సాక్షి, బెంగళూరు : కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీలు.. ఎన్నికల శంఖాన్ని పూరించాయి.కర్ణాటకలో విజయం సాధించడం ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్‌కు అత్యంత కీలకంగా మారింది. దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలోనైనా అధికారంలోకి రావాలని బీజేపీ, చేతిలో ఉన్న అతి పెద్ద రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. గెలిస్తే.. మరోసారి ముఖ్యమంత్రి సిద్దరామయ్యే అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.
2013లో..
కర్ణాటకకు 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని 122 సీట్లతో అధికారంలోకి తెచ్చిన సిద్దరామయ్య మీదే ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి బయటకొచ్చిన యడ్యూరప్ప పరోక్షంగా ఆ పార్టీ ఓటమిని శాసించాడు. ఆ ఎన్నికల్లో బీజేపీకి జేడీఎస్‌కు సమానంగా 40 సీట్లు వచ్చాయి.
తాజా పరిస్థితులు
కర్ణాటకలో 2013తో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితుల్లో తీవ్రంగా మార్పులు వచ్చాయి. ప్రధానంగా అప్పుడు బీజేపీ అప్పుడు దూరం చేసుకున్న యడ్యూరప్పని తిరిగి పార్టీలోకి తెచ్చుకోవడంతో పాటు.. ప్రచార పగ్గాలు కూడా అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యడ్యూరప్పకు బలమైన లింగాయత్ సామాజిక వర్గం అండ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా జరగనుందని పలు ప్రీ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
ప్రీ-పోల్ సర్వేలు ఎవరు చేశారు?
కర్ణాటక ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండగానే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్న అంశంపై మూడు సంస్థలు ప్రీ పోల్ సర్వేలు జరిపాయి. సీ-ఫోర్స్, క్రియేటివ్ సెంటర్ ఫర్ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టడీస్ (సీఓపీఎస్), ఏజెడ్-సువర్నా న్యూస్ సంస్థలు ప్రీ-పోల్ సర్వేలు నిర్వహించాయి.
ప్రీ - పోల్ సర్వేల ఫలితాలు?
సీ-ఫోర్స్ ప్రీ పోల్ సర్వే : . కాంగ్రెస్-బీజేపీ మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగనుంది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పార్టీ జేడీఎస్ మాత్రం బరిలో దాదాపు తోక పార్టీగా నిలిచే అవకాశాలున్నాయి. సర్వేలో మెజారిటీ ప్రజలు సిద్దరామయ్య తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తేలింది. .
- మొత్తం మీద కాంగ్రెస్-బీజేపీలు అటూఇటుగా 60 నుంచి 72 సీట్లు సాధిస్తాయని సీ - పోర్స్ సర్వే తెలిపింది. జేడీఎస్‌కు 24 నుంచి 30 సీట్లు లభించే అవకాశం ఉంది.
సీఓపీఎస్ సర్వే : క్రియేటివ్ సెంటర్ ఫర్ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టడీస్ సర్వే మాత్రం బీజేపీకి పూర్తి అనుకూలంగా ఫలితాలను ప్రకటించింది. 2018 ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా అధికారంలోకి వస్తుందని సీఓపీఎస్ పేర్కొంది. బీజేపీ నుంచి యడ్యూరప్ప మరోసారి మఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని సర్వే తెలిపింది.
- బీజేపీకి 117 సీట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. అదే విధంగా కాంగ్రెస్‌కు 86 సీట్లు, జేడీఎస్‌కు 25 సీట్లు రావచ్చని సర్వే తెలిపింది.
ఏజెడ్ సువర్నా సర్వే : ఏజెడ్ సువర్నా సర్వే మాత్రం 2018 ఎన్నికల్లో కర్నాటకలో హంగ్ అసెంబ్లీ రావచ్చని ప్రకటించింది. కాంగ్రెస్‌కు 74 నుంచి 93 సీట్లు వస్తాయని తెలిపింది. అదే విధంగా బీజేపీకి 77 నుంచి 99 సీట్లు వస్తాయని, జేడీఎస్‌కు 11 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment