కేంద్ర బడ్జెట్‌కు ముందు.. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌లో లోక్‌సత్తా ఎడిటర్ గిరీష్ కుబేర్ రచించిన మరాఠీ పుస్తకం "మేడ్ ఇన్ చైనా" ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వృద్ధిని ప్రోత్సహించడానికి భారతదేశానికి అనువైన ఆర్థిక విధానాలు అవసరమని అన్నారు. ఉద్యోగాల సృష్టిని పెంచడానికి, అసమానతలను తగ్గించగల సామాజిక ఆర్థిక నమూనా అవసరమని పేరొన్నారు.
చైనాలో పరిస్థితి చాలా వేగంగా మారుతోంది. కోవిడ్ 19 తర్వాత చాలా దేశాలు చైనాతో వ్యాపారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని గడ్కరీ అన్నారు. చాలా కంపెనీలు మూతపడుతున్నాయి. చైనా నుంచి మనం నేర్చుకోవలసిన ఒక విషయం ఏమిటంటే? సోషలిస్ట్, కమ్యూనిస్ట్ లేదా పెట్టుబడిదారీగా మారడానికి ముందు.. మనం ఉపాధిని సృష్టించగల ఆర్థిక వ్యవస్థగా మారాలని ఆయన అన్నారు.
ఉపాధిని సృష్టించి పేదరికాన్ని తొలగించగల సామాజిక ఆర్థిక నమూనా భారతదేశానికి అవసరమని ఆయన అన్నారు. ఒకసారి చైనా అధ్యక్షుడితో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ.. చైనీయులు తమ దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, ప్రజల భావజాలం ఎలా ఉన్నప్పటికీ దేశానికి ఉపయోగపడే పని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తనతో చెప్పారని అన్నారు.
పేదరికాన్ని తొలగించడానికి, మూలధన పెట్టుబడులను ఆకర్షించడానికి.. దాని నుంచి ఉపాధిని సృష్టించడానికి, ఎగుమతులను పెంచడానికి మన ఆర్థిక విధానాలలో సౌలభ్యాన్ని తీసుకురావాలి గడ్కరీ అన్నారు. వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.
గ్రామీణ, గిరిజన వర్గాల జనాభా పేదలుగా, ఉపాధి లేకుండా ఉంటే తలసరి ఆదాయం తగ్గుతుంది. ఇలా జరిగితే 'ఆత్మనిర్భర్ భారత్' సాధ్యం కాదని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. చైనా సాంకేతికతలో చాలా ముందుంది, దానితో పోటీ పడాలంటే భారతదేశం నాణ్యమైన తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి. పొరుగు దేశంతో పోటీపడే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత ఆటోమొబైల్ రంగం ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని ఆయన అన్నారు. మెర్సిడెస్ ఛైర్మన్ ఇటీవల పూణేలో తనను కలుసుకున్నట్లు, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని తమ సంస్థ యోచిస్తున్నట్లు చెప్పారని గడ్కరీ తెలిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ ఆటోమొబైల్ రంగం మరింత వృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment