సాక్షి, న్యూఢిల్లీ : ‘మేము 12 మందిని మంత్రులను చేస్తాం. ఆరు నుంచి ఎనిమిది మందికి చైర్మన్ పదవులు ఇస్తాం. ఎవరికైతే మంత్రి పదవులు ఇస్తామో, వారు తిరిగి ఎన్నికల్లో గెలిచేందుకు సహకరిస్తాం. అందుకు ప్రతి ఒక్కరికి పదేసి కోట్ల రూపాయలు ఇస్తాం. రేపు సాయంత్రం వరకల్లా 12, 14 మంది ఎమ్మెల్యేలు మన వెంట ఉంటారు’ అన్న మాటలు కర్ణాటక రాజకీయాలకు సంబంధించినవంటే వెంటనే ఈ మాటలు ఎవరన్నదో కూడా మనకు స్ఫురించక తప్పదు. గత ఫిబ్రవరి నెలలో ఓ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ఎమ్మెల్యే కుమారుడితో మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఫోన్‌లో మాట్లాడిన విషయాలు అంటూ నాడు ఓ ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది. ఇదంతా అబద్ధమని నాడు యెడియూరప్ప ఈ టేపును తీవ్రంగా ఖండించారు. ఇది ఎవరో తనపై పన్నిన కుట్ర తప్పించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర, కుతంత్రం తనకు లేనే లేదని వాదించారు. నీతి నియమాలకు కట్టుబడిన పార్టీ బీజేపీ అని కూడా చెప్పారు. ఐదు నెలల తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే నాటి ఆయన ఆడియో టేపు మాటలు నేడు అక్షరాల నిజమనిపించక తప్పదు. జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, వారిలో పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ రాజ్యసభ సభ్యుడు రమేశ్‌కు చెందిన ఓ ముంబై హోటల్లో మకాం పెట్టడం, హెచ్‌డీ కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, అది వీగిపోవడం, ఆయన స్థానంలో యెడియూరప్ప కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం తదితర పరిణామాలు రాజకీయ నాటకంలో రసవత్తర సన్నివేశాలని తెల్సినవే.
కుమారస్వామి తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందంటూ పదే పదే ఆరోపణలు చేసినా, 20, 25, 30 కోట్ల రూపాయలకు కూడా ఇస్తామంటూ బీజేపీ నేతలు ఆశ పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య సభాముఖంగా ఆరోపణలు చేసినా బీజేపీ శాసన సభ్యులు మౌనం వహించడంలో మర్మమేమి ? బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులకు 1800 కోట్ల రూపాయలకు పైగా పంచినట్లు తెలియజేస్తున్న యెడియూరప్ప డైరీ ఆదాయం పన్ను శాఖ చేతికి చిక్కిందంటూ ‘ది కారవాన్’ పత్రిక (మార్చి 22న) ఓ వార్తను ప్రచురించడం, 2008, మే నెలలో యెడ్యూరప్ప తన ప్రభుత్వం సుస్థిరత కోసం కాంగ్రెస్ నుంచి నలుగురు, జేడీఎస్ నుంచి ముగ్గురు శాసన సభ్యులను కొనుగోలు చేయడం, దాన్ని మీడియా ‘ఆపరేషన్ కమలా’గా అభివర్ణించడం తదితర పరిణామాలు దేన్ని సూచిస్తున్నాయి?
ఎమ్మెల్యేల బేరసారాలతో ప్రభుత్వాలను పడగొట్టడం కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం లేదా ఉన్న ప్రభుత్వాలను బలోపేతం చేసుకోవడం ఒక్క కర్ణాటకకు, ఒక్క గోవాకే పరిమితం కాలేదు. అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు ఇలా అడుసు తొక్కాయనే విషయం మనకు తెల్సిందే. అయితే దేశంలో నల్లడబ్బును వెలికి తీస్తామని, అవినీతి అంతు చూస్తామని, ఆదర్శ ప్రభుత్వాన్ని అందిస్తామని, తమది భిన్నమైన పార్టీ అంటూ చెప్పుకుంటూ వచ్చిన కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ నాయకులు నేడేమయ్యారన్నదే ప్రశ్న.
గోవాలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోవడం, వారిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం తెల్సిందే. గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడైన చంద్రకాంత్ కావ్లేకర్‌ను ‘మట్కా’ కింగని దూషించిన బీజేపీ నాయకులు, ఆయనపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా కూడా అధికారులను కోరారు. అలాంటి వ్యక్తిని పార్టీలో కలుపుకోవడమే కాకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడంలో అర్థం ఏమిటీ? బీజేపీలోకి తీసుకున్న గోవా మాజీ కాంగ్రెస్ నాయకుడు అతనాసియో మాన్సేర్రాట్ (బాబుష్)పై భూ ఆక్రమణ కేసులే కాకుండా ‘మైనర్ బాలికపై అత్యాచారం’ కేసులో కూడా విచారణ జరుగుతోంది. ‘సేవ్ గోవా ఫ్రమ్ బాబుష్’ అన్నది బీజేపీ గత ఎన్నికల నినాదం. ఈ రాజకీయ శక్తుల నుంచి ‘సేవ్ భారత్’ అన్న నినాదం ప్రజల నుంచి ఎప్పుడు వినిపిస్తుందో..! (చదవండి: బీజేపీకి కుమారస్వామి మద్దతు!)
Comments
Please login to add a commentAdd a comment