economic policies
-
నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు: చైనాతో పోటీ పడాలంటే..
కేంద్ర బడ్జెట్‌కు ముందు.. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌లో లోక్‌సత్తా ఎడిటర్ గిరీష్ కుబేర్ రచించిన మరాఠీ పుస్తకం "మేడ్ ఇన్ చైనా" ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వృద్ధిని ప్రోత్సహించడానికి భారతదేశానికి అనువైన ఆర్థిక విధానాలు అవసరమని అన్నారు. ఉద్యోగాల సృష్టిని పెంచడానికి, అసమానతలను తగ్గించగల సామాజిక ఆర్థిక నమూనా అవసరమని పేరొన్నారు.చైనాలో పరిస్థితి చాలా వేగంగా మారుతోంది. కోవిడ్ 19 తర్వాత చాలా దేశాలు చైనాతో వ్యాపారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని గడ్కరీ అన్నారు. చాలా కంపెనీలు మూతపడుతున్నాయి. చైనా నుంచి మనం నేర్చుకోవలసిన ఒక విషయం ఏమిటంటే? సోషలిస్ట్, కమ్యూనిస్ట్ లేదా పెట్టుబడిదారీగా మారడానికి ముందు.. మనం ఉపాధిని సృష్టించగల ఆర్థిక వ్యవస్థగా మారాలని ఆయన అన్నారు.ఉపాధిని సృష్టించి పేదరికాన్ని తొలగించగల సామాజిక ఆర్థిక నమూనా భారతదేశానికి అవసరమని ఆయన అన్నారు. ఒకసారి చైనా అధ్యక్షుడితో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ.. చైనీయులు తమ దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, ప్రజల భావజాలం ఎలా ఉన్నప్పటికీ దేశానికి ఉపయోగపడే పని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తనతో చెప్పారని అన్నారు.పేదరికాన్ని తొలగించడానికి, మూలధన పెట్టుబడులను ఆకర్షించడానికి.. దాని నుంచి ఉపాధిని సృష్టించడానికి, ఎగుమతులను పెంచడానికి మన ఆర్థిక విధానాలలో సౌలభ్యాన్ని తీసుకురావాలి గడ్కరీ అన్నారు. వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.గ్రామీణ, గిరిజన వర్గాల జనాభా పేదలుగా, ఉపాధి లేకుండా ఉంటే తలసరి ఆదాయం తగ్గుతుంది. ఇలా జరిగితే 'ఆత్మనిర్భర్ భారత్' సాధ్యం కాదని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. చైనా సాంకేతికతలో చాలా ముందుంది, దానితో పోటీ పడాలంటే భారతదేశం నాణ్యమైన తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి. పొరుగు దేశంతో పోటీపడే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.భారత ఆటోమొబైల్ రంగం ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని ఆయన అన్నారు. మెర్సిడెస్ ఛైర్మన్ ఇటీవల పూణేలో తనను కలుసుకున్నట్లు, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని తమ సంస్థ యోచిస్తున్నట్లు చెప్పారని గడ్కరీ తెలిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ ఆటోమొబైల్ రంగం మరింత వృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. -
మన్మోహన్ సింగ్‌పై గడ్కరీ ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రాజ్యసభ ఎంపీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఆయన ప్రశంసల జల్లు గుప్పించారు. ఆర్థిక సంస్కరణలకుగానూ దేశం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రుణపడి ఉందని గడ్కరీ మంగళవారం టీఐవోఎల్-2022 అవార్డుల కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశంలోని పేదలకు ప్రయోజనాలు అందించాలంటే ఉదారవాద ఆర్థిక విధానం అవసరం. 1991లో ఆర్థిక మంత్రిగా మనోహ్మన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు.. ఉదారవాద ఆర్థిక వ్యవస్థకు నాంది పలికి మన దేశానికి కొత్త దిశానిర్దేశం చేశాయి. సరళీకరణతో కొత్త దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్‌కు ఈ దేశం రుణపడి ఉంది అని గడ్కరీ పేర్కొన్నారు. మాజీ ప్రధాని సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల కారణంగానే 1990ల మధ్యకాలంలో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు నిర్మించడానికి డబ్బును సేకరించగలిగానని గడ్కరీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏ దేశమైనా అభివృద్ధిలో ఉదారవాద ఆర్థిక విధానం ఎంతగానో దోహదపడుతుందని, అందుకు చైనా మంచి ఉదాహరణ అని గడ్కరీ అన్నారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, భారత్‌కు మరిన్ని క్యాపెక్స్ పెట్టుబడి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’ -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
-
ఎన్నికలు, క్యూ4 ఫలితాలే కీలకం..!
ముంబై: దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల వేడి పెరుగుతోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. ఈవారంలోనే తొలి దశ ప్రారంభంకానుంది. గురువారం (ఏప్రిల్ 11న) జరిగే ఈ పోలింగ్.. సామాన్య పౌరులతో పాటు ఇటు మార్కెట్ వర్గాల్లోనూ వేడి పెంచుతోంది. ఎన్నికల నేపథ్యంలో వెలువడే ప్రీ–పోల్ సర్వేలు, తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నారనే ప్రధాన అంశాలు మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘సాధారణ ఎన్నికల అంశమే ప్రధానంగా ఈవారంలో మార్కెట్‌ను నడిపించనుంది. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉండనున్నాయనే కీలక అంశానికి ఈ ఎన్నికలే స్పష్టత ఇవ్వనున్నాయి. కచ్చితంగా ఇన్వెస్టర్ల దృష్టి పోల్స్‌పైనే ఉండనుంది’ అని సాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ శర్మ అన్నారు. ఎన్నికల వేడిలో ఫ్రెంట్‌లైన్ స్టాక్స్ అప్‌మూవ్‌కు కొంత సమయం పట్టే అవకాశం ఉండగా.. స్మాల్ స్టాక్స్ మాత్రం ర్యాలీని కొనసాగించే అవకాశం ఉందని ఎడిల్వీస్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చిలో ర్యాలీ చేసిన లార్జ్‌క్యాప్ షేర్లు.. ఈనెల్లో తగ్గిన కారణంగా.. ఈ షేర్లలో అప్‌ట్రెండ్‌కు అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు. ఐటీ ఫలితాలతో క్యూ4 ఎర్నింగ్స్ బోణి దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఈవారంలోనే ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. నాలుగో త్రైమాసికం (క్యూ4) ఫలితాలతో పాటు పూర్తి ఏడాది (2018–19) ఫలితాలను ఇరు సంస్థలు శుక్రవారం వెల్లడించనున్నాయి. టీసీఎస్ వరుస నిరంతర (సీక్వెన్షియల్ కాన్స్టెంట్) కరెన్సీ వృద్ధి క్యూ4లో 2% ఉండేందుకు అవకాశం ఉండగా.. డాలర్ రెవెన్యూ (క్వార్టర్ ఆన్ క్వార్టర్) వృద్ధి 2% ఉండవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ అంచనాకట్టింది. ఇన్ఫీ డాలర్ ఆదాయ వృద్ధి 2–2.5% మేర ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తుండగా.. డిజిటల్ ట్యాలెంట్ కోసం అత్యధిక నిధులు కేటాయించడం వల్ల ఎబిటా మార్జిన్లో క్షీణత ఉండవచ్చని ప్రభుదాస్ లిలాధర్ అంచనావేసింది. ఇక 2020 రెవెన్యూ గైడెన్స్ అత్యంత కీలకంకానుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు పేర్కొన్నాయి. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి.. ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మార్చి రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈ ఆర్థిక అంశాలు మార్కెట్‌కు కీలకమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఈఏడాదిలో 12 డాలర్ల మేర పెరిగి శుక్రవారం 70.41 డాలర్ల వద్ద ముగియగా.. ఆర్థిక వ్యవస్థ మందగించ వచ్చంటూ వస్తున్న అంచనాల నేపథ్యంలో ముడిచమురు ధరలు మరింత పెరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. క్రూడ్ 69–70.20 శ్రేణిలో కదలాడేందుకు అవకాశం ఉందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ హెడ్ ఫారెక్స్ సజల్ గుప్తా అంచనావేశారు. 11,760 పాయింట్లకు నిఫ్టీ..! వీక్లీ ముగింపు ఆధారంగా చూస్తే.. నిఫ్టీ మరోసారి తన జీవితకాల గరిష్టస్థాయి అయిన 11,760 పాయింట్లను తాకేందుకు ప్రయత్నం చేయవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. అయితే ఇందుకు 11,570–11,532 స్థాయిలో ఈ సూచీ నిలదొక్కుకోవాల్సి ఉంటుందని, ఇక్కడ నిలిస్తేనే అప్‌ట్రెండ్‌కు అవకాశం ఉందని అన్నారయన. 5 సెషన్లలో రూ.8,634 కోట్ల విదేశీ నిధులు విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈనెల్లోనూ జోరుగా కొనసాగుతోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)లు గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.8,634 కోట్లను భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల్లో వీరు ఈక్విటీ మార్కెట్లో రూ.8,989 కోట్లను ఇన్వెస్ట్‌చేసి.. డెట్ మార్కెట్ నుంచి రూ.355 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో నికర పెట్టుబడి 8,634 కోట్లుగా నమోదైంది. మార్చిలో రూ.45,981 కోట్లను పెట్టుబడిపెట్టిన వీరు.. ఈనెల ప్రారంభంలో కూడా అదే జోరును కొనసాగించారు. భారత్–పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడం, దేశ స్థూల ఆర్థిక అంశాలు మెరుగుపడడం, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానుందన్న అంచనాల నేపథ్యంలో విదేశీ నిధులు పెరుగుతున్నాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమంశు శ్రీవాత్సవ విశ్లేషించారు. -
ఆర్థిక విధానాలపై చర్చ అవసరం: జైట్లీ
ముంబై: నినాదాలు, ప్రజాకర్షణలు ఆర్థిక విధానాలను నడిపించలేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆర్థిక విధానాలపై వాస్తవాలు, పూర్తి సమాచారం ఆధారంగా తగిన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మనీకంట్రోల్ సంస్థ నిర్వహించిన వెల్త్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడారు. దేశంలో నాణ్యమైన చర్చలు కొరవడ్డాయన్న ఆయన, ముఖ్యంగా ఆర్థిక అంశాలపై ఆరోగ్యకరమైన చర్చ జరిగేలా జాతీయ స్థాయిలో ప్రయత్నం జరగాలన్నారు. కేవలం ప్రకటనలపైనే దృష్టి పెడుతున్నామని, దీనికి బదులు ఉత్పాదకత పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. -
ఆర్థిక విధానాలే గుత్తాధిపత్యానికి కారణం
హైదరాబాద్: నూతన ఆర్థిక విధానాలు గుత్తాధిపత్యానికి, ఆర్థిక అసమానతలకు కారణమయ్యాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జనవిజ్ఞాన వేదిక తెలంగాణ 30వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గుత్తాధిపత్య సంస్థల ఆకాంక్షలు ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొం దని, నేడు అత్యంత ఉన్నతమైన పరిజ్ఞానాన్ని గూగుల్, ఫేస్బుక్ లాంటి సంస్థలు తీసుకొస్తున్నాయన్నారు. వారు సృష్టించిన సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపైన, జిజ్ఞాసపై దాడి జరుగుతోందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 39వ ఆర్టికల్ ఉత్పత్తి శక్తులు ఎవరి చేతుల్లో కేంద్రీకరించరాదని చెబుతోందని, దీనికి భిన్నంగా నేటి పరిణామాలు కనిపిస్తున్నాయన్నారు. జాతీయ ఆదాయంలో 73% ఆదా యం ఒక్క శాతం జనాభా వద్దనే ఉందని, దీని వల్ల ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నా రు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యూట్రిషన్ శాస్త్రవేత్త డాక్టర్ మెహ్తాబ్ ఎస్.బాంజీ, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ పి.అంబేడ్కర్, డాక్టర్ భీమేశ్వర్రెడ్డి, డాక్టర్ టి.సుందరరామన్, ప్రొఫెసర్ శీలాప్రసాద్ పాల్గొన్నారు. -
వాళ్లే అసలైన ఉత్పత్తి శక్తులు
సందర్భం సంచారజాతుల వాళ్లు సాంప్రదాయ వృత్తులనుంచి ముందుకు సాగాలంటే వారి చిన్నచిన్న వ్యాపారాలకు ఆర్థికసాయం ఎంతో ముఖ్యమైంది. అప్పుడు మాత్రమే స్థిరత్వ జీవన విధానంవైపుకు ఈ కులాలు మళ్లుతాయి. తెలంగాణలో వెనుకబడిన వర్గాలను నిలబెట్టేందుకు, ప్రధానంగా సంచారజాతులకు అండదండగా నిలిచేందుకు కేసీఆర్ సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. సంచారజాతులు తమకాళ్లపై తాము నిలబడేందుకు ఏ సాయం ఏ మేరకు అందినా అది ఎంతో ప్రశంసనీయమైనదే అవుతుంది. తెలంగాణలోని బాగా వెనుకబడ్డ బీసీల జీవన ముఖచిత్రం మార్చటంపై కేసీఆర్ గురిపెట్టారు. దీంతో సంచారజాతులు కూడా స్థిరనివాసం వైపుకు వెళ్లటం జరుగుతుంది. వీరి జీవన విధానంలోనే మార్పు తెచ్చే దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తుంది. ఇప్పటికే బీసీలలో బాగా వెనుకబడ్డ కులాలు, సంచారజాతుల వాళ్లు చేస్తున్న పనులకు కొంత ప్రోత్సాహం, ఆర్థిక సాయం అందిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఒక్క హైదరాబాద్‌లోనే సంచారజాతుల వాళ్లు చేసే ఆధునికవృత్తి పనుల ద్వారా కొందరు వ్యక్తులుగా లాభపడుతున్నారు కానీ పని చేసే వారి స్థితిగతుల్లో మార్పులేదు. చెత్త ఏరుకునేవారు, పాత ప్లాస్టిక్ సామానులు సేకరించేవారు, రోజూ నగరంలో సేకరించి హోల్‌సేల్ వాళ్లకు అమ్ముతారు. చిన్నవ్యాపారులు ఈ సామాన్లు కొంటారు. పాత ఇనుము సామాన్లనంతా ఐరన్ ఫ్యాక్టరీలకు, పాతపేపర్లను కాగిత పరిశ్రమకు అందిస్తారు. సంచార జాతుల వాళ్లు అమ్మేవస్తువులు ఇతరులెవరూ అమ్మలేరు. వీళ్లలో గొప్ప మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి. పార్థీ(పిట్లలోళ్లు) వాళ్లు పూసలు, దువ్వెనలు, పక్కపిన్నీసులు అమ్ముతుంటారు. కొన్ని సంచార జాతులు, బుడిగ జంగాలు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతుంటారు. మొండిబండ కులస్తులు నెత్తి వెంట్రుకలను ఇంటింటికి తిరిగి సేకరిస్తారు. ఈ సేకరించిన వెంట్రుకల్ని కరెన్నీ కట్టల్లా కట్టలు కడతారు. వెంట్రుకలు ఇంత నల్లగా మనదేశంలోనే ఉంటాయి. ఈరకమైన వెంట్రుకలకు విదేశాల్లో డిమాండ్ బాగా ఉంటుంది. ఈ వెంట్రుకలను శుభ్రపరిచి యుకె, యుఎస్ఎ, నెదర్లాండ్స్‌కు ఎగుమతి చేస్తారు. దీని ద్వారా విగ్గులు తయారుచేస్తారు. డక్కలివాళ్లు మరికొందరు మ్యూజిక్ వస్తువులకు ఫ్రేమ్‌లు తయారుచేస్తారు. కొన్ని సంచారజాతుల వాళ్లు ఇంటింటికి తిరిగి కరివేపాకులు, డప్పులు, కొన్ని రకాల పప్పులు, ముగ్గులు, ముగ్గురాళ్లు, ఇసుకరాళ్లు, రోకళ్లు అమ్ముతారు. పెద్దపెద్ద షాపుల్లో సైతం అమ్మలేని వస్తువులను వీళ్లు తమనైపుణ్యంతో అమ్ముతారు. ఇది గొప్ప వ్యాపారకళ. పాత ఇనుము, పాతపేపర్లు, పాతప్లాస్టిక్ సామాన్లు దగ్గర నుంచి తలవెంట్రుకల వరకు వాటిని సేకరించేది, అమ్మేది, కొనేది అంతా పేదవాళ్లే. కాని ఇందుకు సంబంధించి ఒక్కహైదరాబాద్ నగరంలోనే రోజుకు లక్షల్లో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. దీనిపై వచ్చే ఆదాయం అంతా కొంతమంది ధనవంతుల చేతుల్లోకి పోతుంది. ఈ వృత్తులవారికి కో ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసి షేర్హోల్టర్లుగా చేస్తే సంచారజాతులు నిలబడగలుగుతాయి ఇనుము, పేపర్లు, ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాలన్నీ ప్రత్యామ్నాయ వృత్తులు. బాగా వెనుకబడ్డ కులస్తులైన ఈ సంచార, అర్థసంచార, ఆశ్రితకులాల వారికి రివాల్వింగ్ ఫండ్ కావాలి. ఈ ప్రత్నామ్నాయ వృత్తులకోసం కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటుచేసి వారుచేసే పనిని బట్టి ఆ కులాలకు ప్రత్యేకంగా కొంత మూలధనం సమకూర్చితే వారు మధ్యదళారుల చేతుల్లోంచి బైటపడతారు. సంచార జాతుల వాళ్లు వడ్డీలకు డబ్బుతెచ్చి వ్యాపారం చేస్తుంటారు. ఇది వీరి జీవితాలను గుల్లచేస్తోంది. వారి చిన్నచిన్న వ్యాపారాలకు ఆర్థికసాయం ఎంతో ముఖ్యమైంది. వీరికి ఆర్థికసాయం అందిస్తే, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా సమూహాలను ఏర్పాటు చేసి కొన్ని వస్తువులను ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటారు. అప్పుడే సంచారజాతులు ఉత్పత్తి కులాలుగా ఉత్పత్తి శక్తులుగా మారుతారు. హైదరాబాద్ నగరంలో సిగ్నల్స్ దగ్గర రోడ్లపైన, రైల్వే స్టేషన్ల దగ్గర వస్తువులను అమ్మేవాళ్తంతా సంచారజాతులవాళ్లే. వీళ్లు సిగ్నల్స్ దగ్గర వాహ నాలు ఆగినప్పుడు ఆ రెండు మూడు నిమిషాల్లోనే వస్తువులను వినియోగదారులకు అమ్మే నైపుణ్యాలున్నవారు. పిల్లల ఆట వస్తువులు, గొడుగులు, ఆట బొమ్మలు, వాహనాల సీట్ల వెనుక ఆధారంగా ఉండే మెత్తలు, కార్లు తుడిచే బట్టలు వీటన్నింటిని కొన్ని నిమిషాల్లో, సెకండ్లలో అమ్మగలుగుతారు. అయితే వీరు అమ్మే అనేక వస్తువులను వీళ్లు తయారు చేయగలుగుతారు. కాకపోతే ఈ వస్తువుల తయారీకి యాంత్రికపరమైన యంత్రాలు, సాంకేతిక పరి జ్ఞానం జోడించవలసి ఉంది. ఇందుకు వీరికి ఆర్థిక సాయం అందించవలసి ఉంటుంది. చిన్న చిన్న పెట్టుబడులతో పెట్టే చిన్న పరిశ్రమలను, అత్యంత వెనుకబడిన కులాలకు సంచారజాతుల వారికి అందించవలసి ఉంది. ఈ ఆధునికవృత్తులకు సంబంధించిన ఉత్పత్తి, శిక్షణ, నైపుణ్యం అందించేందుకు వీరి కోసం ప్రత్యేక సంస్థలను నెలకొల్పవలసి ఉంది. ఇందుకోసం కేసీఆర్ చేస్తున్న ఆలోచనలు ఫలిస్తే దేశానికి తెలంగాణ ఆదర్శమౌతుంది. జూలూరు గౌరీ శంకర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
భారత్ ఆర్థిక బాట బాగుంది..
న్యూఢిల్లీ: భారత్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు బాగున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్టీ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధికి దోహదపడే రీతిలో భారీ మౌలిక ప్రాజెక్టులకు పెట్టుబడులు అందుతున్నాయని అన్నారు. వృద్ధికి ఈ అంశం కీలకమని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల దేశంలో మధ్యకాలికం నుంచి దీర్ఘకాలంలో ఉత్పాదకత మెరుగుపడుతుందన్న అంచనాలను వెలువరించారు. వ్యవసాయం, తయారీ రంగాల్లో సైతం అవరోధాలు తొలగించడానికి తగిన కృషి జరుగుతున్నట్లు తెలిపారు. మూడు రోజుల అడ్వాన్సింగ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... * చమురు, గ్యాస్ నికర దిగుమతిదారుగా కొనసాగుతున్న భారత్, ఈ కమోడిటీల తక్కువ ధరల వల్ల అధిక ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతోంది. తద్వారా మౌలిక రంగం ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అవకాశం కలిగింది. * ఒకపక్క జనాభా పెరుగుతున్నా... తగిన పటిష్ట విధానాలు అవలంబించడం వల్ల వృద్ధికి ఎటువంటి అడ్డంకులూ ఏర్పడ్డం లేదు. * ఇక్కడ వృద్ధికి అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభా.. ఈ నేపథ్యంలో మార్కెట్ల విస్తృతి, సంస్కరణలకు కట్టుబడి ఉండడం, సాంకేతికంగా పురోగతి, ఆర్థిక వ్యవస్థలో సృజనాత్మకత అన్నీ వృద్ధికి బాటలు వేసే అంశాలే. * చమురు ధరలు దిగువ స్థాయిలో ఉండడం వల్ల... ఈ పరిణామం ద్రవ్యోల్బణం కట్టడి, సరళతర పరపతి విధానాలకు దోహదపడుతుంది. ఈ దిశలో భారత్ ముందుకు వెళుతోందని విశ్వసిస్తున్నా. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్య: జయంత్ సిన్హా కాగా అడ్వాన్సింగ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జయంత్ సిన్హా అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మందగించిన ఆర్థిక ఒడిదుడుకుల వల్ల రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్న కార్పొరేట్లను... ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ఒకే గాటన కట్టడం సరికాదని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం భారత్ పటిష్ట వృద్ధి బాటన నడుస్తోందన్నారు. అమెరికా, చైనా తరహాలోనే దీర్ఘకాలంలో పటిష్ట వృద్ధి బాటన నడవగలిగే సామర్థ్యాన్ని భారత్ ఆర్థిక వ్యవస్థ సముపార్జించుకుందన్నారు. జీడీపీ తలసరి ఇప్పటికీ చాలా తక్కువగా ఉందన్న ఆయన, ఈ విభాగంలో పురోగతికి తగిన అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం సైతం ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలిపారు. కొన్ని పారిశ్రామిక దేశాలు అనుసరిస్తున్న అసాధారణ ద్రవ్య విధానాలను వ్యవస్థ ఎదుర్కొనడంపై మదింపు జరపాలన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జయంత్ సిన్హా పిలుపును ఆయన సమర్థించారు. కొన్ని దేశాల సంకుచిత విధానాలు మొత్తం ప్రపంచంపై కొంత ప్రతికూలత చూపే అవకాశం ఉందని కూడా అన్నారు. -
బలమైన ఆర్థికశక్తిగా భారత్
‘నవశకానికి నాంది’ పుస్తకావిష్కరణలో కేంద్రమంత్రి దత్తాత్రేయ హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, పథకాల్లో మార్పులు భారత్‌ను ప్రపంచంలోనే బలమైన ఆర్థికశక్తిగా తీర్చిదిద్దుతాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ యువమోర్చా నేత, ఆర్థిక నిపుణులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి రాసిన ‘నవశకానికి నాంది’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ కోసం జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతిరహిత సుపరిపాలనతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, వాటి లోతుపాతులు, భవిష్యత్‌లో రాబోయే సానుకూల పరిణామాలను ‘నవశకానికి నాంది’ పుస్తకంలో వివరించారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పి.మురళీధర్‌రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ భారత్‌కు సరిపోయే ఆర్థిక విధానాలు, పథకాలతో మోదీ తెచ్చిన సం స్కరణలను, వాటి ప్రభావాలను ఈ పుస్తకంలో పొందుపర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ వి.రామారావు, జర్నలిస్టు దేవులపల్లి అమర్, ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పేరాల చంద్రశేఖర్‌రావు, వేణుగోపాలరెడ్డి, కుటుం బరావు తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై ఎంబీఏ విద్యార్థులు పట్టుసాధించాలి
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : మేనేజ్మెంట్ విద్యార్థులు అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై పట్టు సాధించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ జి.వి.చలం సూచించారు. స్థానిక ఏఎన్నార్ కళాశాల ఎంబీఏ విభాగంలో ‘అంతర్జాతీయ ఆర్థిక నిర్వహణలో వస్తున్న మార్పులు - భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై శనివారం సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా చలం మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక విధానాల్లో వస్తున్న మార్పుల ఫలి తంగా ఎంబీఏ విద్యార్థులకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశీయ ఆర్థిక నిర్వహణతో పోలిస్తే అంతర్జాతీయ ఆర్థిక నిర్వహణ చాలా సంక్లిష్టంగా ఉందన్నారు. ఆయా దేశాల వ్యాపార చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడం మంచిదని సూచించారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో విదేశీ ఆర్థిక నిర్వహణ ప్రాముఖ్యత భారీగా పెరిగిందన్నారు. కళాశాల ట్రెజరర్ కె.ఎస్.అప్పారావు, పీజీ కోర్సుల డెరైక్టర్ పి.నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.