భారత్ ఆర్థిక బాట బాగుంది..
న్యూఢిల్లీ: భారత్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు బాగున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్టీ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధికి దోహదపడే రీతిలో భారీ మౌలిక ప్రాజెక్టులకు పెట్టుబడులు అందుతున్నాయని అన్నారు. వృద్ధికి ఈ అంశం కీలకమని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల దేశంలో మధ్యకాలికం నుంచి దీర్ఘకాలంలో ఉత్పాదకత మెరుగుపడుతుందన్న అంచనాలను వెలువరించారు. వ్యవసాయం, తయారీ రంగాల్లో సైతం అవరోధాలు తొలగించడానికి తగిన కృషి జరుగుతున్నట్లు తెలిపారు. మూడు రోజుల అడ్వాన్సింగ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి...
* చమురు, గ్యాస్ నికర దిగుమతిదారుగా కొనసాగుతున్న భారత్, ఈ కమోడిటీల తక్కువ ధరల వల్ల అధిక ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతోంది. తద్వారా మౌలిక రంగం ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అవకాశం కలిగింది.
* ఒకపక్క జనాభా పెరుగుతున్నా... తగిన పటిష్ట విధానాలు అవలంబించడం వల్ల వృద్ధికి ఎటువంటి అడ్డంకులూ ఏర్పడ్డం లేదు.
* ఇక్కడ వృద్ధికి అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభా.. ఈ నేపథ్యంలో మార్కెట్ల విస్తృతి, సంస్కరణలకు కట్టుబడి ఉండడం, సాంకేతికంగా పురోగతి, ఆర్థిక వ్యవస్థలో సృజనాత్మకత అన్నీ వృద్ధికి బాటలు వేసే అంశాలే.
* చమురు ధరలు దిగువ స్థాయిలో ఉండడం వల్ల... ఈ పరిణామం ద్రవ్యోల్బణం కట్టడి, సరళతర పరపతి విధానాలకు దోహదపడుతుంది. ఈ దిశలో భారత్ ముందుకు వెళుతోందని విశ్వసిస్తున్నా.
ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్య: జయంత్ సిన్హా
కాగా అడ్వాన్సింగ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జయంత్ సిన్హా అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మందగించిన ఆర్థిక ఒడిదుడుకుల వల్ల రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్న కార్పొరేట్లను... ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ఒకే గాటన కట్టడం సరికాదని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం భారత్ పటిష్ట వృద్ధి బాటన నడుస్తోందన్నారు. అమెరికా, చైనా తరహాలోనే దీర్ఘకాలంలో పటిష్ట వృద్ధి బాటన నడవగలిగే సామర్థ్యాన్ని భారత్ ఆర్థిక వ్యవస్థ సముపార్జించుకుందన్నారు.
జీడీపీ తలసరి ఇప్పటికీ చాలా తక్కువగా ఉందన్న ఆయన, ఈ విభాగంలో పురోగతికి తగిన అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం సైతం ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలిపారు. కొన్ని పారిశ్రామిక దేశాలు అనుసరిస్తున్న అసాధారణ ద్రవ్య విధానాలను వ్యవస్థ ఎదుర్కొనడంపై మదింపు జరపాలన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ జయంత్ సిన్హా పిలుపును ఆయన సమర్థించారు. కొన్ని దేశాల సంకుచిత విధానాలు మొత్తం ప్రపంచంపై కొంత ప్రతికూలత చూపే అవకాశం ఉందని కూడా అన్నారు.