవాల్ ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్నారు. ఈ ఇద్దరి తీరు ఆమ్ ఆద్మీ పార్టీ లక్షణాల్ని ప్రతిబింబించేలా ఉన్నాయని ’ మండిపడ్డారు.
అంతేకాదు, మన సైనికులు మరణానికి కారణమైన ఉగ్రవాది అఫ్జల్ గురు మరణశిక్షకు వ్యతిరేకంగా అతిషి మర్లెనా తల్లిదండ్రులు క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించారు. అఫ్జల్ గురు మరణానికి క్షమాపణలు కోరిన వారికి మీరు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా? అని నేను ఢిల్లీ ప్రజలను ప్రశ్నించారు.
ప్రస్తుతం అతిషిపై రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతుండగా..బీజేపీ నేతలు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.
బీజేపీ నేతలు హద్దు మీరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని దుర్భాషలాడుతున్నారు. ఢిల్లీ ప్రజలు మహిళా ముఖ్యమంత్రిని అవమానించడాన్ని సహించరు. ఢిల్లీ మహిళలందరూ దీనికి ప్రతీకారం తీర్చుకుంటారు ’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment