భారత్‌కు ఉజ్వల భవిత: ఐఎంఎఫ్
- 2014-15లో వృద్ధి 7.2 శాతం
- పలు రంగాల్లో సంస్కరణలు అమలు చేయాలని సూచన
వాషింగ్టన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 7.2% ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 7.5%గా ఉంటుందని పేర్కొంది. నిజానికి ప్రభుత్వ అంచనాలకన్నా ఇవి తక్కువ. కేంద్రం అంచనాల ప్రకారం ఈ రేట్లు వరుసగా 7.4%, 8-8.5% శ్రేణిలో ఉన్నాయి. అయితే ఆర్థిక రంగానికి సంబంధించి భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉందని ఐఎంఎఫ్ వెల్లడించింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువ స్థాయిలో కొనసాగుతుండటం, బంగారం దిగుమతులు తగ్గడం, కరెంట్ అకౌంట్ లోటు కట్టడి, విధాన నిర్ణయాల సానుకూలత వంటి అంశాలు దేశంలో ఆర్థిక పునరుత్తేజానికి దోహదపడతాయని విశ్లేషించింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా మారిందని ఇండియా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విడుదల చేసే వార్షిక నివేదికలో పేర్కొంది. ముఖ్యాంశాలివీ..
⇒ వ్యవస్థాగత సంస్కరణలను వేగవంతం చేస్తూ... పెట్టుబడుల ప్రక్రియ పునరుత్తేజానికి భారత్ తగిన చర్యలు తీసుకోవాలి.
⇒ కొత్తగా పెట్టుబడులు పెడుతున్న ప్రాజెక్టుల అమలు ప్రారంభమవుతోంది. ప్రత్యేకించి విద్యుత్, రవాణా రంగాల్లో ఇది కనబడుతోంది.
⇒ ఫైనాన్షియల్ రంగం బలోపేతమవుతోంది. ఆర్థిక వ్యవస్థలో దేశ ప్రజలందరినీ భాగస్వాముల్ని చేయడానికి దోహదపడే మరో అంశమిది.
⇒ అంతర్జాతీయంగా, దేశీయంగా కొన్ని సవాళ్లున్నాయి. అయితే వీటిని తట్టుకునే సామర్థ్యం భారత్‌కుంది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు అంతర్జాతీయంగా ప్రధాన సవాలు కాగా, దేశీయంగా చూస్తే కార్పొరేట్ రంగం బలహీనత కీలకం. దీనివల్ల మొండిబకాయిలు పెరిగే అవకాశముంది.
⇒ జీడీపీ గణాంకాల సవరణలు తయారీ, సేవల రంగాల నిజ పనితీరుకు దర్పణం పడుతున్నాయి.
⇒ ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వ చర్యలు తగిన విధంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలు హర్షణీయం.
⇒ వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో యువత ప్రధానపాత్ర పోషించనుంది. ప్రపంచంలో భారత్‌కే లభిస్తున్న ప్రత్యేక అవకాశమిది. 10 కోట్ల మంది జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశముంది. వీరికి ఉపాధి అవకాశాలు భారీగా కల్పించాల్సి ఉంది.
⇒ ఇంధనం, మైనింగ్, విద్యుత్, మౌలికరంగం, భూసేకరణ, పర్యావరణం, వ్యవసాయ, లేబర్ మార్కెట్, విద్యా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాల్లో సంస్కరణలను అమలు చేయాలి.