సాక్షి, బెంగళూరు : గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత బీజేపీ తన దృష్టిని దక్షిణాది మీద కేంద్రీకరించింది. అందులోనూ గతంలో అధికారంలో ఉన్న కర్ణాటక మీద ప్రత్యేకదృష్టిని సారించింది. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా రెండు రాష్ట్రాలను గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కమలం నేతలు కర్ణాటకను చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
గుజరాత్ ఫలితం బయటకు రాగానే సిద్దరామయ్య ప్రభుత్వంపై బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప ట్విటర్ వేదికగా మాటల యుద్ధం మొదలు పెట్టారు. సిద్దరామయ్య ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందంటూ ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలు అభివృద్ధిని, సుపరిపాలనను కోరుకుంటున్నారంటూ మరో ట్వీట్ చేశారు. సిద్దరామయ్య ప్రభుత్వానికి ప్యాకప్ చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ.. యడ్యూరప్ప తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
హస్తానికి ఎదురుగాలేనా?
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి తప్పదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. కన్నడ రాష్ట్రంలోనూ గుజరాత్ తరహా ఫలితమే వస్తుందని ప్రముఖ ఆర్థిక వేత్త, రాజకీయ విశ్లేషకులు నరేందర్ ఫణి చెబుతున్నారు. పంజాబ్‌లో అధికార బదలాయింపు ఎందుకు జరిగిందో.. ఇక్కడ కూడా అదే కారణాలతోనే సిద్దరామయ్య ఓటమి చెందే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. అయితే కాంగ్రెస్-బీజేపీ మధ్య నువ్వా-నేనా అన్న రీతిలో పోరాటం ఉంటుందని కూడా ఆయన చెబుతున్నారు. ఇదిలావుండగా.. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) కర్ణాటక ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సిద్దరామయ్య ప్రతికూలతలు
కొంతకాలంగా సిద్దరామయ్య ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు కర్ణాటకలో తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అవే నేడు కాంగ్రెస్ గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా బీజేపీకి వెన్నుముకలా ఉండే లింగాయత్ సామాజిక వర్గంపై జరిగిన చర్చ ప్రధానమైనది. అంతేకాక బెంగళూరు మెట్రో స్టేషన్‌లలో హిందీ భాషతో కూడిన సైన్ బోర్డులు కన్నడికుల ఆలోచనను మార్చిందని అంటున్నారు. మతపరమైన అంశాల్లో ప్రభుత్వ జోక్యం కూడా ప్రభావం చూపనుందని చెబుతున్నారు.
బీజేపీ పరిస్థితి
ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సిద్దరామయ్య ప్రభుత్వంపై మాటల దాడిని మొదలు పెట్టారు. ప్రధానంగా సిద్దరామయ్య ప్రభుత్వ అనినీతి లక్ష్యంగా చేసుకుని మోదీ విమర్శలు సంధిస్తున్నారు. అంతేకాక మైసూర్ పాలకుడు టిప్పు జయంతిని నిర్వహిచడంతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడిందనే వాదన ఉంది. ఇప్పటికే కోస్టల్ కర్ణాటకలో కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డేపై హిందూ అతివాదిగా ముద్రపడింది.
యడ్యూరప్పపై విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రాష్ట్ర బీజేపీలో లుకలుకలు అప్పుడే మొదలయ్యాయి. యడ్యూరప్పను ఆగస్టులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ కమిటీ ప్రకటించినా.. రాష్ట్ర నేతలు మాత్రం అందుకు సుముఖంగా లేరు. యడ్యూరప్ప విషయంపై పార్టీ చీఫ్.. అమిత్ షా రాష్ట్రనేతలతో సమీక్ష జరిపిన తరువాత పరిస్థితిలో కొంత వరకూ మార్పు వచ్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్థానిక సమస్యలు
గుజరాత్ విజయం తరువాత బీజేపీ స్థానిక సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో సిద్దరామయ్య ప్రభుత్వం చేసిన తప్పిదాలు బీజేపీకి ఆయుధాలుగా మారే అవాశం ఉందని వారు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment